ఆచార్యా.. అయోమయం!

29 Dec, 2018 13:14 IST|Sakshi

ఏఎన్‌యూ నియామకాల్లో గందరగోళం

కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనపై ఆరోపణలు

భవిష్యత్‌ పరిస్థితులపై ఆందోళన

సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఇటీవల చేపట్టిన ఆచార్యుల నియామకాలు గందరగోళంగా మారాయి. నియామక ప్రక్రియ, ఉత్తర్వుల జారీ, ఆచార్యుల ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలతో సహా పలు అంశాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీ ఆర్ట్స్, సైన్స్‌ కళాశాలల్లోని పలు విభాగాల్లో ఎనిమిది ప్రొఫెసర్‌ పోస్టులకు నేరుగా నియామకాలు చేపట్టేందుకు గతంలో యూనివర్సిటీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ప్రొఫెసర్‌ పోస్టుల్లో కూడా రిజర్వేషన్లు పాటించాలని కోర్టుల్లో కేసులు ఉన్నాయి. ఏఎన్‌యూలో నియామకాలపై కూడా హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. దీంతో ఇంటర్వ్యూల ఫలితాల ప్రకటనలో చాలా కాలం జాప్యం జరిగింది. అసలు పోస్టులు భర్తీ చేస్తారా లేదా అనే గందరగోళం నెలకొంది. ఈ అంశం కోర్టులో కొనసాగుతుండగానే గత అక్టోబర్‌ చివరివారంలో కాస్‌ (కెరీర్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌) కింద పలు విభాగాల్లో ఏడుగురు అధ్యాపకులకు ప్రొఫెసర్లుగా యూనివర్సిటీ ఉన్నతాధికారులు పదోన్నతి కల్పించారు. ఇది జరిగిన నెలన్నరకే కోర్టు కేసులన్నీ క్లియర్‌ అయ్యాయంటూ ఈనెల 22న జరిగిన పాలక మండలి సమావేశంలో ప్రొఫెసర్‌ పోస్టు ఇంటర్వ్యూల్లో  జరిగిన నియామకాలకు ఆమోదం తెలిపారు.

సర్వీసు పరిగణనలో లోపాలు
దీనితోపాటు ప్రొఫెసర్‌ పోస్టుల ఎంపికలో గత సర్వీసులను పరిగణనలోకి తీసుకోవడంలో లోపాలు జరిగాయని పలువురు «అధ్యాపకులు వాపోతున్నారు. యూనివర్సిటీలో గతంలో పనిచేసిన టీచింగ్‌ అసిస్టెంట్‌ సర్వీసులను పరిగణనలోకి తీసుకోకుండా బయట అన్‌ఎయిడెడ్‌ కళాశాలల్లో పనిచేసిన అధ్యాపకుల తాత్కాలిక సర్వీసులను పరిగణనలోకి తీసుకుని ప్రొఫెసర్లుగా నియమించడం ఏమిటని అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. దీనితోపాటు ఏపీఏ స్కోర్‌ కోసం సమర్పించే సర్టిఫికెట్లలో ఏకకాలంలో రెండు సదస్సులకు హాజరైనట్లు సర్టిఫికెట్లు కూడా కొందరు సమర్పించారనే ఆరోపణలూ ఉన్నాయి.

కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనపై ఆరోపణలు
యూనివర్సిటీలో జరిగిన ప్రొఫెసర్‌ పోస్టులకు కోర్టు అడ్డంకులు లేవని, అందుకే పాలక మండలిలో నియామకాలకు ఆమోదం తెలిపామని యూనివర్సిటీ ఉన్నతాధికారులు చెబుతుండగా మరో వైపు నియామకాల్లో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాను హైకోర్టులో వేసిన పిటీషన్‌ ఆధారంగా ఏఎన్‌యూలో నియామాలకు సంబంధించిన ఫలితాలు ప్రకటించవద్దని కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని పాలకమండలి సమావేశంలో నిర్ణయం  తీసుకోవద్దని అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ జి. నరసింహారెడ్డి అనే కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పాలకమండలి సమావేశం ముందు రోజే ఏఎన్‌యూ వీసీ, రిజిస్ట్రార్‌లకు లేఖ పంపారు. దీనిని పరిగణనలోకి తీసుకోకుండానే పాలకమండలిలో నియామకాలకు ఆమోదం తెలిపారు. ఇది కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనే అవుతుందని పిటీషనర్‌ పేర్కొన్నారు.

నియామక ఉత్తర్వుల్లో లోపించిన స్పష్టత
ప్రొఫెసర్లుగా నియమితులైన ఎనిమిది మందికి అదే రోజున నియామక ఉత్తర్వులు అందజేశారు. అప్పటివరకు న్యాయపరమైన సమస్యలేమీ  లేవని చెప్పుకొచ్చిన యూనివర్సిటీ ఉన్నతాధికారులు నియామక ఉత్తర్వుల్లో మాత్రం కోర్టు ఉత్తర్వులకు లోబడే ఈ పోస్టుల్లో కొనసాగింపు ఉంటుందని పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కేసులేమీ లేనపుడు ఇక న్యాయపరమైన సమస్యలు ఎందుకు వస్తాయని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రొఫెసర్‌ పోస్టుల్లో చేరిన వారిలో ఏడుగురు ప్రస్తుతం ఏఎన్‌యూ కళాశాలల్లో పలు హోదాల్లో రెగ్యులర్‌ అధ్యాపకులుగా ఉన్నారు. ప్రొఫెసర్‌లుగా చేరితే గత ఉద్యోగాలకు రిజైన్‌ చేయాలి. రిజైన్‌ చేసి ప్రొఫెసర్‌ ఉద్యోగాల్లో చేరిన తరువాత కోర్టు నిర్ణయం వ్యతిరేకంగా వస్తే ప్రొఫెసర్‌ ఉద్యోగం పోతుంది. అప్పుడు రెండు ఉద్యోగాలకు అనర్హులవుతారు. దీంతో ఇప్పటివరకు ఉన్న ఉద్యోగాలకు రిజైన్‌ చేయకుండా లీన్‌ (దీర్ఘకాలిక సెలవు) పెట్టి ప్రొఫెసర్‌ ఉద్యోగాల్లో చేరాలని కూడా ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. ఇతర యూనివర్సిటీల్లో ఉద్యోగాలకు, విదేశాలకు వెళ్లే వారికే లీన్‌ ఇస్తారని, ఒకే యూనివర్సిటీలో పనిచేసే వారికి లీన్‌ నిబంధన ఏమిటనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ప్రొఫెసర్‌ పోస్టుల్లో నెలకొన్న గందరగోళంతో భవిష్యత్‌లో తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఉద్యోగాలు పొందిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు