రూ.311 కోట్లకు బురిడీ

19 Aug, 2019 02:40 IST|Sakshi

భీమవరం ఐడీబీఐ బ్యాంకుకు మోసం

భీమవరం: బ్యాంకులకు నకిలీపత్రాలు చూపించి రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు వేల కోట్లు స్వాహా చేసే సంఘటనలే మనం చూస్తున్నాం. ఈ జాడ్యం నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కేంద్రంగా ఐడీబీఐ బ్యాంకును ఎంచుకుని చేపలు, రొయ్యల చెరువుల సాగు పేరుతో రూ.311 కోట్లు నకిలీ పత్రాల ద్వారా కొట్టేశారు కొందరు మోసగాళ్లు.  2018 మార్చిలో 16 మందిపై కేసు నమోదైంది. రుణాలు చెల్లించకపోగా వారి చిరునామాలే దొరక్కపోవడంతో బురిడీ బాగోతం వెలుగుచూసింది.

భీమవరం ఐడీబీఐ బ్యాంకు బ్రాంచి ద్వారా రాజమండ్రి ఐడీబీఐ కార్యాలయం కూడా ఈ రుణాల మంజూరులో కీలకపాత్ర పోషించినట్లు చెబుతున్నారు. రుణాలు పొందిన వారికి అప్పటి బ్యాంకు అధికారులు కొంతమంది సహకారం అందించినట్లు సమాచారం. సీబీఐ దర్యాప్తు సందర్భంలో విషయాలు వెల్లడించకపోయినా భీమవరం లోని ఒక ఫ్యాన్సీ షాపు యజమాని ఈ రుణాల మంజూరుకు అప్పట్లో చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో ఉన్నతాధికా రులు  ఆరా తీయడం ప్రారంభించారు. దీనికి  అన్ని అర్హతలున్నా రుణం లభించని స్థానికులు కొందరు అక్రమ రుణాల విషయం ఉన్నతాధికారులకు చేరవేసినట్లు చెబుతున్నారు.

రుణాలు పొందిన వారిలో భీమవరం, కాకినాడ, హైదరాబాద్, ఆకివీడు, విజయవాడ తదితర ప్రాంతాలకు చెందినవారుండడం విశేషం. కేసు బిగుస్తుందని తెలిసిన కొంతమంది రాజకీయ ప్రముఖులతో బేరసారాలు చేయించి కొంత మొత్తం  చెల్లించగా ఇంకా పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నాయి. దీంతో సీబీఐ ఉచ్చు బిగించి బాకీదారుల ఆస్తుల స్వాధీనానికి, అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. నకిలీ పత్రాలు చూపించిన భూముల వివరాలను సీబీఐ అధికారులు జీఐఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా కూపీ లాగితే మొత్తం భూములు కొల్లేరు ప్రాంతానికి చెందినవిగా గుర్తించినట్లు తెలిసింది.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు