మాయలోళ్లు

20 Nov, 2018 12:20 IST|Sakshi

రికార్డులో పేర్లు మాయం

సీజేఎఫ్‌ఎస్‌ భూముల్లో బినామీల బాగోతం

అధికారపార్టీ నేతలకు వరం

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్న రెవెన్యూ ఉద్యోగులు

ఉద్యోగుల పిల్లలకూ భూములు

అర్హులకు అన్యాయం

పాత రికార్డులు బహిర్గతం చేస్తే వాస్తవాలు వెలుగులోకి

వరికుంటపాడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన లోకసాని దుర్గా, లోకసాని రాజ్యలక్ష్మిలకు సర్వే నంబర్‌ 196లో 4 ఎకరాల సీజేఎఫ్‌ఎస్‌ భూమి ఉంది. ఆ భూమిని సాగు చేసుకుంటూ వారు జీవనం సాగిస్తున్నారు. నాలుగు నెలల క్రితం కూడా భూములపై బ్యాంక్‌లో పంట రుణాలు తీసుకున్నారు. ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లో వారి పేర్లు కనిపించడం లేదు. తహసీల్దార్‌ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి. రాజ్యలక్ష్మికి భర్త మరణించాడు. ఉన్న భూములు కూడా లేకుండా చేస్తే మా పరిస్థితి ఏమిటని బాధితురాలు రోదిస్తోంది.

నెల్లూరు(పొగతోట): జిల్లాలోని దగదర్తి, బోగోలు, అల్లూరు తదితర మండలాల్లో వేల ఎకరాల సీజేఎఫ్‌ఎస్‌ భూములు బినామీల పేర్లతో ఆక్రమణకు గురయ్యాయి. జిల్లాలో 787 సొసైటీలు ఉండగా 99,623 ఎకరాల సీజేఎఫ్‌ఎస్‌ భూములు ఉన్నాయి. 65719 మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం సీజేఎఫ్‌ఎస్‌ సొసైటీలను రద్దు చేసి లబ్ధిదారులకు పట్టాలు మంజూరు చేసేలా జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. రెవెన్యూ అధికారులు సీజేఎఫ్‌ఎస్‌ భూముల సర్వే పూర్తి చేశారు. లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. ఈ భూములు పొందిన వారిలో అనేక మంది భూముల్లో లేరు. భూస్వాములు ఈ భూములను కొనుగోలు చేశారు. కొన్నిచోట్ల లబ్ధిదారులు భూముల్లో లేకపోవడంతో బినామీ పేర్లతో భూములు స్వాహా చేసేందుకు అధికారపార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారపార్టీ నాయకులు చెప్పిన విధంగా అనేక ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు నడుచుకుంటూ వారు సూచించిన పేర్లతో నివేదికలు సిద్ధం చేసి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. పట్టాలు పొందిన లబ్ధిదారుల్లో అనేక మంది మరణించారు. వారి వారసులు, కుటుంబ సభ్యులు భూములను సాగు చేసుకుంటున్నారు. మరణించిన వారి పేర్లను రికార్డుల నుంచి తొలగించి బినామీ పేర్లను చేర్చారు. పట్టాలు అర్హులైన వారి వద్ద ఉంటే రెవెన్యూ రికార్డుల్లో మాత్రం బినామీల పేర్లు దర్శనమిస్తున్నాయి. బినామీ పేర్లతో విలువైన పేదల భూములు కాజేసేందుకు అధికారపార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దాని ప్రకారం అధికారులతో చర్చించి బినామీల పేర్లు పట్టాలు మంజూరు చేయించేలా చర్యలు చేపడుతున్నారు. దీంతో అర్హులైన పేదలకు అన్యాయం జరుగుతోంది.

రెవెన్యూ ఉద్యోగుల వసూళ్లు
సొసైటీలను రద్దు చేసి లబ్ధిదారులకు పట్టాలు అందజేసే ప్రక్రియ జిల్లాలో వేగవంతంగా జరుగుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే మాటను రెవెన్యూ ఉద్యోగులు తూ.చ. తప్పకుండా పాటిస్తున్నారు. పట్టాలు కేటాయిస్తున్నామంటూ ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. తాము పేద ప్రజలమని, నగదు ఇవ్వలేమని లబ్ధిదారులు ప్రాధేయపడుతున్నా కనీసం రూ.2 వేలైనా ఇవ్వాలని, లేకుంటే పట్టాలు రావంటూ రెవెన్యూ ఉద్యోగులు వసూళ్లకు పాల్పడుతున్నారు. జిల్లాలో అనేక పంచాయతీల్లో సీజేఎఫ్‌ఎస్‌ జాబితాల్లో రెవెన్యూ ఉద్యోగుల పేర్లు ఉన్నాయి. గూడూరు, ఆత్మకూరు, కావలి డివిజన్లలోని మండలాల్లో సీజేఎఫ్‌ఎస్‌ జాబితాలో రెవెన్యూ సిబ్బంది పేర్లు కూడా ఉన్నాయి. ఈ విషయంపై కొంతమంది తహసీల్దార్లు మాట్లాడుతూ సిబ్బంది తల్లిదండ్రులకు భూములు ఉంటే వాటిని కుమారులకు కేటాయించడం జరుగుతుందని సమాధానం ఇవ్వడం గమనార్హం. రెవెన్యూ సిబ్బంది తల్లిదండ్రులకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే అందరి పేర్లు జాబితాలో ఉండాలి. రెవెన్యూ సిబ్బంది పేర్లు మాత్రమే జాబితాలో ఉండడం గమనార్హం. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

అక్రమంగా వసూలు చేస్తే కఠిన చర్యలు
సీజేఎఫ్‌ఎస్‌ భూములకు సంబంధించి పట్టాలు కేటాయించే ప్రక్రియ జరుగుతోంది. సర్వే ప్రక్రియ పూర్తయింది. అర్హులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటాం. పట్టాల మంజూరు విషయంలో లబ్ధిదారుల నుంచి అక్రమంగా నగదు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.   – కె.వెట్రిసెల్వి, జాయింట్‌ కలెక్టర్‌  

దగదర్తి మండలం ఉలవపాళ్ల గ్రామంలోని సర్వే నంబర్లు 46/3, 46/4, 46/5లలో కొండయ్య, మాల్యాద్రి, వెంకటస్వామిలకు 1976వ సంవత్సరంలో సీజేఎఫ్‌ఎస్‌ భూములను కేటాయించారు. లబ్ధిదారులు ఆ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 2002వ సంవత్సరానికి ముందు ఈ భూములను ఉద్యోగుల పిల్లలకు కేటాయిస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. భూములు కేటాయించే సమయానికి ఇద్దరు లబ్ధిదారుల వయస్సు ఒకరికి 12, మరొకరికి 8 సంవత్సరాలు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి సీజేఎఫ్‌ఎస్‌ భూములు కేటాయించడం గమనార్హం. 1979, 1982లో జన్మించిన వ్యక్తులకు 1992లో భూములు కేటాయించినట్లు అధికారులు రికార్డులు సృష్టించారు. అధికారపార్టీ నాయకులు, అధికారులు తలచుకుంటే ఏదైనా సాధ్యమని నిరూపించారు. భూములు ఆక్రమించిన వారు అధికారపార్టీ నాయకులకు కావాల్సిన వారు కావడంతో అధికారులు కూడా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. బాధితులు తమకు న్యాయం చేయాలని 16 సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు.

మరిన్ని వార్తలు