అమ్మ దొంగా

9 Apr, 2017 12:15 IST|Sakshi

► మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌లో చేతివాటం
► రూ.25 లక్షలకు పైగా నగదు కాజేసిన వైనం
► కేసు నమోదు.. అదుపులో డీపీవో

చిత్తూరు (అర్బన్‌): సాక్షాత్తు ఎస్పీ కార్యాలయంలో పనిచేసే వ్యక్తి చేతివాటం ప్రదర్శించాడు. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ పేరుతో తప్పుడు బిల్లులు సృష్టించి ఏకంగా రూ.25 లక్షలకు పైనే నొక్కేశాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై పోలీసులు శనివారం కేసు నమోదు చేసుకుని వెంకటేష్‌(26) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఎలా జరిగిందంటే?
చిత్తూరు నగరంలోని ప్రశాంత్‌నగర్‌ కాలనీ సమీపంలో ఉన్న జిల్లా పోలీసు కార్యాలయంలో వెంకటేష్‌ అనే అధికారి ఉన్నారు. ఇతను మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లుల చెల్లింపులు చేస్తుంటాడు. ఒక ఉద్యోగి రూ.70 వేలు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలని  దరఖాస్తు చేసుకున్నాడు. ఇందులో రెండు సెట్ల బిల్లులను ఎస్పీకి అందజేశాడు. పరిశీలించిన ఎస్పీ ఆ ఫైలును వెంకటేష్‌కు పంపారు. రెండు సెట్ల దరఖాస్తుల్లో ఒక దానికి రూ.70 వేలు బిల్లు చెసిన వెంకటేష్‌ ఆ మొత్తాన్ని సంబంధిత ఉద్యోగికి బ్యాంకు ఖాతాలోకి వేశాడు.

పది రోజుల తరువాత మళ్లీ రూ.70 వేల నగదు ఖాతాలో జమ అయింది. వెంటనే వెంకటేష్‌ ఆ ఉద్యోగికి ఫోన్‌ చేసి ‘ఆ మొత్తం వేరే వాళ్ల ఖాతాలో పడాల్సిందిపోయి పొరపాటున నీ ఖాతాలో పడిందని, డబ్బును తెచ్చి ఇవ్వాలని చెప్పాడు. రూ.70 వేలను వెంకటేష్‌ తీసుకున్నాడు. ఇలా గత ఏడాది జూన్‌ నుంచి ఇప్పటి వరకు రూ.25,18,050 కాజేశాడు.
ఎలా బయటపడిందంటే?
ఉద్యోగులు అనారోగ్యంతో ఇబ్బందులకు గురైనప్పుడు సొంతంగా నగదు ఖర్చు పెట్టుకుని తర్వాత రీయింబర్స్‌మెంట్‌ ద్వారా ఆ మొత్తాన్ని వెనక్కు తీసుకుంటారు. ఇటీవల ఓ కానిస్టేబుల్‌ బ్యాంక్‌ ఖాతాలోకి రూ.40 వేల వరకు నగదు జమ అయింది. దీన్ని గుర్తించిన కానిస్టేబుల్‌ తన బ్యాంకు ఖాతాలోకి వచ్చి పడ్డ నగదుపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. తాను రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోలేదని చెప్పాడు. విషయం ఎస్పీ శ్రీనివాస్‌ దృష్టికి వెళ్లింది. ఆయన ఏఎస్పీ అభిషేక్‌ మొహంతిని విచారణకు ఆదేశించారు. దీనిపై విచారించిన ఏఎస్పీ తమ శాఖలోని సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్టు గుర్తించారు. టూటౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు.

ఇంకా ఎంతమంది ప్రమేయముందో?
స్పెషల్‌ బ్రాంచ్‌ కానిస్టేబుల్‌ ఇచ్చిన ఫిర్యాదుతో చిత్తూరు టూటౌన్‌ పోలీసులు కేసు నమెదు చేశారు. వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దుర్గానగర్‌ కాలనీలో ఓ ఇల్లు కడుతున్నట్లు, డబ్బులు చాలకపోవడంతో ఇలా తప్పుడు బిల్లులు సృష్టించి నగదు కాజేసినట్లు అంగీకరించాడు. ఈ వ్యవహారంలో మరికొంత మంది పెద్దల ప్రమేయం ఉందని, పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అన్ని వివరాలు బయటకొస్తాయని సిబ్బంది చెబుతున్నారు.  
 

మరిన్ని వార్తలు