రూ.1.31 కోట్లు స్వాహా

10 Jun, 2014 02:36 IST|Sakshi
రూ.1.31 కోట్లు స్వాహా

కర్నూలు(కలెక్టరేట్): సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో స్వాహాపర్వం కొనసాగుతోంది. కమ్యూనిటీ సర్వీస్ ప్రొవైడర్లు(సీఎస్‌పీ) చేతివాటం మితిమిరుతోంది. వితంతువులు.. వికలాంగులు.. వృద్ధుల కడుపుకొట్టి అక్రమార్కులు తమ పబ్బం గడుపుకుంటున్నారు. సీఎస్‌పీ పోస్టులకు ఉన్నత స్థాయిలో పైరవీలు జరుగుతుండటం వీటి డిమాండ్‌కు అద్దం పడుతోంది. జిల్లాలోని 53 మండలాల్లో పింఛన్ల పంపిణీ అక్రమాలపై మూడో విడత సామాజిక తనిఖీ(సోషల్ ఆడిట్) జరుగుతోంది. మొదటి విడతలో రూ.38,97,370.. రెండో విడతలో రూ.72,33,145 దుర్వినియోగమైనట్లు స్పష్టమైంది.
 
 మూడో విడతలో 21 మండలాల్లో సామాజిక తనిఖీ పూర్తి కాగా.. రూ.19,74,095 దుర్వినియోగమైనట్లు తేల్చారు. స్మార్ట్ కార్డులు ఉన్న వారికి యాక్సిస్ బ్యాంకు ద్వారా.. స్మార్ట్ కార్డులు లేని వారికి ఎంపీడీఓల ద్వారా పింఛన్ల పంపిణీ జరుగుతోంది. ఎంపీడీఓల ద్వారా పంచాయతీ సెక్రటరీలు పంపిణీ చేస్తుండగా, యాక్సిస్ బ్యాంకు ద్వారా పినో కంపెనీ నియమించిన సీఎస్‌పీలు పంపిణీ చేపడుతున్నారు. ఎంపీడీఓల ద్వారా జరిగిన పింఛన్ల పంపిణీలో రూ.45,13,955, యాక్సిస్ బ్యాంకు ద్వారా చేపట్టిన పంపిణీలో రూ.85,90,655 బొక్కేశారు. మొత్తం రూ.1.31 కోట్లకు పైగా స్వాహా జరిగితే.. రికవరీ మాత్రం రూ.16.35 లక్షలే కావడం గమనార్హం. ఎంపీడీఓల ఆధ్వర్యంలో పింఛన్లు పంపిణీ చేసిన పంచాయతీ సెక్రటరీలు అడ్డగోలుగా పేదల సొమ్ము తినేసినా చర్యలు కరువయ్యాయి.
 
 దాదాపు వంద మంది పంచాయతీ సెక్రటరీలు, ఇతరులు సొమ్ము స్వాహా చేసినా తుగ్గలి మండలంలో మాత్రమే ఒకరిద్దరిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. తక్కిన వారిపై చర్యలు లేకపోగా.. రికవరీ కూడా చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇక పింఛన్లు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ పేమెంట్లను పంచాయతీ స్థాయిలోని కమ్యూనిటీ సర్వీస్ ప్రొవైడర్లు పంపిణీ చేస్తుండగా.. 90 శాతం మంది దోపిడీకి పాల్పడుతున్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ కూలీల నుంచి వారికి వచ్చే వేతనంలో రోజుకు రూ.10 కమిషన్ కింద తీసుకొని పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. పింఛన్ల పంపిణీలో చనిపోయిన వారు.. గ్రామాలు వదిలి వెళ్లిన వారి సంతకాలు ఫోర్జరీ చేసి స్వాహా చేస్తున్నట్లు సమాచారం. పింఛన్ కార్డుల్లో పేర్ల తప్పులను సైతం సీఎస్‌పీలు తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు.
 
 కలెక్టర్ ఆదేశాలు బుట్ట దాఖలు
 పింఛన్లు స్వాహా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, రికవరీ చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి దాదాపు 8 నెలల క్రితం డీఆర్‌డీఏ, యాక్సిస్ బ్యాంకును ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు ఆరుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో సరిపెట్టారు. అరెస్టులు లేవు.. రికవరీ లేకపోవడం గమనార్హం. దాదాపు 1000 మంది సీఎస్‌పీలు అవినీతికి పాల్పడినా ఆరుగురిపై మాత్రమే కేసులు పెట్టడం అధికారుల పనితీరుకు నిదర్శనం. కనీసం రూ.లక్షకు పైబడి పింఛన్లు కాజేసిన వారిపై కేసులు పెట్టాలని కలెక్టర్ ఆదేశించినా ఫలితం లేకపోతోంది.
 
యాక్సిస్ బ్యాంకు ఇచ్చే కమీషన్‌లో కట్ చేస్తాం
సామాజిక భద్రతా పథకం కింద పంపిణీ చేసే పింఛన్లలో అక్రమాలు వాస్తవమే. బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పలువురిపై క్రిమినల్ కేసులు పెట్టాం. పలువురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేశాం. రూ.1.31 కోట్లు దుర్వినియోగం కాగా.. రూ.16.35 లక్షలు రికవరీ చేశాం. పింఛన్ల పంపిణీలో యాక్సిస్ బ్యాంకుకు రెండు శాతం కమీషన్ ఇస్తున్నాం. అందులో దుర్వినియోగం అయిన మొత్తాన్ని కట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. సీఎస్‌పీలు స్వాహా చేసిన మొత్తాన్ని కమీషన్‌లో పట్టుకుంటాం. 
- నజీర్ సాహెబ్, డీఆర్‌డీఏ పీడీ

మరిన్ని వార్తలు