జూనియర్లకే అందలం!

6 May, 2019 08:20 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైద్య ఆరోగ్యశాఖలో అనర్హులనే అందలం ఎక్కిస్తున్నారు. సీనియర్లను కాదని జూనియర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.తాము చెప్పిన మాటను కాదనకుండా చేస్తారనే ఉన్నతాధికారుల ఆలోచనే ఇందుకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంఅండ్‌హెచ్‌వో) నియామకంలో ఈ తీరు కొనసాగుతోంది. అర్హులైన అధికారులు ఉన్నప్పటికీ వారిని కాదని.. వారి కంటే తక్కువస్థాయి కలిగిన వారిని అధికారులుగా నియమిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు ఈ విధంగా తమకు ఇష్టం వచ్చిన జూనియర్‌ అధికారులను నియమించి..ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.

వాస్తవానికి సివిల్‌ సర్జన్‌ (సీఎస్‌) కేడర్‌ కలిగిన వారిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంఅండ్‌హెచ్‌వో)గా నియమించాల్సి ఉంటుంది. అయితే ఆ శాఖలోని ఉన్నతాధికారులు డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ (డీసీఎస్‌)లను డీఎంఅండ్‌హెచ్‌వోలుగా నియమిస్తున్నారు. ఈ విధంగా కర్నూలు జిల్లాలోనే కాకుండా అనంతపురంతో పాటు మరో 5 జిల్లాల్లో జూనియర్‌ అధికారులను అందలం ఎక్కించినట్టు తెలుస్తోంది. సీనియర్‌ అధికారులు కాస్తా డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వోలుగా ఉంటూ తమ జూనియర్ల కిందనే పనిచేయాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో   జూనియర్లు తమకేమీ చెప్పేదంటూ డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వోలు ఎదురు తిరుగుతున్న సందర్భాలు నెలకొంటున్నాయి. ఫలితంగా 


వైద్య ఆరోగ్యశాఖలో వ్యవహారం కాస్తా కట్టుతప్పుతోంది. దీంతో పరిపాలన పట్టుతప్పి....కిందిస్థాయి సిబ్బందితో పనిచేయించలేని పరిస్థితి నెలకొంది.  అన్నింటిలోనూ అదే తీరే...!: మాతా, శిశు మరణాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆడిట్‌ చేయాలని మెడికల్‌ ఆఫీసర్లతో పాటు ఏఎన్‌ఎంలకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు జిల్లాలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం అయ్యే ఖర్చును ఎవరిస్తారనే అంశం కానీ... ఏ బడ్జెట్‌ నుంచి తీసుకోవాలనే విషయం కానీ స్పష్టంగా పేర్కొనలేదు. ఫలితంగా మెడికల్‌ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంల సొంత బడ్జెట్‌ నుంచి ఈ ఖర్చులను భరించాల్సి వస్తోంది.

అదేవిధంగా గతంలో కూడా పోలియో దినోత్సవం సందర్భంగా కార్యక్రమాల నిర్వహణకు కూడా బడ్జెట్‌ను కేటాయించలేదు. మిగిలిన జిల్లాల్లో ఇందుకోసం బడ్జెట్‌ను కేటాయించినప్పటికీ జిల్లాలో మాత్రం నెలలు గడిచినప్పటికీ నిధులు మాత్రం ఇవ్వలేదు. వరుసగా ‘సాక్షి’లో కథనాలు రావడంతో ఖర్చును వైద్య ఆరోగ్యశాఖ చెల్లించింది. మాతాశిశు మరణాలపై ఆడిట్‌ విషయంలో కూడా ఇప్పటివరకు మెడికల్‌ అధికారులకు, ఏఎన్‌ఎంలకు ఒక్కపైసా కూడా నిధులు విడుదల చేయలేదు. ఈ విధంగా వైద్య ఆరోగ్యశాఖలో అధికారులు ఆడింది ఆట...పాడింది పాటగా సాగుతోంది.

మరిన్ని వార్తలు