‘రియల్‌ టైమ్‌’ మాయాజాలం

12 Nov, 2018 09:07 IST|Sakshi

చనిపోయినవారికి రేషన్‌ కార్డులు

ప్రభుత్వ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకూ మంజూరు

ఇష్టానుసారం ఇచ్చేసిన ప్రభుత్వం

జిల్లాకు మంజూరైనవి 35,386

సగం పైగా తప్పుడువేనని సమాచారం

ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్న అధికారులు

తూర్పుగోదావరి, రామచంద్రపురం రూరల్‌: అన్నమో రామచంద్రా అంటూ ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా నాలుగున్నరేళ్లుగా కనికరించని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు తరుముకొస్తున్న వేళ.. వేలాదిమందికి తెల్ల రంగు రేషన్‌ కార్డులు మంజూరు చేస్తోంది. ఇలా రేషన్‌ కార్డులు పొందుతున్నవారిలో చనిపోయినవారు, ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు కూడా ఉన్నట్లు ‘సాక్షి’ దృష్టికి వచ్చింది. రేషన్‌ కార్డుల ముద్రణ జరిగిపోయి గ్రామ రెవెన్యూ అధికారుల చేతికి వచ్చి న తరువాత అసలు విషయం తెలియడంతో ఏం చెయ్యాలో పాలుపోక అధికారులు తలలు పట్టుకుం టున్నారు. గతంలో రేషన్‌ కార్డు కావాల్సినవారు తహసీల్దార్‌ కార్యాలయంలోనో, జన్మభూమి గ్రామసభల్లోనో, మీసేవ కేంద్రాల ద్వారానో దరఖాస్తు చేసేవారు. దానిపై సంబంధిత అధికారులు విచారణ జరిపి, అర్హులని నిర్ధారిస్తే.. కార్డులు ఇచ్చేవారు.

టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రేషన్‌ కా ర్డులకు అర్హుల ఎంపికలో కూడా జన్మభూమి కమి టీల పెత్తనం సాగేది. అయితే, అధికారులు చెబుతున్నదాని ప్రకారం, రెండేళ్లుగా ఈ విధానంలో మా ర్పు చేశారు. రేషన్‌ కార్డు కావాల్సినవారు రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ విధానంలో 1100 నంబర్‌కు నేరుగా ఫోన్‌ చేసి, వివరాలు చెప్పాల్సి ఉంటుంది. ఆ వివరా లు నమోదు చేసుకున్న అనంతరం ఎటువంటి విచా రణా లేకుండానే నేరుగా ఆయా దరఖాస్తుదార్ల పేరుతో రేషన్‌ కార్డులు జనరేట్‌ అయిపోతున్నాయి. వాటి ని ప్రభుత్వం తాజాగా ముద్రించి, జిల్లాలకు పంపిం చింది. ఈవిధంగా జిల్లాకు వచ్చిన కార్డుల్లో సగానికి పైగా అనర్హులకు మంజూరైనట్టు సమాచారం. మన జిల్లాకు మొత్తం 30,386 కొత్త రేషన్‌ కార్డులు మంజూరయ్యాయి. వీటికి అదనంగా మలివిడతలో మరో 5 వేల కార్డులనుకూడా మంజూరు చేశారు. ఇలా మొత్తం 35,386 కార్డులు ఆయా గ్రామాలకు చేరాయి. వీటిలో 50 శాతం పైగా అనర్హులకు మంజూరయ్యాయని తెలియడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. వీటిని అర్హులైనవారికి పంపిణీ చేయాలో లేక అనర్హులు కూడా ఉండడంతో పంపిణీని ఆపాలో తెలియక గ్రామ రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం పంపిణీ చేయకుండా ఉన్నతాధికారుల ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ పుణ్యమా అని ఇలా జరిగిందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఇది అధికారుల నిర్లక్ష్యమా లేక సాంకేతిక తప్పిదమా అనేది తేలాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు