‘ఇందిరమ్మ’ అనుబంధాలపై ఆరా !

3 Jun, 2014 02:51 IST|Sakshi

 ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: ‘ఇందిరమ్మ గృహాల అక్రమ పునాదులకు అనుబంధాలు తయారు చేసిందెవరంటూ’ జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులు ప్రొద్దుటూరు తహశీల్దారు చంద్రమోహన్‌ను ఆరా తీశారు. ‘ఇందిరమ్మ’ లో అక్రమాలకు అనుబంధాలు రెడీ’ అన్న శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. ఈ మేరకు స్థానిక తహశీల్దార్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ విషయమై స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దారు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పాత తేదీలు వేసి రికార్డుల్లో నెంబర్లు వేసి అక్రమాలకు పాల్పడిన విషయంపై విచారణ చేస్తున్నారు. ఏ స్థాయి అధికారులు ఈ పని చేశారన్న విషయంపై ఆరా తీస్తున్నారు.
 
 అక్రమార్కులు ఆడిందే ఆట.. గతంలో కలెక్టర్ ఆదేశాలతో తొలగించిన పునాదులకు తిరిగి అక్రమంగా అనుబంధాలు ఇవ్వడంతో అక్రమార్కులు ఎలాంటి బిల్లులు లేకుండానే గృహాలను పూర్తి చేస్తున్నారు. దీంతో అక్రమార్కులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. కాలనీలో వందలాది పునాదులు వెలిసినా, వాటి నిర్మాణాలు పూర్తి చేస్తున్నా రెవెన్యూ అధికారులు స్పందించక పోవడంపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ అక్రమాలపై 12 మంది అధికారులు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఇందులో రూ.కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. అనుబంధాలు తయారు చేసిన రెవెన్యూ అధికారి, ఆయనకు  సహకరించిన కింది స్థాయి అధికారులపై కఠిన చర్యలు తీసుకోకపోతే అక్రమాలకు అడ్డుకట్ట పడదని స్థానికులు అంటున్నారు.

మరిన్ని వార్తలు