శుద్ధి.. సులభంగా..

13 Nov, 2018 11:05 IST|Sakshi
అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కిడ్నీ రోగుల కోసం ఏర్పాటు చేసిన రక్తశుద్ధి కేంద్రం

కిడ్నీ బాధితులకు ఊరట

అందుబాటులోకి మూడు ఉచితరక్త శుద్ధి కేంద్రాలు

మూడు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రుల్లో ఏర్పాటు

తూర్పుగోదావరి,అమలాపురం టౌన్‌: కిడ్నీ సంబంధిత రోగం వస్తే ఆ రోగికి వారానికి కనీసం రెండు సార్లు రక్త శుద్ధి జరగాలి. దీనినే డయాలసిస్‌ అంటారు. ప్రభుత్వ పరంగా జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం ఆస్పత్రుల్లోనే ఈ సెంటర్లు ఉన్నాయి. దీంతో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కిడ్నీ రోగులు ముఖ్యంగా పేద రోగులు ఈ రక్తశుద్ధి కోసం కాకినాడ, రాజమహేంద్రవరం వెళ్లాల్సి వస్తోంది. చాలా మంది కిడ్నీ రోగులు రక్త శుద్ధి కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి ప్రతిసారి రూ.2,500 నుంచి రూ.ఐదు వేల వరకూ వెచ్చిస్తున్నారు. వారికి ఆర్థిక భారమైనా రక్త శుద్ధి విధిగా చేయించుకోవాలన్న అత్యవసరంతో నెలకు రూ.25 వేల వరకు ఖర్చుచేస్తున్నారు.

రూ.మూడు కోట్ల వ్యయంతోమూడు కేంద్రాలు
ప్రభుత్వం జిల్లాలోని అమలాపురం, రంపచోడవరం, తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రుల్లో కూడా ఈ రక్తశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ మూడు ఆస్పత్రుల్లో దాదాపు రూ.మూడు కోట్ల వ్యయంతో సుమారు 30 డయాలసిస్‌ యంత్రాలను సమకూర్చింది. ప్రభుత్వ ఆస్పత్రులను పర్యవేక్షించే వైద్య విధాన పరిషత్‌ ఈ కేంద్రాల నిర్వహణను అపోలో ఆస్పత్రి యాజమాన్యాకి అప్పగించింది. ఈ మూడు కేంద్రాలో కిడ్నీ రోగి బెడ్‌ వద్దే డయాలసిస్‌ మెషీన్‌ ఉంటుంది. ఒక్కో రోగికి రక్త శుద్ధి ప్రక్రియ మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది. అమలాపురం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రక్త శుద్ధి కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం ప్రారంభించనున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మోకా ప్రసాదరావు ఆధ్వర్యంలో ఇప్పటికే ఆస్పత్రిలో ఈ రక్త శుద్ధి కేంద్రం కిడ్నీ బాధిత రోగులకు సేవలు అందిస్తోంది. అమలాపురంలో ఏర్పాటైన 12 డయాలసిస్‌ మెషీన్ల ద్వారా ఒకేసారి 12 మంది కిడ్నీ రోగులకు రక్తశుద్ధి చేసే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.

ఉచిత డయాలసిస్‌ సెంటర్‌అత్యవసరం
కోనసీమలో ఉన్న అనేక పేద కుటుంబాలకు చెందిన వారు కిడ్నీ రోగులుగా ఉన్నారు. వీరందరూ కాకినాడ లేదా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రుల్లో లేదా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రక్త శుద్ధి కోసం వెళుతున్నారు. ప్రత్యేకించి అమలాపురం ఏరియా ఆస్పత్రిలో కూడా ఈ ఉచిత రక్తశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కోనసీమలోని పేద కిడ్నీ రోగులకు ఈ కేంద్రం సేవలు అత్యవసరం అవుతాయి. అంతేకాదు ఉచిత సేవలు కాబట్టి ఆర్థిక వ్యయప్రయాసలు ఉండవు.  రోజుకు రెండు షిఫ్ట్‌లలో రోగులకు ఈ కేంద్రం సేవలు అందించనున్నాం.   – డాక్టర్‌ మోకా ప్రసాదరావు, సూపరింటెండెంట్,ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, అమలాపురం

మరిన్ని వార్తలు