విద్యార్థులకు ఆర్టీసీ నజరానా

25 Jun, 2019 09:54 IST|Sakshi
 విద్యార్థికి ఏడాది బస్‌పాస్‌ అందిస్తున్న డీఎం వెంకటేశ్వర్లు 

సాక్షి, రామచంద్రపురం(తూర్పు గోదావరి) : ఆర్టీసీ బస్సుల్లో విద్యాలయాలకు వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ చిరు కానుకగా ఏడాది బస్‌పాస్‌లను అందిస్తోంది. గతంలో విద్యార్థులు ప్రతినెలా బస్‌పాస్‌ల కోసం గంటల కొద్దీ క్యూల్లో వేచి ఉండాల్సి వచ్చేది. గత ఏడాది నుంచి ఏడాది మొత్తానికీ ఒక్కసారే బస్‌పాస్‌ను తీసుకునే వెసులుబాటు ఆర్టీసీ కల్పించింది. ఏపీఎస్‌ ఆర్టీసీలో విద్యార్థులకు అందించే ఉచిత పాస్‌లతో పాటు రాయితీ పాస్‌లు ఎలా పొందాలో రామచంద్రపురం ఆర్టీసీ డిపో మేనేజర్‌ కొడమంచిలి వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి తెలియజేశారు.

ఏడో తరగతి వరకు బాలురకు ఉచితం
ఏడో తరగతి చదువు, 12 ఏళ్ల వయస్సు ఉన్న బాలురకు 20 కిలో మీటర్ల దూరం వరకు ఇంటి నుంచి పాఠశాలకు ఉచిత బస్‌పాస్‌ మంజూరు చేస్తారు. ఆర్టీసీ డిపోల్లోని ప్రత్యేక కౌంటర్లలో లేదా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసి బస్‌పాస్‌ తీసుకోవచ్చు. రూ. 50 చెల్లించి ఈ పాస్‌ పొందవచ్చు. దాతల సహకారంతో కూడా ఈ ఉచిత బస్‌పాస్‌ పొందవచ్చు.

18 ఏళ్ల బాలికలకు ఉచితం 
ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకూ 18 ఏళ్ల లోపు బాలికలు ఉచిత బస్‌పాస్‌లు పొందవచ్చు. 20 కిలోమీటర్ల వరకు ఇంటి నుంచి పాఠశాలకు ఈ బస్‌పాస్‌లను ఉపయోగించుకోవచ్చు.

రాయితీ బస్‌పాస్‌ పొందడం ఇలా
బాలురు ఎనిమిదో తరగతి నుంచి డిగ్రీ వరకు రాయితీ బస్‌పాస్‌లు పొందవచ్చు. 35 కి.మీ. వరకు ఇంటి నుంచి పాఠశాల, కళాశాల వరకు ఈ రాయితీ బస్‌పాస్‌లు ఉపయోగించుకోవచ్చు. గతంలో నెలకు ఇచ్చే పాస్‌లు ఇప్పుడు మూడు నెలలు, ఏడాది గడువుతో ఇస్తున్నారు. పదో తరగతి వరకు మూడు నెలలు 5 కిలో మీటర్ల వరకు రూ. 235, ఏడాదికి ఒక్కసారే తీసుకుంటే రూ. 850 చెల్లించాలి. ఇంటర్, పాలిటెక్నిక్‌ విద్యార్థులు మూడు నెలలకు ఒకసారి పాస్‌ తీసుకుంటే రూ. 935, డిగ్రీ అయితే రూ. 1020 చెల్లించాలి. 10 కిలోమీటర్ల వరకు 10 వ తరగతి వరకు మూడు నెలలలకు రూ.315, ఏడాదికి తీసుకుంటే రూ. 1050 చెల్లించాలి.

ఇంటర్, పాలిటెక్నిక్‌ విద్యార్థులు మూడు నెలలకు పాస్‌కు రూ. 1155, డిగ్రీ అయితే రూ. 1260 చెల్లించాలి. 15 కిలోమీటర్లకు 10వ తరగతికి రూ. 385, ఇంటర్‌కు రూ.1350, డిగ్రీకి రూ.1415, 20 కిలోమీటర్లకు మూడు నెలలకు రూ.510, సంవత్సరానికి రూ.1,800, 25 కిలోమీటర్లకు రూ.645, ఏడాదికి రూ. 2250, 30 కిలోమీటర్లకు మూడు నెలలకు రూ. 705, ఏడాదికి రూ. 2500, 35 కిలోమీటర్లకు రూ. 775 వంతున చెల్లించి రాయితీపై బస్‌పాస్‌ను పొందవచ్చు. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్‌లకు మూడు నెలలకోసారి, ఏడాది పాస్‌లు తీసుకుంటే రూ. 1155 నుంచి రూ. 3240 వరకు ఉంటుంది.

ఆన్‌లైన్‌లో పొందడమెలా..?
విద్యార్థులు కళాశాల ధ్రువీకరణ పత్రంతో ఆర్టీసీ ప్రత్యేక కౌంటర్లలో బస్‌పాస్‌ పొందవచ్చు.online. apsrtcpass. in వెబ్‌సైట్‌లోకి వెళ్లి పదో తరగతి పైబడిన విద్యార్థులు తమ తరగతిని క్లిక్‌ చేయాలి. గత ఏడాది బస్‌పాస్‌ నెంబరు ఉంటే నమోదు చేయాలి. లేదా కొత్త రిజిస్ట్రేషన్‌ ఎంచుకుని వివరాలు నమోదు చేయాలి. వివరాలు నమోదైన వెంటనే దరఖాస్తుదారు పేరు, చిరునామా, పాఠశాల, కళాశాల, ఆధార్‌ సంఖ్యలను నమోదు చేయాలి. ఫొటో అప్‌లోడ్‌ చేసి విద్యార్థి పయనించే రూట్‌ వివరాలు నమోదు చేయాలి. ఆన్‌లైన్‌లో ప్రింట్‌ తీసుకుని కళాశాల ప్రిన్సిపాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయుని సంతకం చేసి ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో కౌంటర్‌లో రుసుం చెల్లించి బస్‌పాస్‌ పొందవచ్చు. విద్యార్థుల కోసం ఆయా డిపోలు ప్రత్యేక బస్సులు కూడా నడుపుతున్నా యి. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్‌ కొడమంచిలి వెంకటేశ్వర్లు సూచించారు.

దివ్యాంగులకు రాయితీ బస్‌పాస్‌లు  
దివ్యాంగులు బస్‌ చార్జీలో 50 శాతం రాయితీతో ప్రయాణించేలా ఆర్టీసీ బస్‌పాస్‌లను మంజూరు చేస్తోంది. దీనికోసం దివ్యాంగులు ఎస్కార్ట్‌ అవసరం లేనివారు రూ. 50 తోను, ఎస్కార్ట్‌ అవసరం ఉన్నవారు రూ. 100 తోను బస్‌పాస్‌లను తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సదరన్‌ మెడికల్‌ సర్టిఫికెట్లు (పెద్దది, చిన్నది) ఒక సెట్, ఆధార్‌ కార్డు జెరాక్స్‌లతో పాటు ఒక ఫొటో తీసుకువచ్చి బస్‌పాస్‌ కౌంటర్ల వద్ద ఈ రాయితీ పాస్‌లు తీసుకోవచ్చు. నియోజకవర్గంలోని దివ్యాంగులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.
– కొడమంచిలి వెంకటేశ్వర్లు, డిపో మేనేజర్, రామచంద్రపురం ఆర్టీసీ డిపో

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు