ఆటో వాలాల ఒత్తిడితో ఆగిన ఉచిత బస్సు

8 Sep, 2013 02:57 IST|Sakshi

శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: భక్తుల కోసం శ్రీకాళహస్తి దేవస్థానం ఏర్పాటు చేసిన ఉచిత బస్సును ఆటోవాలాల ఒతిళ్లకు తలొగ్గి నిలిపేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తులు ఇబ్బందులు పడుతున్నా ఆలయాధికారులు స్పందించడంలేదు. భక్తుల నుంచి ఆటోవాలాలు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. అయితే ఆలయ ఇంజినీరింగ్ విభాగం ఈఈ, దేవస్థానం బస్సు నిర్వాహకులు రామిరెడ్డి వాదన మరోలా ఉంది.

ఆటోవాలాల వత్తిళ్లకు తలొగ్గలేదని బస్సు 10 రోజుల క్రితం మరమ్మతుకు గురైందని మరో నాలుగు రోజుల్లో బాగుచేస్తామని ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. బస్సు, రైలులో వచ్చే భక్తుల సౌకర్యార్థం ఓమిని బస్సు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కొంతకాలంగా స్టేషన్ నుంచి వచ్చే భక్తులను మాత్రమే బస్సులో దేవస్థానానికి తరలిస్తున్నారు. అయి తే ఇటీవల వత్తిళ్లకు తలొగ్గి బస్సును ఆలస్యంగా స్టేషన్ కు తీసుకెళ్లడం లేదా పూర్తిగా ఆలయం వద్దనే బస్సును ఉంచుతున్నట్లు విమర్శలున్నాయి.

సమైక్యాంధ్ర ఉద్య మం నేపథ్యంలో బస్సులు నడవకపోవడంతో భక్తులు రైళ్లద్వారా వస్తున్నారు. స్టేషన్ నుంచి ఆలయం వద్దకు సాధారణంగా ఆటోలో రూ.30 నుంచి రూ.50 వరకు వసూ లు చేస్తుంటారు. అయితే ఉద్యమం నేపథ్యంలో రూ.60 నుంచి రూ.100 వరకు వసూళ్లు చేస్తున్నారు. బస్సు నిర్వాహకులు వత్తిళ్లకు తలొగ్గి బస్సు మరమ్మతుకు గురైందని మూల పడేశారు. భక్తులకు ఆటోలే దిక్కయ్యాయి. భక్తు ల నుంచి ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. ఆల యాధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు