జీన్స్‌ వేసుకుంటే అంతరాలయ దర్శనం కల్పించం

13 Jan, 2020 15:24 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఈ నెల 14 నుంచి 16 వరకు సంక్రాంతి సంబరాలు జరగనున్నాయని దుర్గగుడి ఈవో ఎంవి సురేష్‌బాబు తెలిపారు. వేడుకల సందర్భంగా ఆలయ సిబ్బంది దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక అలంకరణ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు అమ్మవారి దర్శనం చేయించి అనంతరం వారికి చీరలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. దుర్గమ్మ దర్శనార్థం వచ్చే భక్తులు సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలని సూచించారు. ఇకపై జీన్స్‌ వేసుకున్నా, సంప్రదాయ దుస్తుల్లో రాకున్నా అంతరాలయ దర్శనం కల్పించబోమని స్పష్టం చేశారు. ఇక అమ్మవారిని అంతరాలయం నుంచి దర్శించుకోవాలనుకునే భక్తుల నుంచి రూ.300 చొప్పున టికెట్‌ వసూలు చేస్తుండగా దీన్ని ఆన్‌లైన్‌లో బుక్‌చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ఈ నెల 30న శ్రీపంచమిని పురస్కరించుకుని అమ్మవారు సరస్వతి దేవీ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆ‌రోజు విద్యార్ధులకు అమ్మవారి ఉచిత దర్శనం కల్పిస్తున్నట్లు ఈవో సురేష్‌బాబు ప్రకటించారు. ఈ నెల 31న సీవీ రెడ్డి వర్ధంతి కావడంతో 100 మందికి స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నామన్నారు. కొండపై అర్జునుడు ప్రతిష్టించిన ఆలయానికి భక్తులను అనుమతించే మార్గంపై ప్రతిపాదన సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. కేశఖండన శాల, ప్రసాదం పోటు శాశ్వత భవనాలకు త్వరలోనే శంకుస్థాప చేస్తామన్నారు. అమ్మవారి పులిహోర ప్రసాదాన్ని రూ.5 నుంచి రూ.10కి పెంచాలని భావిస్తున్నామని ఆయన వెల్లడించారు.

చదవండి: ‘అన్ని దేవాలయాలకు ఒకటే వెబ్‌సైట్‌

మరిన్ని వార్తలు