పగలే.. ‘జల’జలా..

21 Jun, 2019 10:24 IST|Sakshi

సాగుకు పగటి పూటే 9 గంటల విద్యుత్‌

మాట నిలబెట్టుకున్న జననేత

అక్కడక్కడ సాంకేతిక అవరోధాలు అధిగమించే దిశగా చర్యలు

సాక్షి, రాజానగరం (తూర్పు గోదావరి): గతంలో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వెంటనే మెట్ట రైతులకు ఇచ్చిన మాట ప్రకారం.. వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్‌ అందిస్తూ, తొలి సంతకం చేశారు. ఆ తరువాత వ్యవసాయం గురించి, రైతుల సంక్షేమం గురించి ఆలోచించిన నాథుడే లేడు. రోజుకు తొమ్మిది గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నారనే పేరే కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ స్థితిలో రైతులు ఇబ్బందులు పడుతూ వచ్చారు. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా విద్యుత్‌ సరఫరా చేయడంతో కొంతమంది రైతులు మోటార్లు ఆన్‌ చేసేందుకు పొలాలకు వెళ్లి, పాము కాట్లకు గురై మృత్యువాత పడిన సంఘటనలున్నాయి.

ఈ పరిస్థితుల్లో గత ఏడాది ప్రజాసంకల్ప పాదయాత్ర నిర్వహించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పలు ప్రాంతాల్లోని రైతులు తమ కష్టాలు ఏకరువు పెట్టారు. ఆ సందర్భంగా తాను అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయ మోటార్లకు పగటి సమయంలోనే రోజుకు 9 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రి అయిన ఆయన.. ఆ హామీ నిలబెట్టుకునే విధంగా చర్యలు తీసుకున్నారు.

దీనివలన పూర్తి మెట్ట ప్రాంతంగా ఉన్న రాజానగరం నియోజకవర్గంలోని రైతులకు ఎనలేని ప్రయోజనం కలుగుతోంది. ప్రస్తుతానికి సాంకేతిక ఇబ్బందులు లేనిచోట జగన్‌ ప్రభుత్వం పగటి పూటే రోజుకు 9 గంటలు విద్యుత్‌ అందిస్తూండగా, అవకాశం లేనిచోట అడ్డంకులను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటోంది. నియోజకవర్గంలోని రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాల్లో 8,250 వ్యవసాయ విద్యుత్‌ మోటార్లు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 1,51,965 ఎకరాలకు సాగునీరు అందుతోంది.

కోరుకొండలో సాంకేతిక అవరోధాలు
కోరుకొండ మండలంలో సుమారు 2,300 వ్యవసాయ విద్యుత్‌ మోటార్లున్నాయి. వీటి ద్వారా 28,750 ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ఇక్కడ కూడా వరితో పాటు మొక్కజొన్న, మిర్చి, కూరగాయలు పండిస్తూంటారు. ఏటిపట్టుకు, మెట్ట ప్రాంతానికి మధ్యన ఉన్న ఈ మండలంలోని రైతులు సాగునీటికి ఎక్కువగా బోర్ల పైనే ఆధారపడుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే ఇక్కడ పంటలు పండుతాయి. లేకుంటే బోర్లున్న ప్రాంతాల్లోనే సాగు జరుగుతూంటుంది. మండలంలో ప్రస్తుతం జగన్‌ ప్రభుత్వం ప్రకటించినవిధంగా వ్యవసాయ మోటార్లకు పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్‌ అందించలేకపోతున్నారు. సాంకేతికపరమైన సమస్యలున్నందున, వాటిని నివారించే వరకూ ఇది సాధ్యం కాదని ఏఈ రవికుమార్‌ తెలిపారు. అందుకు అనుగుణంగా ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ లైన్లు వేసేందుకు ప్రతిపాదనలు పంపించామన్నారు.

సీతానగరం మండలంలో వరితో పాటు మొక్కజొన్న, మిర్చి, అరటి, కూరగాయలు సాగు చేస్తూంటారు. గోదావరి చెంతనే ఉన్న ఈ మండలానికి భూగర్భ జలాలతో పాటు తొర్రిగెడ్డ, కాటవరం ఎత్తిపోతల పథకాల ద్వారా సాగు నీరు అందుతుంది. మండలంలో మొత్తం 1,236 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లున్నాయి. వీటి ద్వారా సుమారు 22 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఉచిత విద్యుత్‌ పథకం అమలులోకి వచ్చిన తరువాత ఈ ప్రాంతంలో బోర్ల సంఖ్య పెరగడంతో ఆ మేరకు సాగు విస్తీర్ణం కూడా పెరిగింది.

జగన్‌ ప్రభుత్వం ప్రకటించిన విధంగా పురుషోత్తపట్నం, ముగ్గళ్ల సబ్‌స్టేషన్ల పరిధిలోని వ్యవసాయ మోటార్లకు పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్‌ సరఫరాను ఇప్పటికే ప్రారంభించారు. వీటి ద్వారా సుమారు 820 వ్యవసాయ కనెక్షన్లకు పగటి పూటే విద్యుత్‌ సరఫరా అవుతోంది. మిర్తిపాడు సబ్‌స్టేషన్‌ పరిధిలో సాంకేతిక అవరోధాలు ఉండడంతో ప్రస్తుతం ఈ విధానం అమలుకు నోచుకోవడం లేదు. అడ్డంకులను అధిగమించే ప్రయత్నంలో ఉన్నామని ఏఈ త్రిమూర్తులు తెలిపారు.

పాతాళగంగే ప్రధానాధారం
పూర్తి మెట్ట ప్రాంతంగా ఉన్న రాజానగరం మండలంలో సాగుకు భూగర్భ జలాలే ఆధారం. ప్రతి సీజన్‌లోనూ బోర్లున్న రైతులు జిల్లాలో అందరికంటే ముందుగా వరి సాగుకు శ్రీకారం చుడతారు. ఆ క్రమంలో కోతలు కూడా ముందుగానే చేపడుతూంటారు. మండలంలో సుమారు 4,700 వ్యవసాయ విద్యుత్‌ మోటార్లు ఉన్నాయి. వీటి ద్వారా 86,950 ఎకరాలకు సాగునీరు అందుతోంది. మండలంలోని రాజానగరం, సంపత్‌నగరం గ్రామాల్లో ఉన్న సబ్‌స్టేషన్ల ద్వారా వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ సరఫరా జరుగుతోంది.

సంపత్‌నగరం ఏఈ ఎస్‌.శ్రీనివాసరావు మాట్లాడుతూ సంపత్‌నగరం సబ్‌స్టేషన్‌ పరిధిలోని దివాన్‌చెరువు సబ్‌స్టేషన్‌ ద్వారా 13 మోటార్లకు ఈ నెల 17 నుంచి పగటి పూట 9 గంటల విద్యుత్‌ అందిస్తున్నట్టు తెలిపారు. అలాగే  కొండగుంటూరు సబ్‌స్టేషన్‌ ద్వారా కొండగుంటూరు, నామవరం, కడియం మండలం జేగురుపాడు ఆవల్లో 94 మోటార్లకు విద్యుత్‌ అందిస్తున్నామన్నారు. సంపత్‌నగరం సబ్‌స్టేషన్‌ ద్వారా నామవరం, జి.యర్రంపాలెం, పాతతుంగపాడు, కొండగుంటూరుపాకలులోని 480 మోటార్లకు 9 గంటల విద్యుత్‌ అందిస్తున్నామన్నారు. 

ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ, ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ వివిధ ఫీడర్ల ద్వారా తొమ్మిది గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని వివరించారు. రాజానగరం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో ప్రస్తుతం ఇది అమలు జరగడం లేదని ఏఈ సుబ్రహ్మణ్యం చెప్పారు. తొమ్మిది గంటల విద్యుత్‌ సరఫరాకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేనందున ప్రస్తుతం ఇవ్వలేకపోతున్నామన్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా త్వరలోనే తొమ్మిది గంటల విద్యుత్‌ సరఫరా చేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు