250 యూనిట్ల వరకు సెలూన్లకు ఉచిత విద్యుత్‌ 

9 May, 2018 03:26 IST|Sakshi
కల్వపూడి అగ్రహారం క్రాస్‌ వద్ద నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌

     ఏడాదికి రూ.10 వేల సాయం

     రెండింట్లో ఏది ప్రయోజనకరంగా ఉంటుందో అది అమలు

     నాయీ బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్‌ జగన్‌ హామీ

     ఆలయాల్లో పనిచేస్తున్న వారికి పాలక మండళ్లలో చోటు.. 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  నాయీ బ్రాహ్మణులు లేకపోతే నాగరిక సమాజానికి మనుగడ లేదని.. అధికారంలోకి వచ్చాక సెలూన్‌ షాపులకు 250 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌.. లేదా సెలూన్‌కు ఏడాదికి రూ.10 వేల సాయం.. ఇందులో వారికి ఏది ప్రయోజనకరంగా ఉంటుందో దానిని అమలు చేస్తామని వైఎస్సార్‌ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. 156వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం కలవపూడి అగ్రహారం శివారు ప్రాంతంలో రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధవటం యానాదయ్య, ప్రధాన కార్యదర్శి ఎం.సుబ్బరాయుడు తమ సమస్యలను వైఎస్‌ జగన్‌ దృష్టికి తెచ్చారు.

అనంతరం జననేత మాట్లాడుతూ కమర్షియల్‌ టారిఫ్‌ను అమలు చేస్తుండటంతో సెలూన్లకు రూ.4 వేల దాకా కరెంటు బిల్లు వస్తోందని.. ఇలా అయితే ఎలా బతకాలో అర్థంకాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నామంటూ నాయీ బ్రాహ్మణులు తన వద్ద ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 500 యూనిట్ల వరకూ కమర్షియల్‌ చార్జీలు కాకుండా.. డొమెస్టిక్‌ కేటగిరి టారిఫ్‌ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నాయీ బ్రాహ్మణులతో పాటు.. విశ్వ బ్రాహ్మణులు, కుమ్మరులు, రజకులు మొదలైన చిన్న చిన్న కులాల జనాభా తక్కువగా ఉండటం వల్ల పార్టీలు కూడా ఆయా కులాలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకపోవడంతో వారి సమస్యలు చెప్పుకొనేందుకు తగిన వేదిక లేకుండా పోతోందన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయా కులాలకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చి.. వాటి పురోభివృద్ధికి పాటుపడతామని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు.  
 
కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి తక్కువ వడ్డీకే రుణాలు 
ప్రస్తుతం ఉన్న ఫెడరేషన్‌ వల్ల లబ్ధిచేకూరని పరిస్థితుల్లో కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి, తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తామన్నారు. దేవాలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులకు సరైన జీతాలు అందని కారణంగా జీవనం కష్టంగా మారిందని చెబుతూ.. వారికి గుర్తింపు కార్డులిచ్చి నిర్ణీత వేతనం అందేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు వీలుగా గుర్తింపు పొందిన దేవాలయ పాలక వర్గాల్లో ప్రాతినిధ్యం కూడా కల్పిస్తామని చెప్పారు.  
 
సమస్యల ఏకరవు 
పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ను పలు వర్గాల వారు కలిసి తమ సమస్యలు చెప్పుకొన్నారు. గురుకులాల ఉపాధ్యాయులకు కూడా పీఆర్సీ వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు అనిల్‌కుమార్‌ తదితరులు వైఎస్‌ జగన్‌కు వినతిపత్రం ఇచ్చారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు జీతాలు పెంచకపోగా.. అన్న అమృతహస్తం పథకానికి సంబంధించిన బిల్లులు కూడా ఇవ్వడం లేదని అంగన్‌వాడీ వర్కర్ల యూనియన్‌ నాయకురాలు పద్మకుమారి తదితరులు జననేత దృష్టికి తెచ్చారు. మూడు దశాబ్దాలుగా తాము ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలను అధికారంలోకి రాగానే పరిష్కరించాలని బాబూజీనగర్‌ కాలనీ వాసులు, ఆక్వా రైతుల సమస్యలతో పాటు తాగునీటి కష్టాలు తీర్చాలని కలవపూడి అగ్రహారానికి చెందిన పలువురు రైతులు జననేతను కోరారు.  

ఉపాధ్యాయులకు నగదు రహిత వైద్య సేవలు అందేలా చూడాలని ఏపీటీఎఫ్‌ నేతలు విజ్ఞప్తి చేశారు. వైఎస్‌ హయాంలో దివ్యాంగులకు ప్రతి నెలా 35 కిలోల బియ్యం ఇవ్వగా.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దానిని అమలు చేయడం లేదని గుడివాడ శివారు కాలనీకి చెందిన అహ్మద్, శ్రీకాంత్‌తో పాటు పలువురు దివ్యాంగులు జననేతకు మొరపెట్టుకున్నారు. కొన్నేళ్లుగా తమ ఆధీనంలో ఉన్న 360 ఎకరాల ఇనాం భూములను ప్రభుత్వం బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని.. తమకు న్యాయం చేయాలని చౌటుపల్లికి చెందిన ముస్లిం మహిళలు వైఎస్‌ జగన్‌కు విన్నవించారు. అందరి కష్టాలు ఓపికగా విన్న జగన్‌.. మనందరి ప్రభుత్వం రాగానే సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.  

>
మరిన్ని వార్తలు