ఉచిత గ్యాస్ ఉన్నట్టా.. లేనట్టా?

20 Apr, 2015 03:57 IST|Sakshi
ఉచిత గ్యాస్ ఉన్నట్టా.. లేనట్టా?

మంజూరైనట్టు చూపుతున్న ఈ సేవా సెంటర్లు
అనుమతి ఇవ్వలేదంటున్న  గ్యాస్ ఏజెన్సీలు
ఇబ్బందులు పడుతున్న పేదలు

 
నర్సీపట్నం : కేంద్రం ప్రకటించిన ఉచిత గ్యాస్ కనెక్షన్లు పేదలకు అందని మావిగానే మారాయి. ప్రభుత్వాలు కరుణించినా గ్యాస్ ఏజెన్సీలు, అధికారుల నిర్వాకం వల్ల నేటికీ పేదలంతా పొగ పొయ్యిలతోనే నెట్టుకు రావాల్సి వస్తోంది. ఒక పక్క ఈ సేవా సెంటర్లో అర్హులైన లబ్ధిదారులకు గ్యాస్ మంజూరువుతున్న చూపుతున్నా,  ఏజెన్సీలు మాత్రం అనుమతి పేరుతో తిప్పి పంపుతున్నారు. ఈ పరిస్థితుల్లో  మోదీ కలల పథకం నేటికీ పేద వర్గాలకు అందలేదు.

కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలందరికీ ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు రూపకల్పన చేసింది. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా సుమారు  లక్ష కనెక్షన్లు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇప్పటివరకు గ్యాస్ కనెక్షన్ పొందని పేద కుటుంబాలు దరఖాస్తు చేసుకోవాలని గత నెలలో అదేశాలు జారీచేసింది. 

దీంతో అర్హులైన లబ్ధిదారులంతా మీ సేవా సెంటర్లవైపు పరుగులు తీశారు. స్థానికంగా ఉన్న పరిస్థితిని బట్టి మీ సేవా యాజమానులు 50 నుంచి వంద రూపాయల వరకు వసూలు చేశారు. గతంలో ఎన్నడూలేని విధంగా గ్యాస్ కనెక్షన్ ఉచితమని ప్రకటించడంతో అధిక సంఖ్యలో అబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా సుమారు  లక్షకు పైగా అబ్ధిదారులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని కనెక్షన్ కోసం అశగా ఎదురు చూడసాగారు.

గడువు ముగియడంతో దరఖాస్తు చే సుకున్న వారంతా గ్యాస్ కనెక్షన్ కోసం ఏజెన్సీల వైపు పురుగులు తీశారు. ఒక ఏజెన్సీలో వెయ్యి రూపాయలు, మరో సంస్థలో ఐదు వందలు చెల్లించాలంటూ చెప్పినా లబ్ధిదారులు అందుకు సిద్ధమయ్యారు. తీరా ఏజెన్సీలకు వెళ్లిన లబ్ధిదారులకు జిల్లా అధికారుల  నుంచి ఆదేశాలు వచ్చే వరకు ఎటువంటి కనెక్షన్ మంజూరు చేసేది లేదంటూ సిబ్బంది తేల్చి చెప్పడంతో లబ్ధిదారులంతా నిరాశగా వెనుదిరిగాల్సి వచ్చింది.

ఈ ప్రక్రియ ముగిసి రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకు జిల్లాలో ఒక్క కనెక్షన్ సైతం మంజూరు కాకపోవడంతో లబ్ధిదారులంతా గగ్గోలు పెడుతున్నారు. దీనిపై జిల్లా పౌరసరఫరాల అధికారి భ్రమరాంబ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడం వల్లే మంజూరులో జాప్యం జరుగుతోందన్నారు. దీనిపై స్పష్టత వచ్చిన వెంటనే పేదలందరికీ గ్యాస్ కనెక్షన్లు అందజేస్తామని చెప్పారు.
 
 
ఏజెన్సీలు తిప్పుతున్నాయి.
గతంలో ఎన్నడూలేని విధంగా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని ప్రకటించగానే ఎంతో ఆశపడ్డాం. దీనిపై అందరూ చెప్పగానే వెంటనే దరఖాస్తు చేశాం. తీరా చూస్తే కనెక్షన్  రాలేదంటూ ఏజెన్సీలు తిప్పుతున్నాయి.
  -గణేష్, రోలుగుంట

కనెక్షన్ ఇస్తారో.. లేదో..
కేంద్రం ఇచ్చే ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం నెల రోజుల క్రితం దరఖాస్తు చేశాం. ఈ సేవలో చూస్తే పౌరసరఫరాలశాఖ అధికారులు శాంక్షన్ చేశారని చెబుతున్నారు. గ్యాస్ ఏజెన్సీకి వెళితే ఇంకా రాలేదని చెబుతున్నారు. ఈ పరిస్థితులు చూస్తే కనెక్షన్ ఇస్తారో లేదో తెలియడం లేదు. ఎవరూ సరిగా చెప్పడం లేదు.  -ఈర్ని లక్ష్మి, జోగంపేట

మరిన్ని వార్తలు