శ్రీవారి భక్తులకు ఉచిత లడ్డూ

1 Jan, 2020 04:41 IST|Sakshi

వైకుంఠ ఏకాదశి నుంచి శ్రీకారం

అదనంగా ఒక్కొక్కటి రూ.50 చొప్పున ఎన్ని లడ్డూలైనా పంపిణీ

తిరుమల: 2020 ఆంగ్ల నూతన సంవత్సరంలో శ్రీవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి ఉచిత లడ్డూను అందజేయాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల నుంచి కాలినడకన తిరుమల వచ్చే భక్తులకు మాత్రమే ఒక ఉచిత లడ్డూను టీటీడీ అందిస్తోంది. ఆ మేరకు ప్రతిరోజు 20 వేల లడ్డూలను అందిస్తోంది. నూతన ప్రతిపాదనలో భాగంగా తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి ఒక లడ్డూను ఉచితంగా అందజేయనుంది. ఈ విధానాన్ని వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 6 నుంచి అమల్లోకి తీసుకురానుంది. 

సాధారణ భక్తుడికి కల్యాణోత్సవం లడ్డూ, అదనపు లడ్డూ  
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు కల్యాణోత్సవం లడ్డూ కావాలంటే సిఫార్సు లేఖ ఉండాల్సిందే. అయితే ఇకపై సిపారసు లేకుండానే సాధారణ భక్తుడికి కూడా కల్యాణోత్సవం లడ్డూతో పాటు అదనపు లడ్డూలు ఎన్ని కావాలన్నా టీటీడీ ఇవ్వనుంది. అదనపు లడ్డూ ఒక్కొక్కటి రూ.50లకు విక్రయిస్తారు. ఇందుకోసం అదనంగా లడ్డూ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు పెద్ద లడ్డూలను అందించడం ద్వారా టీటీడీ అధికారులు సిఫారసు లేఖల ఇబ్బందిని తొలగించాలని టీటీడీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇటీవల టీటీడీ బోర్డు సమావేశంలో టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు పై ప్రతిపాదనలకు అంగీకరించినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు