‘ఉచిత విద్యుత్’ రైతులకు షాక్!

19 Dec, 2013 00:38 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: 2004లో ఉచిత విద్యుత్ కనెక్షన్ పొందిన రైతుల నుంచి సేవా పన్ను వసూలు చేయకూడదని అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రతినెలా చెల్లించాల్సిన రూ.20 సర్వీసు చార్జీ నుంచి రైతులకు ఊరట లభించింది. ఈ పన్ను శాశ్వతంగా మాఫీ అవుతుంద నుకున్న అన్నదాతలపై ప్రస్తుత సర్కారు కర్కశంగా వ్యవహరిస్తోంది. పాత చార్జీల బకాయిలను రూపంలో గణిస్తూ వసూళ్లకు తెగబడుతోంది. నెలవారీగా ఇంటికొచ్చే బిల్లులతో పాటే వ్యవసాయ కనెక్షన్‌కు సంబంధించిన సేవా పన్నును జతచేస్తూ రైతులను ఏమారుస్తోంది. ఒక్కొక్కరికి సగటున రూ.1200 నుంచి రూ.2 వేలు అదనంగా బాదేస్తూ బిల్లులు దంచేస్తుండడంతో అన్నదాత కుదేలవుతున్నాడు. బిల్లులు చెల్లించని కర్షకుల స్టార్లర్లు, మోటార్లు ఎత్తుకెళుతూ మానసికంగా వేధిస్తోంది. ఇటీవల మంచాల మండలం ఆరుట్ల, వికారాబాద్ మండలం గొట్టిముక్కులలో విద్యుత్ సరఫరా నిలిపివేసి రైతులను ఇబ్బందులకు గురిచేసింది.
 
 83వేల మందిపై మోత
 గత నాలుగేళ్లుగా కరువుతో అల్లాడిన రైతాంగం.. ఈయేడు వరదలతో సతమతమైంది. ఈ క్రమంలోనే ఈసారి కురిసిన వర్షాలకు భవిష్యత్‌పై రైతులకు ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలోనే రబీకి సిద్ధమవుతున్న అన్నదాతలపై కఠినంగా వ్యవహరిస్తున్న ట్రాన్స్‌కో సర్వీసు చార్జీల పేరిట దండయాత్రలు సాగిస్తోంది. బకాయిలు చెల్లించకపోతే మొదటగా ఇంటి కనెక్షన్‌ను కట్ చేస్తున్నారు. ఆపై స్టార్టర్లు మోటార్లు ఎత్తుకెళుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సంబంధిత వ్యవసాయ కనెక్షన్లను తొలగిస్తున్నారు. 2004లో అప్పటి సీఎం వైఎస్సార్ ఉచిత విద్యుత్‌కు శ్రీకారం చుట్టారు. దీంతో జిల్లావ్యాప్తంగా 82,244 మంది రైతులు ఈ స్కీం పరిధిలో చేరారు. ఉచిత విద్యుత్ క నెక్షన్లకు సర్వీసు చార్జీల రూపంలో రూ.20 వసూలు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయదారుల నుంచి ఈ మొత్తాన్ని కూడా ఏనాడూ వసూలు చేయలేదు. దీంతో రైతాంగం సర్వీసు చార్జీ వ్యవహారాన్ని మరిచిపోయింది. ఈ నేపథ్యంలో చార్జీని 2011లో రూ.30కి పెంచుతూ ఇంధన శాఖ నిర్ణయం తీసుకుంది. తాజాగా సర్వీసు చార్జీలు చెల్లించాలంటూ రైతులకు బిల్లులు పంపింది. 2004 నుంచి ఇప్పటివరకు మొత్తాన్ని లెక్కగట్టి మరీ రైతులకు బిల్లుల చిట్టాను జారీ చేస్తోంది. ఇంటికి వ చ్చే కరెంట్ బిల్లులోనే దీన్ని కూడా జమ చేసి పంపుతోంది. సకాలంలో స్పందించి బిల్లులు కడితే సరేసరి.. లేకపోతే ఒకట్రెండు రోజుల్లోనే తమ ప్రతాపాన్ని చూపుతోంది.
 
 రూ.20 కోట్ల భారం..!
 గత తొమ్మిదేళ్లుగా ఉచిత విద్యుత్ పొందుతున్న 83వేల మంది రైతులపై తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా రూ.20 కోట్ల భారం పడనుంది. అన్నదాతలపై కాఠిన్యాన్ని ప్రదర్శించిన చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని గుర్తుకు తెచ్చేలా ప్రస్తుత కిరణ్ సర్కారు వ్యవహరిస్తుండడంతో రైతాంగం లబోదిబోమంటోంది. వరుస కరువుతో అల మటించిన తమకు ఈయేడే వాతావరణం అనుకూలించడంతో కాస్తో కూస్తో పంటలు పండుతాయనే ఆశలపై తాజాగా ట్రాన్స్‌కో నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తోందని రైతులు వాపోతున్నారు. తొమ్మిదేళ్ల బకాయిలను ఇప్పుడు మోపడం ఎంతవరకు సబబు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు