1.10 కోట్ల కుటుంబాలకు ఉచిత సరుకులు

20 Apr, 2020 04:11 IST|Sakshi

రెండో విడతలో నాలుగు రోజులుగా బియ్యం, శనగలు పంపిణీ

పోర్టబులిటీ ద్వారా 25 లక్షల మంది స్థానికేతరులకు లబ్ధి

రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో నేరుగా ఇళ్లకే అందజేసిన వలంటీర్లు  

సాక్షి, అమరావతి: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత రేషన్‌ పంపిణీ రెండో విడత కార్యక్రమంలో ఇప్పటి వరకు 1.10 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందాయి. ఇందులో స్థానికేతరులుగా ఉన్న 25.62 లక్షల మంది పోర్టబిలిటీ ద్వారా ప్రస్తుతం వారు నివాసం ఉన్న ప్రాంతాల్లోనే సరుకులు తీసుకున్నారు. మొదటి విడత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రెండో విడతను మరింత పక్కాగా చేపట్టింది. సామాజిక దూరాన్ని పాటించడంతో పాటు రేషన్‌ దుకాణం వద్ద లబ్ధిదారులు గుమికూడకుండా ఉండేందుకు టైం స్లాట్‌తో కూడిన కూపన్లను కేటాయించి సాఫీగా సాగేలా చేశారు.

ఉదయం ఆరు గంటలకే పంపిణీ చేపట్టడం వల్ల కూడా ఎక్కువ మంది సరుకులు తీసుకునే అవకాశం ఏర్పడింది. మొదటి విడతలో బియ్యంతో పాటు కందిపప్పు ఇవ్వగా ఈసారి బియ్యంతో పాటు శనగలు అందించారు. మిగిలిన లబ్ధిదారులు కూడా వారికి కేటాయించిన సమయానికి రేషన్‌ షాపునకు వెళ్లి సరుకులు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచించారు. రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో నివాసం ఉన్న పేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వలంటీర్లు వారి ఇళ్ల వద్దకే వెళ్లి సరుకులు పంపిణీ చేశారు.

మరిన్ని వార్తలు