మరోసారి ఉచిత సరుకులు

2 Jul, 2020 05:48 IST|Sakshi

3వ తేదీ నుంచి కార్డుదారులకు బియ్యం, కందిపప్పు పంపిణీ 

ఉచిత సరుకులు ఇవ్వడం వరుసగా ఇది ఏడోసారి 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మరో విడత ఉచితంగా సరుకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నివారణలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా పేదలు ఉపాధి కోల్పోయారు. దీంతో నిరుపేదలెవ్వరూ ఖాళీ కడుపుతో ఉండటానికి వీలులేదని భావించిన ప్రభుత్వం ఏడో విడత పంపిణీలో భాగంగా బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇవ్వనుంది. చక్కెరకు మాత్రం లబ్ధిదారులు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలోని 1.48 కోట్ల బియ్యం కార్డుదారులు లబ్ధి పొందనున్నారు.

మార్చి 29వ తేదీ నుంచి ఇప్పటివరకు ఆరు విడతలుగా పేదలకు బియ్యంతో పాటు కందిపప్పు లేదా శనగలు ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఏడో విడత పంపిణీ ఈ నెల 3నుంచి ప్రారంభిస్తారు. బియ్యం కార్డులో పేర్లు నమోదైన ప్రతి ఒక్కరికీ 5 కిలోల బియ్యం, కుటుంబానికి కిలో కందిపప్పు ఉచితంగా ఇస్తారు. బియ్యంతో పాటు సబ్సిడీ సరుకుల కోసం రేషన్‌ డీలర్లు ఇప్పటికే డీడీల రూపంలో చెల్లించిన మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఉచిత రేషన్‌ పంపిణీకి సంబంధించి రాష్ట్రానికి అదనంగా బియ్యం కేటాయించాలని కేంద్రానికి బుధవారం లేఖ రాసినట్లు పౌర సరఫరాల శాఖ ఎక్స్‌అఫీషియో కార్యదర్శి కోన శశిధర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు