పేద కుటుంబానికి ఉచిత రేషన్‌

7 Apr, 2020 04:51 IST|Sakshi
రేషన్‌ సరుకులు అందజేస్తున్న ఏఎస్‌వో రమణ, తహసీల్దార్‌ చిన్నికృష్ణ

పేదరికంతో మగ్గుతున్న తనకు రేషన్‌ సరుకులు అందలేదని సీఎం కార్యాలయానికి లేఖ రాసిన మహిళ 

వెంటనే స్పందించిన సీఎం కార్యాలయ అధికారులు 

పేద మహిళ ఇంటికెళ్లి మరీ సరుకులు అందించిన పౌరసరఫరాల శాఖ సిబ్బంది

గాజువాక: ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలతో ఓ పేద కుటుంబానికి ఉచిత రేషన్‌ సరుకులు అందాయి. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులే ఆ పేద కుటుంబం ఇంటికెళ్లి మరీ సోమవారం సరుకులను అందించారు. వివరాల్లోకెళ్తే.. విశాఖపట్నం జిల్లా గాజువాక కొండ ప్రాంతంలో ముగ్గురు పిల్లలతో తాను పేదరికంలో మగ్గుతున్నానని పెంటయ్యనగర్‌కు చెందిన బొడ్డటి పూజ కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాసింది.

తాపీ మేస్త్రి వద్ద కూలీగా పనిచేస్తున్న తన భర్తకు లాక్‌డౌన్‌ కారణంగా పనులు దొరకడం లేదని, దీంతో ఆకలిబాధలు తప్పడం లేదని లేఖలో పేర్కొంది. దీనిపై వెంటనే స్పందించిన సీఎం కార్యాలయ అధికారులు ఆ కుటుంబానికి ఉచిత రేషన్‌ సరుకులు అందజేయాలని విశాఖ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ)ని ఆదేశించారు. జేసీ ఆదేశాలతో తక్షణం స్పందించిన పౌర సరఫరాల శాఖ సహాయ పంపిణీ అధికారి పి.వి.రమణ, గాజువాక తహసీల్దార్‌ చిన్నికృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది స్వయంగా ఉచిత రేషన్‌ సరుకులను ఆమె ఇంటికి తీసుకెళ్లి అందజేశారు. 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అర కిలో పంచదారను అందజేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా పూజ సీఎం కార్యాలయ అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది.  

మరిన్ని వార్తలు