రికార్డు స్థాయిలో ఉచిత రేషన్‌

18 Apr, 2020 03:18 IST|Sakshi
విజయవాడలో రేషన్‌ తీసుకుంటున్న లబ్ధిదారుడు

రెండు రోజుల్లో 50 లక్షల కుటుంబాలకు అందజేత

టైమ్‌ స్లాట్‌ కూపన్ల విధానంతో రేషన్‌ షాపుల వద్ద తగ్గిన రద్దీ

రెడ్‌ జోన్‌ ఏరియాల్లో ఇంటి వద్దే రేషన్‌ అందజేసిన వలంటీర్లు

సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు రోజుల్లోనే అర కోటి కుటుంబాలకు రేషన్‌ షాపుల ద్వారా ఉచిత సరుకులు పంపిణీ చేశారు. పేదల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి సరుకులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. దీంతో రాష్ట్రంలో ఉన్న 29,620 రేషన్‌ షాపులతో పాటు అదనంగా 14,315 కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ఎక్కువ కుటుంబాలకు ఉచిత సరుకులు పంపిణీ చేయడంతో రికార్డు నెలకొల్పినట్లైంది. రెండో విడత పంపిణీ గురువారం నుండి ప్రారంభం కాగా శుక్రవారం నాటికి 50 లక్షల కుటుంబాలకు సరుకులు అందాయి.

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా లాక్‌ డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు రెండో విడత ఉచిత రేషన్‌ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఉదయం 5 గంటలకే రేషన్‌ షాపులు ఓపెన్‌ చేసేలా చర్యలు తీసుకున్నామని రేషన్‌ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలామాధవరావు వెల్లడించారు. చాలా చోట్ల సరుకులు డోర్‌ డెలివరీ చేసేందుకు వలంటీర్లకు డీలర్లు సహకరించారు. టైమ్‌ స్లాట్‌ కూపన్స్‌ విధానం రేషన్‌ షాపుల వద్ద రద్దీని తగ్గించేందుకు ఎంతో ఉపయోగపడ్డాయి. కేంద్రప్రభుత్వం అదనంగా ఉచిత రేషన్‌ ఇస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఆహార భద్రతా పథకం కింద ఉన్న 92 లక్షల కుటుంబాలకే వర్తిస్తోంది. మిగిలిన 55.24 లక్షల కుటుంబాలకు అయ్యే అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి బియ్యంతో పాటు శనగలు పంపిణీ చేస్తోంది.     

మరిన్ని వార్తలు