నేటి నుంచి ఉచిత ఇసుక

22 Mar, 2016 04:40 IST|Sakshi

ఆదేశాలిచ్చిన కలెక్టర్
14 రీచ్‌ల్లో 1.29 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక
రీచ్‌కొక ఇన్‌చార్జి ఆఫీసర్ నియామకం
నిబంధనలు అతిక్రమిస్తే రూ.లక్ష వరకూ జరిమానా


విశాఖపట్నం: ఉచిత ఇసుక తవ్వకాలకు జిల్లా యంత్రాంగం ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎంపిక చేసిన 14 రీచ్‌లలో మంగళవారం నుంచి ఇసుక తవ్వకాలు..రవాణా జరగనున్నాయి. ఆయా రీచ్‌లలో 1,29,080 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉన్నట్టుగా నిర్ధారించారు. ఇందుకోసం ఒక్కో రీచ్‌కు ఓ చార్జి ఆఫీసర్‌తో పాటు మరో ఇన్‌చార్జి ఆఫీసర్‌ను కూడా నియమించారు. వీరి అనుమతులతోనే ఇసుక తవ్వకాలు జరుపుకోవాల్సి ఉంటుంది. అయితే క్యూబిక్ మీటర్‌కు ట్రాక్టర్‌కైతే రూ.250, లారీకైతే రూ.100  చొప్పున స్థానిక రీచ్ ఇన్‌చార్‌‌జలను సంప్రదించి లోడింగ్ ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. లోడింగ్ చార్జీలు మినహా ఎలాంటి  సీనరేజ్, ఇతర చార్జీలు చెల్లించాల్సినవసరం లేదు. ఇసుక తీసుకువెళ్లే వారు వాహనంతో పాటు తమ ఆధార్‌కార్డు, ఫొటో కాపీని సంబంధిత ఇసుక రీచ్ ఇన్‌చార్జికి ఇచ్చి రికార్డు చేసుకోవల్సి ఉంటుంది. ఈ రీచ్‌ల్లో అందుబాటులో ఉన్న ఇసుకను పూర్తిగా వ్యక్తిగత అవసరాలైన గృహ నిర్మాణం, వ్యక్తిత మరుగుదొడ్ల నిర్మాణం తదితర అవసరాల కోసం మాత్రమే వినియోగించాలి. స్థానికంగా జరిగే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఉచితంగా ఇవ్వనున్నారు. ఈ ప్రాంతాల నుంచి ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతించారు. రీచ్‌ల్లో వాల్టా చట్టానికి లోబడి ఇసుకను తీసుకువెళ్లాల్సి ఉంటుంది.

 
ఇవీ నిబంధనలు..: వంతెనలు, కల్వర్టులు, సాగునీరు, తాగునీరు భూగర్భ జల , నీటిపారుదల నిర్మాణాలు, రాష్ట్ర, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు తదితర వాటికి 500 మీటర్ల వరకూ ఎలాంటి ఇసుక తవ్వకాలు జరపడానికి వీల్లేదు. ఏపీ వాల్టా, పర్యావణ నిబంధనల మేరకు మాత్రమే ఇసుక తవ్వకాలు అనుమతిస్తారు. కూలీలతోనే తవ్వకలు జరపాలే తప్ప ఎక్కడా యంత్రాలను ఉపయోగించడానికి వీల్లేదు. నిర్మాణ రంగంలో అవసరమైన దానికంటే ఇసుక నిల్వ ఉంచ కూడదు. ఇసుకను ఫిల్లింగ్ నిమిత్తం ఉపయోగించడానికి వీల్లేదు. అంతరాష్ట్ర ఇసుక రవాణాను నిషేధించారు. ఇసుక అమ్మకం, నిల్వలతో వాహనాలు ఎక్కడపడితే అక్కడ నిలిపివేసి విక్రయిస్తే సీజ్ చేస్తారు. రీచ్‌ల్లో తవ్వకాలను సాయంత్రం 5 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ఆ తర్వాత రీచ్‌లు మూసివేస్తారు.

రాత్రిపూట తవ్వకాలు కానీ.. లోడింగ్ చేయడం కాని పూర్తి నిషేధం. ప్రకటించిన ఇసుక రీచ్‌ల నుంచి కాకుండా ఇతర రీచ్‌ల నుంచి ఇసుక తవ్వకం జరపడానికి వీల్లేదు.  ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. తీవ్రతను బట్టి రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశమూ ఉంది. వాహనాలు, యంత్రాలను జప్తు చేస్తారు. పునరావృతమైతే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తారు.

 

>
మరిన్ని వార్తలు