పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

22 Feb, 2018 13:14 IST|Sakshi
జిల్లా సమన్వయకర్త ఆర్‌.డి.వి.చంద్రశేఖర్‌

కశింకోట (అనకాపల్లి): ఏపీ బాలయోగి గురుకుల కళాశాలల్లో ఇంటర్మీ డియట్‌ పూర్తిచేసిన విద్యార్థుల్లో ఆసక్తి గల వారికి పబ్లిక్‌  పరీక్షల అనంతరం ఎంసెట్, నీట్, బిట్స్‌ వంటి పోటీ పరీక్షలకు   ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు గురుకులాల జిల్లా సమన్వయకర్త ఆర్‌.డి.వి.చంద్రశేఖర్‌ వెల్ల ్లడించారు.  తాళ్లపాలెం ఏపీ బాలయోగి బాలికల  గురుకుల కళాశాలలో బుధవారం సాయంత్రం  మాట్లాడారు. పరీక్షల అనంతరం  స్వల్ప కాలికంగా 40 రోజులపాటు ఆయా  పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నామని, ఇందుకు జిల్లాలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామన్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజును భరిస్తుందన్నారు. గురుకులంలో చదివిన విద్యార్థులు ఉపాధి, ఉద్యోగావకాశాలు  పొందడానికి కేరీర్‌ గైడెన్స్‌ ఇస్తున్నామన్నారు. 

జిల్లాలోని 11 బాల బాలికల గురుకుల పాఠశాలలు,  కళాశాలల్లో డిజిటల్‌ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి వర్చువల్‌ తరగతులను కూడా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ప్రారంభిస్తామన్నారు. దీనివల్ల ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థులు ఇతర ప్రాంతాల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి, అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి 8,9,10 తరగతులకు వృత్తి విద్యా కోర్సులను కూడా ప్రవేశ పెట్టాలని యోచిస్తున్నట్లు చెప్పారు.  తాళ్లపాలెంతోపాటు రెండు గురుకులాల్లో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లున్నాయని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరో మూడు గురుకులాల్లో ఏర్పాటు చేయడానికి   భవనాలు సమకూర్చి వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. దీనివల్ల చదువుతోపాటు సాంకేతిక పరిజ్ఞానం పొందడానికి అవకాశం కలుగుతుందన్నారు. టెన్త్‌ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. 

ముగిసిన  రోబోటిక్‌ శిక్షణ
కశింకోట మండలంలోని ఏపీ బాలయోగి గురుకులంలో మూడు రోజులపాటు జిల్లాలోని విద్యార్థులకు నిర్వహించిన  రోబోటిక్‌ శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. తరగతుల్లో పాల్గొన్న విద్యార్థులకు  చంద్రశేఖరరావు  ప్రతిభా ధ్రువపత్రాలను అందజేశారు.  

మరిన్ని వార్తలు