జెండా కమలమ్మ మృతి తీరని లోటు

12 Jul, 2014 04:48 IST|Sakshi
జెండా కమలమ్మ మృతి తీరని లోటు

ఒంగోలు క్రైం: స్వాతంత్య్ర సమరయోధురాలు, హేతువాద నాస్తికోద్యమంలో కీలకపాత్ర పోషించి..జెండా కమలమ్మగా పేరుగాంచిన కొడాలి కమలమ్మ (99) మృతి తీరనిలోటని నేషనలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఇండియా, జిల్లా హేతువాద సంఘం ప్రధాన కార్యదర్శి ఏ.రత్తయ్య అన్నారు. స్థానిక హేతువాద సంఘం జిల్లా కార్యాలయంలో సంఘ అత్యవసర సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మృతికి హేతువాద సంఘం నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇంకొల్లులో మృతి చెందిన కమలమ్మ నేత్రాలు విజయవాడ నాస్తిక కేంద్రంలోని స్వేచ్ఛా ఐ బ్యాంకుకు దానం చేశారన్నారు.

ఆమె మృతదేహాన్ని మెడికో విద్యార్థులకు పరీక్షల కోసం విజయవాడ సిద్ధార్ధ మెడికల్‌కాలేజీకి ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారని చెప్పారు. కమలమ్మ 13వ ఏటనే స్వాతంత్రోద్యమంలో పాల్గొందన్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడంతో బ్రిటీష్ ప్రభుత్వం ఆమెకు 18 నెలల పాటు జైలుశిక్ష విధించిందన్నారు. రాయవేలూరులో జైలు జీవితం గడిపిందని గుర్తు చేశారు.

అప్పట్లో అధికారుల కళ్లుగప్పి జైలులోనే కమలమ్మ స్వాతంత్య్ర జెండాను తయారు చేసి ఎగురవేసిందని, దీంతో ఆమెకు ముందు ప్రకటించిన శిక్ష కంటే అదనపు శిక్ష విధించారని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆమె జెండా కమలమ్మగా పేరు పడిందని తెలిపారు. విజయవాడ నాస్తిక కేంద్రంతోనూ, గోరాతోనూ పరిచయం ఏర్పడి దాదాపు 60 సంవత్సరాలకు పైగా హేతువాద, నాస్తికోద్యమానికి ఎనలేని కృషి చేసినట్లు కీర్తించారు. ఈ సందర్భంగా కమలమ్మ మృతికి హేతువాద సంఘం నాయకులు నార్నె వెంకటసుబ్బయ్య, చుంచు శేషయ్య, ఎస్‌వీ రంగారెడ్డి, ఎస్ చంద్రశేఖర్‌బాబు, సుభాని, మధుబాబు, ప్రభుదాసు, నజీర్‌బాషాలు ప్రగాఢ సంతాపం తెలిపారు

మరిన్ని వార్తలు