యోధురాలి నిష్క్రమణం

25 Oct, 2019 13:03 IST|Sakshi

తామ్రపత్ర గ్రహీత విశాలాక్షి అస్తమయం

దేశం కోసం జీవితం అంకితం

ఉద్యమ సమయంలో పలుమార్లు జైలుకు

హరిజనోద్ధరణకు అవిశ్రాంత కృషి

బ్రిటిష్‌ తుపాకులకు ఎదురొడ్డిన రూపాకుల విశ్రమించింది. క్విట్‌ ఇండియా.. అని చిన్నతనంలోనే గర్జించిన గళం ఆగిపోయింది. భర్త, మామల ఆడుగుజాడల్లో స్వాతంత్య్రోద్యమంలోకి దూకి.. ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాలతోపాటు హరిజనోద్ధరణకు అవిశ్రాంత కృషి సల్పిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు రూపాకుల విశాలాక్ష్మి అస్తమించారు. శ్వాసకోస వ్యాధితో కొన్నాళ్లుగా చికిత్స పొందుతున్న ఆమె గురువారం ఉదయం 11.44 గంటలకు తుదిశ్వాస విడిచారు. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసి తామ్రపత్రం అందుకున్న ఆమె.. తనకొచ్చే సమరయోధుల పింఛనులో కూడా చాలా వరకు సమాజ సేవకే వెచ్చించిన విశాల హృదయురాలామె. ఉద్యమ సమయంలో పలుమార్లు జైలుకు కూడా వెళ్లిన విశాలాక్షి 94 ఏళ్ల సుదీర్ఘ జీవనయానాన్ని ముగించడంతో ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఖిన్నులయ్యారు.

ప్రముఖ గాంధేయవాది, స్వాతంత్ర సమరయోధురాలు, తామ్రపత్ర గ్రహీత రూపాకుల విశాలాక్షి (94) అస్తమించారు. కొద్ది రోజులుగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతూ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విశాలాక్షి గురువారం ఉదయం 11.44 గంటలకు మరణించారు. ఆమె పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం మహారాణిపేటలోని స్వగృహంలో ఉంచారు.

గాంధీజీ పిలుపుతో ఉద్యమంలోకి..
విశాఖపట్నం మహారాణిపేటవాసి శిష్ట్లా దక్షిణామూర్తి, సీతామహాలక్ష్మి దంపతులకు కలిగిన ఎనిమిది మంది సంతతిలో నాలుగో సంతానంగా విశాలాక్షి 1926 ఏప్రిల్‌ ఆరో తేదీన జన్మించారు. తండ్రి దక్షిణామూర్తి స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా, స్వదేశీ ఉద్యమం వంటి పలు ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, మహాత్మాగాంధీ పిలుపు మేరకు చిన్నవయసులోనే ఉద్యమంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు రూపాకుల రామకృష్ణయ్య కుమారుడు సుబ్రహ్యణ్యాన్ని 1935వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అప్పటికే స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకుంటున్న భర్త, మామల అడుగుజాడల్లో నడిచారు. 

హరిజనోద్యమంలో కీలక భూమిక
దేశ నేతలతో పాటు చురుగ్గా ఉద్యమంలో పాలుపంచుకున్న విశాలాక్షిని పలుమార్లు తెల్లదొరలు అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపారు. 1946వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హరిజన సేవా సంఘం సభ్యురాలైన విశాలాక్షి పదివేల మంది కార్యకర్తలతో కలిసి హరిజనులకు తిరుపతి ఆలయ ప్రవేశాన్ని కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమం చేపట్టారు. ఆమెను అరెస్ట్‌ చేసి బళ్లారి జైల్లో పెట్టారు. వారి ఉద్యమంతో హరిజనులకు ఆలయ ప్రవేశం సుగమమైంది. స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విశాలాక్షి 2 సంవత్సరాల పాటు గడిపిన జైలు జీవితంలో లాఠీదెబ్బలు తిన్నారు. 1946లో వీరు చేపట్టిన ఆలయప్రవేశ ఉద్యమం సందర్భంగా విశాలాక్షి కుటుంబం అగ్రవర్ణానికి చెందినదైనా అగ్రవర్ణాల వారు వీరిని వెలివేసి, శుభ, అశుభ కార్యక్రమాలకు పిలవడం మానేశారు. విశాలాక్షి మామ రామకృష్ణయ్యను మహాత్మాగాంధీ ఏపీ హరిజన సేవా సంఘం ప్రధాన కార్యదర్శిగా 1941లో నియమించారు. 1942లో జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమం, విశాఖపట్నంలో జరిగిన ఉప్పు సత్యా గ్రహం, టౌన్‌హాలులో మహాత్మాగాంధీ ముఖ్య నేతలతో చేపట్టిన స్వాతంత్య్ర ఉద్యమంలో భర్త సుబ్రహ్మణ్యం, మామ రామకృష్ణయ్యలతో కలిసి పాల్గొన్నా రు. 1942లో జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమం, విశాఖపట్నంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం, టౌన్‌హాలులో మహాత్మాగాంధీ ముఖ్య నేతలతో చేపట్టిన స్వాతంత్య్ర ఉద్యమంలో భర్త సుబ్రహ్మణ్యం, మామ రామకృష్ణయ్యలతో కలిసి పాల్గొన్నారు. 

భర్త మరణం

2002లో భర్త రూపాకుల సుబ్రహ్మణ్యం మరణించినా, ధైర్యం కోల్పోలేదు. ఆయన జయంతి, వర్ధంతి సమయాల్లో పేదలకు వస్త్రదానం చేసేవారు. పేద యువతుల వివాహానికి ఆర్థిక చేయూతనిస్తూ ఆయన స్మృతుల్లోనే జీవించారు.

సంగీతం, పుస్తక పఠనం  
రూపాకుల విశాలాక్షి మంగళంపల్లి బాలమురళీకృష్ణ తం డ్రి వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. రోజూ కీర్తనలు రాసి పాడుకోవడం, రామాయణ, మహాభారత, భగవద్గీత వంటి గ్రంథాలను చదవడం అలవాటుగా మార్చుకున్నారు. 

కుటుంబమంతా దేశ సేవలోనే..
రూపాకుల విశాలాక్షి భర్త సుబ్రహ్మణ్యం, మామ రామకృష్ణయ్య, తండ్రి శిష్ట్లా దక్షిణామూర్తి, కుమారుడు రూపాకుల రవికుమార్‌తో సహా కుటుంబం మొత్తం దేశసేవకు అంకితమయ్యారు.

సామాజిక సేవ
వయసు మీద పడినా సమాజసేవ చేయాలన్న ఆలోచన విశాలాక్షిని వీడలేదు. కేంద్రప్రభుత్వం తనకు ఇచ్చే స్వాతంత్య్ర సమరయోధుల పింఛనులో అధిక మొత్తం పేదల కోసమే ప్రతి నెలా ఖర్చు చేసేవారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, పేద కుటుంబాలకు చెందిన మహిళలకు వస్త్రాలు, నిత్యావసరాలు అందజేసేవారు.

సోదరులతో ఆత్మీయానుబంధం : సోదరులతో ఆమెది ఆత్మీయానుబంధం. తోడబుట్టిన నలుగురు అన్నదమ్ములు శిష్ట్లా సత్యనారాయణ, వెంకటరామశాస్త్రి, యజ్ఞనారాయణ, లక్ష్మీనారాయణ విశాఖపట్నంలోనే నివసిస్తున్నారు. ఏటా రాఖీ పండుగనాడు మహారాణిపేటలోని తన స్వగృహానికి వీరిని పిలిపించుకుని వారికి రాఖీ కట్టేవారు.

ఇదీ ఆమె కుటుంబం..
విశాలాక్షికి ఆరుగురు సంతానం. ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు.  ప్రస్తుతం ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు రూపాకుల రవికుమార్‌ సంఘ సేవకుడు, రాజీవ్‌గాంధీ మానవసేవ జాతీయ అవార్డు గ్రహీత. ఇద్దరు కుమార్తెల్లో పెద్ద కుమార్తె శిష్ట్లా శ్రీలక్ష్మి అంతర్జాతీయ క్రీడాకారిణి, యోగా శిక్షకురాలు, ప్రకృతి చికిత్సాలయం వైద్యురాలు, మరో కుమార్తె గూడా మైథిలి (గృహిణి) ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. రవికుమార్, శ్రీలక్ష్మి ఇరువురూ విశాఖపట్నం మహారాణిపేటలో నివాసం ఉంటున్నారు.

తామ్రపత్ర గ్రహీత
స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న సమరయోధుల్లో అతికొద్ది మందికి  కేంద్ర ప్రభుత్వం ఇచ్చే తామ్ర పత్రాన్ని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేతుల మీదుగా విశాలాక్షి అందుకున్నారు.

నేడు అంత్యక్రియలు
విశాలక్షి పార్థివ దేహానికి 25వ తేదీ శుక్రవారం ఉదయం 11.30 గంటలకు జ్ఞానాపురంలోని హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధురాలైన ఆమెకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాలని ఆమె కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు