మరణంలోనూ వీడని బంధం

25 Dec, 2018 11:20 IST|Sakshi
ఎన్‌. హేమంత్‌ రెడ్డి ఎన్‌.ఎస్‌. కేశవులు రెడ్డి

వారిద్దరూ గాఢ స్నేహితులు

ఒకే స్కూలులో విద్యాభ్యాసం

ఉద్యోగ రీత్యా ఇద్దరూ టీచర్లే

ఒకేరోజు కన్నుమూత

చిత్తూరు ,తవణంపల్లె: వారిద్దరూ చిన్నప్పటి నుంచి కలసిమెలిసి ఉండేవారు..ఇద్దరికీ రెండేళ్ల వయసు తేడా. ఒకే గ్రామానికి చెందిన వీరు కలిసి ఒకే చోట చదువుకున్నారు. ఇద్దరూ ఉపాధ్యాయులుగానే  పనిచేశారు. వీరిద్దరూ ఒకేరోజు(ఆదివారం) అనారోగ్యంతో కన్నుమూశారు. మృత్యువు దగ్గరా వీరి బంధం వీడిపోలేదని స్థానికులు కంటతడి పెట్టారు. తవణంపల్లె మండలం వెంగంపల్లెకు చెందిన కేశవులురెడ్డి, హేమసుందరరెడ్డి చిన్న నాటి నుంచి కలిసి ఉండేవారు. ఇద్దరూ వెంగంపల్లె పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. అరగొండ హైస్కూల్‌లో కూడా ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకూ చదువుకొన్నారు. తర్వాత ఇద్దరూ బీఈడీ చదివారు. 1984లో వెంగంపల్లె ప్రాథమిక పాఠశాలలో కేశవులు రెడ్డి పనిచేశారు.

తొడతర ప్రాథమిక పాఠశాలలో  హేమసుందర్‌ రెడ్డి  ఉపాధ్యాయుడిగా పద్యోగంలో చేరారు. పలు పాఠశాలలో పనిచేసిన కేశవులు రెడ్డి 2009లో అరగొండ హైస్కూల్లో రిటైరయ్యారు. తర్వాత రెండేళ్లకు హేమసుందరరెడ్డి కూడా ఉద్యోగ విరమణ చేశారు. హేమసుందర్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేశవులు రెడ్డికి భార్య..ఒక కుమార్తె సంధ్యారాణి. ఈమె బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తోంది. వరుసకు అన్నదమ్ములైన కేశవులు..హేమసుందర్‌ రిటైరయ్యాక ఒకే గ్రామంలో ఉంటున్నారు. వీరిద్దరికీ అనారోగ్యపరమైన సమస్యలున్నాయి. ఈనేపథ్యంలో ఆదివారం ఉదయం కేశవులు..రాత్రి హేమసుందరరెడ్డి కన్నుమూశారు. మరణం దగ్గర వీరి బంధం చెదిరిపోలేదు. ఒకేరోజు చనిపోయారంటూ  గ్రామస్తులంతా చర్చించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ వెంటనే వెళ్లి  కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మరిన్ని వార్తలు