కర్ణాటక నుంచి తెచ్చుకుందాం..

5 Jun, 2014 02:22 IST|Sakshi
కర్ణాటక నుంచి తెచ్చుకుందాం..

కళ్యాణదుర్గం, న్యూస్‌లైన్ : ఖరీఫ్ సాగుకు సమయం ఆసన్నమైంది. ఇటీవల ఓ మోస్తరు వర్షాలు కూడా కురిశాయి. మంచి పదునులో విత్తనాలు వేసేందుకు రైతులు ఆత్రుత పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు అవసరమైన టీఎంవీ-2 రకం వేరుశనగ విత్తనకాయలను సబ్సిడీతో ఇచ్చే పరిస్థితి కన్పించడం లేదు. కే-6 రకం విత్తనకాయలను పూర్తి ధర (కింటాల్ రూ.4,600)తో అంటగట్టేందుకు సిద్ధమైంది. తర్వాత రైతుల ఖాతాల్లో కింటాల్‌కు రూ.1,500 చొప్పున సబ్సిడీ మొత్తాన్ని జమ చేస్తామని చెబుతోంది. ఎప్పటి నుంచి పంపిణీ చేస్తుందో స్పష్టత ఇవ్వడం లేదు.
 
 ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని వేలాది మంది రైతులు విత్తన వేరుశనగ కోసం కర్ణాటక బాట పడుతున్నారు. అక్కడి ప్రభుత్వం 30 కిలోల టీఎంవీ-2 రకం విత్తనకాయలను రూ.960కే పంపిణీ చేస్తోంది. దీంతో మన రైతులు రాష్ట్ర సరిహద్దున ఉన్న చెళ్లికెర, పావగడ, వైఎన్‌ఎస్ కోట, లింగనపల్లి, తిప్పరెడ్డిపల్లి, ఉల్లార్తి, పరుశురాంపురం, తదితర ప్రాంతాలలో బంధువులు, స్నేహితుల ద్వారా విత్తనకాయలను తెప్పించుకుంటున్నారు. ఇప్పటికే సుమారు వెయ్యి మంది రైతులు దాదాపు ఐదు వే ల బస్తాలు తెచ్చుకున్నారు.
 
 40,500 కింటాళ్ల కే-6 విత్తనం కోసం ప్రతిపాదనలు
 కళ్యాణదుర్గం వ్యవసాయ డివిజన్‌లోని ఆరు మండలాల్లో 1.10 లక్షల హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణానికి అనుగుణంగా 40,500 కింటాళ్ల కే-6 రకం విత్తనకాయలు అవసరమని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఇందులో ఇప్పటి వరకు ఒక బస్తా కూడా సరఫరా కాలేదు. మొదటి విడత కింద 5,900 కింటాళ్లు పంపిణీ చేస్తామని, మిగిలిన విత్తనకాయలను విడతల వారీగా ఇస్తామని ఏడీఏ గురుమూర్తి తెలిపారు. త్వరలోనే రైతులకు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు.
 
 కర్ణాటక నుంచి తెచ్చుకున్నా
 ఇక్కడ సబ్సిడీ వేరుశనగ ఇవ్వకపోవడంతో కర్ణాటక నుంచి తెచ్చుకున్నా. అక్కడి ప్రభుత్వం క్వింటాల్ రూ.3,200లతో టీఎంవీ-2 రకం విత్తనకాయలను ఇస్తోంది. నేను రవాణా ఖర్చుతో పాటు రూ.400 అదనంగా చెల్లించి ఇక్కడి తెచ్చుకున్నా.
 - పాతన్న, శెట్టూరు
 
 మన ప్రభుత్వంపై నమ్మకం లేకనే
 వర్షాలు కురుస్తున్నాయి. విత్తన సాగు సమయం ఆసన్నమైంది. మన ప్రభుత్వం రైతులకు అవసరమైన వేరుశనగ విత్తన రకాలను సబ్సిడీతో పంపిణీ చేస్తుందనే నమ్మకం లేదు. అందుకేకర్ణాటక నుంచి కొనుగోలు చేశా.   
 - వన్నూర్‌స్వామి, శెట్టూరు
 

మరిన్ని వార్తలు