సేవా పన్ను.. మున్సిపల్‌కు దన్ను

16 Jun, 2014 02:43 IST|Sakshi
సేవా పన్ను.. మున్సిపల్‌కు దన్ను

 గూడూరు : ప్రజల నుంచి ప్రతిదానికి సేవా పన్ను వసూలు చేస్తున్న మున్సిపల్ శాఖాధికారులు భారీ ఆదాయ వనరైన రైల్వేశాఖపై దృష్టి సారించడం లేదు. ఏళ్ల తరబడిగా రైల్వేశాఖ మున్సిపాలిటీలకు సేవా చెల్లించడం లేదు. మున్సిపాలిటీకి భారీ ఆదాయ వనరుగా రైల్వే శాఖ ఉన్నప్పటికీ తద్వారా రాబడి పెంచుకునేందుకు సంబంధిత అధికారులు దృష్టి సారించిన పాపాన పోవడం లేదు. పన్ను వసూలుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ రీజినల్ అధికారులకు సీడీఎంఏ (కమిషనర్ డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) నోటీసులు జారీ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. కనీసం పన్ను నోటీసులు ఇవ్వడంలోనే ఏళ్ల తరబడి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.  
 
 నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని సుప్రీం కోర్టు కల్పించింది. తద్వారా స్థానిక సంస్థలు ఆర్థిక బలోపేతానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మున్సిపల్‌శాఖాధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నగర పంచాయతీల నుంచి మున్సిపాలిటీ వరకు స్థాయిని బట్టి ఆ ప్రాంతంలోని రైల్వే శాఖ ఆస్తుల నుంచి సేవా పన్నును వసూలు చేయాలని 2009 నవంబరు 19న సుప్రీంకోర్టు మున్సిపల్‌శాఖకు ఆదేశాలిచ్చింది.
 
 సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర మున్సిపల్ కమిషనర్ అండ్ డెరైక్టర్  2010 మే 5న రాష్ట్రంలోని అన్ని నగర పంచాయతీల నుంచి కార్పొరేషన్ల వరకు ఆయా పరిధిని బట్టి 75 నుంచి 33 శాతం వరకు సేవల ఆధారంగా రైల్వే ఆస్తులకు సంబంధించి సేవా పన్ను వసూలు చేయాలని మెమో జారీ చేశారు. ఆ మేరకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటే ప్రతి ఏటా సుమారు రూ. 5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఆదాయం వనకూరే అవకాశం ఉంది. అయితే రీజియన్ పరిధిలోని మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడంలో విఫలమవుతున్నారు.
 
 కనీసం రీజియన్ పరిధిలోని నగర పంచాయతీల నుంచి కార్పొరేషన్ల వరకు రైల్వేశాఖకు ఏ మేర సేవలు అందిస్తున్నారు.. వాటికి ఎంతెంత పన్నులు విధించే అవకాశం ఉందనే అంచనాలు కూడా ప్రస్తుతానికి ఆయా మున్సిపల్ అధికారుల వద్ద లేవనే చెప్పాలి. రైల్వే శాఖ నుంచి పన్నులు వసూళ్లు చేసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసి నాలుగున్నరేళ్లు గడిచిపోయింది. పన్నుల వసూలుకు విధి విధానాలు చేపట్టాలని సీడీఎంఎ ఆదేశాలిచ్చి నాలుగేళ్లు గడిచినా మున్సిపల్ అధికారులు చలనం లేకుండా పోయింది.  
 
 లోకాయుక్త ఆదేశాలతోనే కదలిక..
 గుంటూరు మున్సిపల్ రీజియన్‌లో నగర పంచాయతీల నుంచి కార్పొరేషన్ల వరకు రేల్వే శాఖ నుంచి సేవా పన్నును వసూళ్లు చేస్తున్నారా లేదా అని గూడూరు పట్టణానికి చెందిన నాను మునీంద్రారెడ్డి 2012లో సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని కోరారు. ఈ మేరకు మున్సిపల్ రీజనల్ డెరైక్టర్ నెల్లూరు కార్పొరేషన్, తెనాలి మున్సిపాల్టీలు మాత్రమే రైల్వే శాఖకు సేవా పన్ను వసూళ్ల కోసం నోటీసులు జారీ చేస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. దీంతో మునీంద్రారెడ్డి లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో సీడీఎంఎకు  నోటీసులు జారీ చేసింది. అయినా కూడా మున్సిపల్ అధికారులు కనీసం సేవా పన్ను నోటీసులు జారీ చేయడంలోనే అలసత్వం వహిస్తున్నారు. సేవా పన్ను వసూళ్లపై మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రాష్ట్ర గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు మునీంద్రారెడ్డి తెలిపారు.  
 
 కొత్త మున్సిపల్ మంత్రి అయినా చొరవ చూపుతారా..
  త్వరలో ఆయా మున్సిపాల్టీలకు నూతన పాలకవర్గాలు కూడా కానున్నాయి. ఈ జిల్లాకు చెందిన డాక్టర్ పి.నారాయణ మున్సిపల్ శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఆయనైనా ఈ ఆదాయవనరుపై దృష్టి సారిస్తే మున్సిపాలిటీలు ఆర్థికంగా బలోపేతం అవుతాయి. తద్వారా పట్టణ, నగరాల అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి.
 
 జూదరుల అరెస్ట్
 నెల్లూరు(క్రైమ్): పేకాట ఆడుతున్న నలుగురు జూదరులను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. హరనాథపురంలో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో  కొందరు పేకాట ఆడుతున్నారన్న సమాచారం స్పెషల్‌బ్రాంచ్ పోలీసులకు అందింది. స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ జి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు స్పెషల్‌బ్రాంచ్ పోలీసులు, నాల్గోనగర పోలీసులు సంయుక్తంగా ఆ అపార్ట్‌మెంట్‌పై దాడి చేశారు. పేకాట ఆడుతున్న నలుగురు జూదరులను అరెస్ట్‌చేసి వారి నుంచి సుమారు రూ. లక్ష నగదు, నాలుగుసెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నాల్గోనగర ఎస్‌ఐ డి. వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు