పోరు భూమి

1 Jan, 2016 23:34 IST|Sakshi

నేటి నుంచి మూడో విడత జన్మభూమి
సమస్యలు, హామీలపై నిలదీతకు ప్రజలు, విపక్షాల సన్నద్ధం
పింఛన్లు, ఇళ్లు, కమిటీల పెత్తనం, రుణ మాఫీ తదితర సమస్యలపై ప్రశ్నించే అవకాశం

 
విశాఖపట్నం : ‘జన్మభూమి మావూరు’ శుక్రవారం నుంచి మళ్లీ మొదలవుతోంది. తొలి రెండు విడతలు మొక్కుబడి తంతు గానే సాగగా.. ఈసారి మాత్రం తమపై వత్తిడి ఉం టుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. హుద్‌హుద్ ప్రభావంతో తొలివిడత, స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావంతో మలివిడత మొక్కుబడిగా సాగగా.. మూడో విడత మాత్రం ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటనలు.. విపక్షాల నుంచి నిరసనలు వెల్లువెత్తే అవకాశాలు కన్పిస్తున్నాయి.

అర్జీల చిట్టా కాకిలెక్కలే!
టీడీపీ సర్కారు గద్దనెక్కిన తర్వాత 2014 అక్టోబర్‌లో తొలి జన్మభూమి తలపెట్టారు. హుద్‌హుద్ దెబ్బకు ఈ కార్యక్రమానికి ఆదిలోనే బ్రేకులుపడ్డాయి. ఆ తర్వాత నవంబర్‌లో కొనసాగించగా, తుపాను ప్రభావంతో అర్జీలు వెల్లువెత్తాయి. ఏకంగా 3.54 లక్షల అర్జీలు రాగా, వాటిలో అర్హమైనవంటూ లక్షా 92 వేల 202 అర్జీలను మాత్రమే అప్‌లోడ్ చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీతో 2015 జూన్‌లో మొక్కుబడిగా జరిగిన రెండోవిడత జన్మభూమిలో  20 వేల అర్జీలు మాత్రమే వచ్చాయి. రెండు విడతల్లో 3.74లక్షల అర్జీలు రాగా, 2.02,390 అర్జీలను అప్‌లోడ్ చేశారు. వీటిలో 1.81లక్షల అర్జీలను పరిష్కరించగా, ఇంకా 20,883 అర్జీలు పరిష్కరించాల్సి ఉందని లెక్కతేల్చారు. ఈ లెక్కలన్నీ కాకిలెక్కలుగానే కన్పిస్తున్నాయనే విమర్శలున్నాయి.
 
కొత్త కార్డులు జారీ చేసినా..
టీడీపీ పగ్గాలు చేపట్టక ముందు జిల్లాలో 12.25 లక్షలకుపైగా బీపీఎల్ కార్డులుండేవి.   ప్రస్తుతంవాటి సంఖ్య 10,28,800కు చేరింది. అంటే రెండు లక్షలకు పైగా కార్డులు వివిధ రూపాల్లో తొలగించేశారు. కొత్తకార్డుల కోసం 1.75 లక్షల మంది దరఖాస్తు చేస్తే  1.15 లక్షల కార్డులు మాత్రమే మంజూరు చేశారు. కాగా ఇప్పటివరకు ముద్రించిన కార్డులు కేవలం 70 వేల లోపే. కొత్తకార్డులను జన్మభూమి పంపిణీ చేయనుండగా మంజూరైన కార్డులందని వారు, కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు, కార్డులు కోల్పోయిన వారు సైతం సభల్లో నిలదీసే అవకాశాలు కన్పిస్తున్నాయి.
 
పింఛన్‌దారుల పాట్లు..
 ఈ ప్రభుత్వం వచ్చేనాటికి జిల్లాలో 3.26 లక్షల పింఛన్లుండగా.. వడపోతల పేరిట పాతిక వేలకు పైగా పింఛన్లను తొలగించారు. ఆ తర్వాత కాల్‌బ్యాక్, కొత్తగా మంజూరు చేసిన పింఛన్లు కలుపుకొని జిల్లాలో పింఛన్ల సంఖ్య 3,24,585కు చేరితే గత మూడునెలల్లో ఆధార్ మిస్‌మ్యాచ్ పేరిట 28,287 పింఛన్లను నిలిపేశారు.మరో పక్క వరుసగా మూడునెలల పాటు పింఛన్ తీసుకోలేదనే సాకుతో జిల్లాలో సుమారు  5వేలకు పైగా పింఛన్లు రద్దుచేశారు. వీరంతా సభల్లో తమ గోడు వినిపించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల జరిగిన జెడ్పీ మీటింగ్‌లో పింఛన్ల విషయమై అధికార, విపక్ష ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

హౌసింగ్ పైనే దృష్టంతా..
హౌసింగ్ ఫర్ ఆల్ అంటూ జీవీఎంసీ పరిధిలో 20.030 ఇళ్లు మంజూరు చేస్తే ఏకంగా 1.84 లక్షల మంది దరఖాస్తుచేసుకున్నారు. గ్రామీణజిల్లాకు 12,500 ఇళ్లు మంజూరు చేస్తే ఇప్పటికే  46,053 మంది అర్హులుగా లెక్కతేల్చి అప్‌లోడ్ చేశారు. కానీ ఈ జాబితాలను జన్మభూమి కమిటీలకు అప్పగించారు. ఈ జాబితాల్లో టీడీపీ కార్యకర్తలెవరో లెక్కతేల్చి వారికి మాత్రమే ఆమోదముద్ర వేయనుండడంతో అర్హులైన మిగిలిన బాధితులు సభలను వేదికగా చేసుకుని నిలదీసే అవకాశం ఉంది.
 
‘కొను’గోల్‌మాల్
 ఇక జిల్లాలో ఖరీఫ్ కోతలు నూరుశాతం పూర్తయ్యాయి. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. కానీ నేటివరకు ఎక్కడా కొనుగోలు ప్రారంభం కాలేదు. దళారీల చేతిలో అన్నదాతలు నిలువునా మోసపోతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అధికారుల వైఫల్యాన్ని ఎండగట్టే అవకాశాలున్నాయి. రూ.3 వేల పెట్టుబడి నిధి చాలామంది డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమకాలేదు.మరో పక్క 2015-16లో జమకావాల్సిన రెండో విడత రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల పెట్టుబడి నిధి ఇంకా విడుదల చేయలేదు. హుద్‌హుద్ బాధిత రైతుల్లో చాలా మందికి ఇంకా పరిహారం జమకాని పరిస్థితి నెలకొంది. ఇంకా జిల్లా, క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలతో పాటు ప్రతీ పథకం లోనూ జన్మభూమి కమిటీల పెత్తనం..  వసూళ్ల దందా, ఎన్నికల హామీల అమలులో సర్కార్ వైఫల్యాలపై జన్మభూమి సభలను వేదికగా చేసుకుని యుద్ధభేరి మోగించేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సన్నద్ధమవుతుండడం అధికారులకు
 చమటలు పట్టిస్తోంది.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు