‘ఫుల్లు’గా స్టాక్

21 May, 2014 00:58 IST|Sakshi
‘ఫుల్లు’గా స్టాక్
  •       మద్యం నిల్వపై వ్యాపారుల దృష్టి
  •      రాష్ట్ర విభజన నేపథ్యంలో 24 నుంచి డిపోలు మూత
  •      డిపోల వద్ద బారులు తీరిన వ్యాపారులు
  •      రూ. 2 కోట్లు నుంచి రూ. 6 కోట్లకు పెరిగిన అమ్మకాలు
  •      జూన్ నెలాఖరు వరకు సరిపోయే స్టాక్ కొనుగోలు
  •  మద్యం కోసం డిపోల వద్ద వ్యాపారులు క్యూ కడుతున్నారు. ఉన్నదంతా ఊడ్చి మరీ సరకు కొంటున్నారు. జూన్ నెలాఖరు వరకు సరిపోయే విధంగా స్టాక్ చేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎక్సయిజ్ డ్యూటీ లెక్కలు తేల్చేందుకు ఈ నెల 24 నుంచి మద్యం డిపోలకు తాళాలు పడతాయన్న సమాచారంతో వీరంతా అప్రమత్తమయ్యారు. భారీగా మద్యం నిల్వ చేస్తున్నారు.
     
    విశాఖపట్నం, న్యూస్‌లైన్: మద్యం డిపోలకు తాళం వేయనున్నారన్న సమాచారంతో మద్యం వ్యాపారులు సరకు నిల్వలపై దృష్టి సారించారు. మద్యం స్టాక్‌ను పదింతలు పెంచుకునేందుకు తాపత్రయపడుతున్నారు. భారీగా సరకు నిల్వ చేసేందుకు అవసరమైన మొత్తాన్ని సమీకరించి మద్యం ఫుల్‌గా దిగుమతి చేసుకుంటున్నారు.

    సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలు దుకాణాల్లో నో స్టాక్ బోర్డు పెట్టిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు జిల్లాలోని మద్యం లెసైన్సుదారులు ఉన్నదంతా ఊడ్చి మరీ సరకు కొంటున్నారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచీ లిక్కర్ వ్యాపారులు మద్యం డిపోల ముందు క్యూ కట్టారు. మంగళవారం ఒక్కరోజే ఆదాయం రెట్టింపు అయినట్టు లెక్కలు స్పష్టంగా కనిపించాయి.
     
    విశాఖ జిల్లాలో 300కు పైగా మద్యం దుకాణాలున్నాయి. మరో 100కు పైగా బార్లున్నాయి. వీటన్నింటికీ కావలసిన సరకు రెండు డిపోల నుంచి నిత్యం సరఫరా అవుతోంది. పెద్దగా సరకు అక్కర్లేని రోజుల్లో కూడా రోజుకి రూ. 2 కోట్లు స్టాక్‌ను మద్యం దుకాణాలకు సరఫరా చేసేవారు. ఎన్నికల సమయంలో రూ. 3 కోట్లు నుంచి 3.50 కోట్ల స్టాక్‌ను రోజూ వ్యాపారులు కొనేవారు.

    రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎక్సయిజ్ డ్యూటీ లెక్కలు తేల్చేందుకు ఈ నెల 24 నుంచి మద్యం డి పోలకు తాళం వేస్తున్నారన్న సమాచారం తెలియడంతో బుధవారం మధ్యాహ్నం నుంచి వ్యాపారులు ఎగబడ్డారు. వంద మందికి పైగా వ్యాపారులు క్యూ కట్టి రూ. 6 కోట్లకు పైగా చలానాలు చెల్లించి మద్యం స్టాక్‌ను విడి పించినట్టు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది.

    గురువారం నుంచి రోజుకు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్లుకు పైగా స్టాక్ విడిపించుకునేందుకు మద్యం దుకాణాదారులు ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో నగరంలో వచ్చే నెల మొదటి వారం వరకూ పార్టీలు ఎక్కువగా జరుగుతాయని ఎక్సయిజ్ శాఖ అంచనా వేస్తోంది. మంత్రి పదవులు ఆశించేవారు జిల్లాలో ఎక్కువగా ఉండడంతో పాటు పర్యాటకులు కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశాలుండడంతో వచ్చే నెల రోజులకు మద్యం నిల్వలు భారీగా ఉంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    నగర పరిధిలో బార్లు, స్టార్ హోటళ్లు ఎక్కువగా ఉండడంతో స్టాక్‌ను పెద్ద ఎత్తున తరలించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 6వ తేదీ వరకూ స్టాక్ ఇచ్చేది లేదంటూ అబ్కారీ శాఖ చెబుతుండంతో జూన్ నెలాఖరు వరకూ సరిపోయే స్టాక్ కొని నిల్వ చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
     

మరిన్ని వార్తలు