ఇక పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌

28 Nov, 2019 07:24 IST|Sakshi

అర్హతల సడలింపుతో మరెంతోమందికి అవకాశం

ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ.. ఆ పైస్థాయి విద్యార్థులకూ  ఆర్థిక సాయం

కేబినెట్‌ ఆమోదంతో అమల్లోకి..

నాన్నకు మించి.. విద్యా వ్యవస్థకు వైఎస్‌ జగన్‌ కొత్త వెలుగు

సాక్షి, విశాఖపట్నం, మహారాణిపేట: ఐదేళ్ల పాటు ఆకాశంలో మబ్బులు చూపించి.. అభివృద్ధి సాధించామంటూ చెప్పుకున్న గొప్పలు ఆరు నెలల కాలంలోనే దూది పింజల్లా తేలిపోతున్నాయి. విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసి యువత భవిష్యత్తుని అగమ్యగోచరంగా మార్చేసిన పాలకుల విధానాలకు స్వస్తి చెబుతూ ప్రతి ఒక్క పేద, మధ్య తరగతి విద్యార్థి ఉన్నత చదువులు చదివేలా చేయూతనందించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి ప్రభుత్వం విలువైన పథకాల్ని అమలు చేసేందుకు సన్నద్ధమైంది. ప్రభుత్వమంటే సమాజాన్ని అభివృద్ధి చేసే నిర్ణయాలు తీసుకునేలా పనిచెయ్యాలంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోసారి నిరూపించింది. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ పథకాలతో జిల్లాలోని వేలాది మంది విద్యార్థులు నాణ్యమైన విద్యా ఫలాలు అందుకోనున్నారు.

100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌... 
వృత్తి విద్యసహా ఉన్నత విద్యాకోర్సులు అభ్యసించే విద్యార్థుల ఫీజులను పూర్తిస్థాయిలో 100 శాతం రీయింబర్స్‌మెంట్‌ చేయాలని ఆదేశాలు జారీచేశారు. సంబంధిత ఫైల్‌పై ముఖ్యమంత్రి జగన్‌ సంతకం చేసిన నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ ఈ ఏడాది జూలై 23న ఉత్తర్వులు జారీ చేసింది. 2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్‌ సహా వివిధ వృత్తి విద్యాకోర్సుల ఫీజులపై జీవో 38 విడుదల చేసింది. ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఫార్మాడీ, ఫార్మాడీ(పీబీ), బీఆర్క్, బీ.ఫార్మా, ఎం.ఫార్మా, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు 2018–19 విద్యాసంవత్సరానికి అమలు చేసిన ఫీజులే 2019–20 విద్యా సంవత్సరానికి కూడా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

రాజన్న ప్రసరించిన విద్యావెలుగులు...
పేద విద్యార్థులందరికీ ఉన్నత విద్యా ఫలాలు అందించాలన్న లక్ష్యంతో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే.. ఉచిత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఏ తల్లిదండ్రులు కూడా పేదరికం వల్ల తన బిడ్డని ఉన్నత చదువులు చదివించలేకపోయామన్న నిరుత్సాహపడకూడదన్న లక్ష్యంతో రాజన్న ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2004లో ఈ పథకం ప్రారంభమైంది. పథకం ప్రారంభం కాకముందు ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం, కొంత వరకు మాత్రమే ఫీజుల చెల్లించేది. మహానేత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు, బీసీలు, ఈబీసీలకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలుతో.. ఇంటర్‌తోనే విద్యకు ఫుల్‌స్టాప్‌ పెట్టే పరిస్థితి నుంచి పేద, మధ్యతరగతి విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎమ్మెస్సీ వంటి ఉన్నత చదువుల వైపు అడుగులు వేశారు.


    

ఐదేళ్లు... రూ.100 కోట్ల బకాయిలు...
మహానేత వైఎస్సార్‌ మరణించిన తర్వాత... గడిచిన ఐదేళ్లుగా రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం అటకెక్కించింది. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఐదేళ్ల కాలంలో విశాఖపట్నం జిల్లాలోనే రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు అక్షరాలా రూ.100 కోట్లకు చేరాయని ప్రైవేటు విద్యాసంస్థల సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. విశాఖ శివారు ప్రాంతంలో 20కిపైగా ఇంజినీరింగ్‌ కాలేజీలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వర్తిస్తుంది. దీనికి సంబంధించి విద్యార్థి కళాశాలలో జాయిన్‌ అయినప్పుడు ప్రభుత్వం కళాశాల యాజమాన్యానికి ఉత్తర్వులు అందిస్తుంది. అందులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన ఫీజును ఇస్తామని పేర్కొంటారు. విద్యార్థికి కళాశాలలో అడ్మిషన్‌ ఇచ్చేలా చేస్తారు. గడచిన ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఏనాడు పట్టించుకోలేదు. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు కళాశాలల యాజమాన్యాలు ఏడాదికి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. కానీ టీడీపీ హయాంలో రూ.35 వేలకు మించి ఇవ్వకపోవడంతో.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉంటుందన్న ఆశతో ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థులు ఇక్కట్లు పడ్డారు. మిగిలిన ఫీజు మొత్తాన్ని చెల్లించేందుకు చాలా కుటుంబాలు అప్పులపాలైన ఘటనలూ లేకపోలేదు. 

ఫీజులు పెంచేసిన టీడీపీ...
టీడీపీ అధికారంలో ఉండగా కాలేజీల యాజమాన్యాలకు మేలు కలిగేలా ఫీజులను 30 శాతం మేర పెంచింది. అదే సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను మాత్రం పెంచకపోవడం గమనార్హం. రూ.35వేలు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేసింది. అదిపోగా మిగతా భారం మొత్తం విద్యార్థి భరించాల్సి వచ్చేది. ఫలితంగా ఒక్కో విద్యార్థి కుటుంబం కోర్సు పూర్తయ్యే సరికి రూ. 3 లక్షల నుంచి రూ.4 లక్షలకు వరకు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇక ఎన్నికలకు ముందు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రూ.45 వేలకు పెంచుతామంటూ ఒక జీవోను విడుదల చేసి విద్యార్థులను మభ్య పెట్టేందుకు ప్రయత్నించారు. వాస్తవానికి గత ప్రభుత్వం రూ.35వేల ఫీజు రీయింబర్స్‌మెంటును కూడా కాలేజీలకు చెల్లించకపోవడంతో కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. 

మళ్లీ విద్యా సుగంధాలు...
‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ.. ప్రతిపక్షనేతగా సుదీర్ఘ పాదయాత్ర చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. పేద, మధ్య తరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు పంచే అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి హామీలన్నింటినీ అమలు చేస్తున్నారు. తాజాగా బుధవారం అమరావతిలో నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజన్న మరణంతో అస్తవ్యస్తంగా మారిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి ఊపిరిపోయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు విద్యావరాలు అందించేలా పథకాలు అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

సడలించిన నిబంధనలు...
►జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అర్హులందరికీ అందేలా ప్రభుత్వం నిబంధనల్లో అనేక మార్పులు తీసుకురావాలని కేబినెట్‌ నిర్ణయించింది.

►ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు సంవత్సరానికి ఆదాయ పరిమితి రూ.2 లక్షలు, మిగిలిన వాళ్లకు రూ.లక్షలోపు ఆదాయం ఉంటేనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుందన్న నిబంధనని ముఖ్యమంత్రి వైఎస్‌  జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సడలించింది. వార్షికాదాయం రూ.2.50 లక్షలు లోపు ఉన్న అందరికీ జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు వర్తిస్తాయి.

►10 ఎకరాల లోపు మాగాణి లేదా, 25 ఎకరాల్లోపు మెట్టభూమి ఉన్నవారికి లేదా, రెండూ కలిపి 25 ఎకరాల్లోపు ఉన్న వారూ ఈ పథకానికి అర్హులు.

►ఆదాయంతో సంబంధం లేకుండా పారిశుద్ధ్య కార్మిక ఉద్యోగులున్న కుటుంబాల్లోని వారికీ ఈ పథకం వర్తిస్తుంది.

►కారు మినహా ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్‌ ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ పథకానికి అర్హులే.

►ఆదాయపు పన్ను చెల్లించేవారు ఈ రెండు పథకాలకు అనర్హులు.

►పట్టణాల్లో 1500 చ.గజాలు ఆస్తి ఉన్న వారికీ వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

►పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ, ఆపై కోర్సుల్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, అనుబంధ, విశ్వవిద్యాలయాలు, బోర్డుల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

తల్లిదండ్రుల హర్షం...
పేదవిద్యార్థుల చదువులకు అండగా ఉండేందుకు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలుతో పాటు విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో విద్యార్థులు తల్లిదండ్రుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ చదువుల కోసం అప్పుల ఊబిలో కూరుకుపోయే దుస్థితి తల్లిదండ్రులకు తప్పుతుందని విద్యార్థులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఫీజులెలా చెల్లించాలని ఆందోళన చెందకుండా చదువులపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించేందుకు ప్రభుత్వ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొంటున్నారు. మరోపక్క ఫీజులతో పాటు విద్యార్థుల వసతి, భోజనాల కోసం ఏటా రూ.10 నుంచి రూ.20 వేల వరకూ చెల్లించేందుకూ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుండడంతో విద్యార్థుల చదువులపైనే దృష్టి సారించగలమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా