ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

4 Apr, 2014 02:54 IST|Sakshi

విజయవాడ క్రైం, న్యూస్‌లైన్ : నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలీసు శాఖ సిద్ధమైంది. తొలి విడత ఈ నెల 6న విజయవాడ రూరల్ మండలం, ఇబ్రహీంపట్నం, కంకిపాడు, పెనమలూరు, తోట్లవల్లూరు మండలాల్లోని 149 ఎంపీటీసీ, ఐదు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.ఇందుకోసం 161 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయగా వాటిలో 67 సమస్యాత్మక, 84 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ జరిగే మండలాల్లో సెక్షన్ 144 విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
 
1,100మందితో బందోబస్తు
తొలి విడత ఎన్నికలకు ఇద్దరు డీసీపీలు, ఇద్దరు అదనపు డీసీపీలు, ఎనిమిది మంది డీఎస్పీలు/ఏసీపీలు, 30 మంది ఇన్‌స్పెక్టర్లు, 79 మంది ఎస్‌ఐలు, 61 మంది ఏఎస్‌ఐ/హెడ్‌కానిస్టేబుళ్లు, 608 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 265మంది హోంగార్డులు, సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్‌కు చెందిన సాయుధ బలగాల సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటారు. ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకొని గస్తీ కోసం 42 మొబైల్ పార్టీలు, 8 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 15 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలను కేటాయించారు. ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్‌ఎస్‌టీ(స్టాటిక్ సర్వలెన్స్), ఎంసీసీ(మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్) టీములను ఏర్పాటు చేశారు.
 
2,167 మందిపై బైండోవర్ కేసులు
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న 2,167మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. 276 లెసైన్స్‌డు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ప్రవర్తనావళి ఉల్లంఘన కింద 66 కేసులు, మద్యం విక్రయూలకు సంబంధించి 85 కేసులు నమోదు చేశారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఇతర సామగ్రి పంపిణీ కట్టడి చేసేం దుకు కమిషనరేట్ పరిధిలో 8 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. తగిన లెక్కలు చూపని రూ.1.37 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు