తొలి విడత సమరానికి పటిష్ట బందోబస్తు

5 Apr, 2014 01:36 IST|Sakshi
తొలి విడత సమరానికి పటిష్ట బందోబస్తు

విజయనగరం లీగల్, న్యూస్‌లైన్ : జిల్లాలో తొలి విడతగా పార్వతీపురం రెవెన్యూ డివిజన్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్‌పీ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఎన్నికల విధులకు సంబంధించి ఎన్నికల సిబ్బందితో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల సమరంలో ఆదివారం జరగనున్న తొలి విడత ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పలు సూచనలు చేశారు. పోలింగ్ రోజున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేసి ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా పోలింగ్ జరిగేందుకు కృషి చేయూలన్నారు. తొలి విడతగా పార్వతీపురం రెవెన్యూ డివిజన్‌లో ఆదివారం 230 ఎంపీటీసీలకు, 15 జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

108 రూట్ మొబైల్‌లు, 20 స్ట్రైకింగ్ ఫోర్సులు, 15 స్పెషల్ స్ట్రైకింగ్ పారుుంట్‌ల బందోబస్తుతో అదనపు పోలీసు బలగాలు కలిపి సుమారు మూడు వేల మంది విధుల్లో పాల్గొననున్నట్టు చెప్పారు. ఇప్పటికే చెక్‌పోస్టులు, వాహనాల తనిఖీల ద్వారా అక్రమ మద్యం, నగదు రవాణాను అడ్డుకోగలిగామన్నారు.

జిల్లాలో ఇప్పటి వరకు కోటీ 51 లక్షల 56 వేల 390 రూపాయల నగదు, 4088 మద్యం బాటిళ్లను, వాటిని తరలించే ఎనిమిది వాహానాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 478 లెసైన్స్‌డ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని, 13,245 మందిపై ముందస్తు చర్యగా బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు. ఓటర్లు కింది నిబంధనలు పాటించాలని సూచించారు.
 
ఓటు హక్కు కలిగిన ప్రతీ ఒక్కరి వద్ద తగిన గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఎలాంటి వివాదాలకు పాల్పడినా చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవు.

సమస్యాత్మక, అతి సమస్యాత్మక, ముఖ్యమై న పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ విధానం ద్వారా ఓటింగ్ సరళిని చిత్రీకరిస్తాం. ఓటర్లు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే పుటేజీ ద్వారా గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.

అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక వీడియో కెమెరాల ద్వారా పోలింగ్ తీరును చిత్రీకరించటం  జరుగుతుంది.

ఓటర్లు ఓటుహక్కును వినియోగించే సమయంలో  క్యూలైన్ పాటించాలి.  

ఓటింగ్ జరిగే ప్రదేశాల్లో గుంపులు  గుంపులుగా ఉండరాదు.

ఓటింగ్ జరిగే ప్రాంతాల్లో మఫ్టీలో పోలీసు లు గస్తీ  నిర్వహిస్తారని, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచటం జరుగుతుంది.

నగదు, మద్యం  వంటివి పంపిణీ చేస్తూ పట్టుబడితే, అటువంటి వారిపై నాన్‌బెయిల్‌తో పాటు కేసులు నమోదు చేయటం జరుగుతుం ది.

ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఏదైనా సమాచారం అందించాలంటే 9440904730 సెల్ నంబరుకుగానీ 08922-226927 ఫోన్ నంబరుకు గాని తెలియజేయాల న్నారు. ప్రజలు పై విషయాలను గమనించి పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్‌పీ కోరారు

మరిన్ని వార్తలు