ట్రాఫిక్‌ చక్రబంధం

21 Apr, 2019 13:30 IST|Sakshi

ఒంగోలు నగరం రోజురోజుకూ ట్రాఫిక్‌ చక్రబంధంలో చిక్కుకుపోతోంది. గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా.. నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా..  మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా.. ఇలా ఒంగోలు నగరం విస్తరిస్తూ పోతోంది. కానీ ఇప్పటికీ అవే రోడ్లు... అదే ఇరుకు సందులు... సాంకేతిక పరిజ్ఞానంతోపాటే అంతేవేగంగా మోటారు వాహనాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. కానీ, దీనికి తగ్గట్టు నగరంలో ప్రధాన రహదారుల విస్తరణ మాత్రం జరగటం లేదు. రోడ్లు విస్తరణ చేస్తామంటూ రాజకీయ నాయకులు, అధికారులు చేసిన ప్రకటనలు నీటిమీద రాతలుగానే మిగిలి పోయాయి. దీంతో నగరంలో ట్రాఫిక్‌ సమస్య జటిలమవుతోంది. అటు పాదచారులు, ఇటు వాహనదారులు సతమతమవుతున్నారు. ప్రజలు రోడ్లపైకి రావటానికి జంకుతున్నారు. రోడ్డు దాటాలంటే పెద్ద సాహసమే అవుతోంది.

ఒంగోలు వన్‌టౌన్‌: ఒంగోలు నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. గ్రామల్లో నివశించే ప్రజల్లో అనేక అవాసరాల రీత్యా నగరంలోకి వలసలు వచ్చి ఆవాసాలు ఏర్పాటు చేసుకొని స్థిరపడిపోతున్నారు. ఇప్పటికే నగర శివారు ప్రాంతాలు విస్తరిస్తున్నాయి. మరోపక్క కార్పొరేట్‌ సంస్థలు ఒంగోలు నగరంలో  తమ కార్యకలాపాలను విస్తరించుకుంటూ ఇప్పటికే అనేక సంస్థలు వెలిశాయి. ఒంగోలు నగర జనాభా మాత్రం 2011 జానాభా లెక్కల ప్రకారం 2.53 లక్షలు. ప్రస్తుతం ఆ సంఖ్య 3 లక్షల వరకూ ఉంటుందని అంచనా. ఇప్పటికి నగరంలో సుమారు 60 వేలకు పైగా గృహాలు 400 వరకు అపార్టుమెంట్‌లు వెలిశాయి. నిత్యం నగరంలో లక్షకు పైగా వాహనాలు çరోడ్ల మీద పరుగులు తీస్తున్నాయి. 8 వేలకు పైగా ఆటోలు,  200కు పైగా స్కూల్‌ బస్సులు 50 వేలకు పైగా ద్విచక్ర వాహనాలు, వేల సంఖ్యల్లో అనేక ట్రాన్స్‌పోర్టు వాహనాలు నగరంలో నిత్యం తిరుగుతున్నాయి. నగరం ఎటు చూసినా 3 లేక 4 కిలో మీటర్లు పెరిగిపోయింది. గమ్య స్థానానికి చేరాలంటే గంటల వ్యవధి పడుతోంది.

కార్ల జోరు..
నగరవాసులు సైకిల్‌ నుంచి మోటారు సైకిల్, మోటారు సైకిల్‌ నుంచి కారు... ఇలా ప్రతి మనిషి వేగాన్ని పెంచుకొని అభివృద్ధి వైపు దూసుకుపోతున్నాడు. నేడు ద్విచక్రవాహనం లేని ఇల్లు లేదంటే అతి శయోక్తి కాదు. ఒక్కో ఇంట్లో రెండు, మూడు ద్విచక్ర వాహనాలు కూడా ఉన్నాయి. ఇక కార్ల సంఖ్యా తక్కువేమీ కాదు. వీటికి తోడుగా ఆటోల జోరు అంతా ఇంతా కాదు. నగరవాసులతోపాటు, ఇక జిల్లా నలుమూలల నుంచి ఒంగోలు నగరానికి వచ్చే వారి సంఖ్య తక్కువేమీ కాదు. ప్రతి రోజూ వేల సంఖ్యలో నగరానికి వస్తుంటారు. ప్రభుత్వ కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చేవారు.. ఒంగోలులోని కాలేజీల్లో చదువుకునే వారి కోసం వచ్చే తల్లిదండ్రులు ఇలా ఎందరో..!

ఇరుకు రోడ్లు....
జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలోని ప్రధాన వ్యాపార కూడలి ట్రంకు రోడ్డు, గాంధీ రోడ్డు. ఈ రెండు రోడ్లలో మనుషులు నడవటానికే ఖాళీ ఉండదు. ఇక వాహనాలు వేసుకొని వస్తే షాపింగ్‌ చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళాలంటే గంటల కొద్దీ సమయం పడుతుందని ప్రజలు వాపోతున్నారు. గాంధీ రోడ్డు, పత్తి వారి వీధి, పప్పు బజారు, తూర్పు బజారు, పశ్చిమ బజారు, బండ్లమిట్ట, మిరియాలపాలెం సెంటర్, కోర్టు సెంటర్, లాయర్‌పేట సాయిబాబా గుడి, అంజయ్య రోడ్డు, మంగుమూరు రోడ్డు, కర్నూలు రోడ్డు నెల్లూరు బస్టాండ్‌ సెంటర్‌లు నిత్యం రద్దీగా ఉంటాయి. ఇదిలా ఉంటే పాత మార్కెట్‌ సెంటర్‌ నుంచి దర్గా సెంటర్‌ మొదలుకొని కొత్తపట్నం బస్టాండ్‌ సెంటర్‌ వరకు రోడ్దు వన్‌వే అయినా పెద్ద వాహనాలు ముందు పోతుంటే కనీసం ద్విచక్ర వాహనం కూడా దానిని దాటుకొని పోవాలంటే సాధ్యం అయ్యే పరిస్థితి లేదు.
 
పార్కింగ్‌ సమస్య...
పెరుగుతున్న వాహనాలతో పార్కింగ్‌ వాహనదారులకు పెద్ద సమస్యగా మారింది. ఏది కొనుగోలు చేయాలన్నా వాహనాలను ఎక్కడ పార్కింగ్‌ చేయాలో అర్ధంకాక వాహనదారులు సతమతమవుతున్నారు. అధికారికంగా ఎక్కడా పార్కింగ్‌ ప్రదేశాలు లేవు. దీంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు ట్రాఫిక్‌ పోలీసుల వేధింపులు అంతా ఇంతా కాదు. రోడ్దు మీద పార్కింగ్‌ చేసిన వాహనాలను ట్రాఫిక్‌ పోలీసులు హైడ్రాలిక్‌ ద్వారా లారీలో ఎక్కించుకొని తీసుకుపోతున్నారు.

షాపింగ్‌ చేసుకొని వాహనం పెట్టిన చోటుకు వచ్చి చూస్తే అక్కడ వాహనం ఉండదు. తీరా అక్కడ షాపుల వాళ్ళను విచారిస్తే ట్రాఫిక్‌ పోలీసులు తీసుకుపోయారన్న సమాధానం వస్తుంది. దీంతో వెంట తీసుకొచ్చిన కుటుంబ సభ్యులను వదిలేసి ట్రాఫిక్‌ పోలీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. వందల మంది ప్రజలు ఇప్పటి వరకు పడిన, పడుతున్న ట్రాఫిక్‌ అవస్థలు ఇంతా ఇంతా కాదు. ట్రాఫిక్‌ పోలీసులు మాత్రం పార్కింగ్‌కు స్థలాలను చూపించకపోగా అడ్డాదిడ్డంగా చాలనాలు రాస్తూ వాహనదారులను దోచుకుంటున్నారు. వాహనదారులకు చలానాలు అదనపు భారంగా మారుతున్నాయి.

మరిన్ని వార్తలు