మహానందిలో అపశ్రుతి

27 Apr, 2018 12:06 IST|Sakshi

కామేశ్వరీదేవి అమ్మవారి ఆలయ హుండీలో పొగలు

మహానంది: మహానంది క్షేత్రంలోని కామేశ్వరీదేవి సన్నిధిలో గురువారం అపశ్రుతి చోటు చేసుకుంది. హారతిపళ్లెంలోని దీపానికి సంబంధించి నిప్పు రవ్వలు ఎగిసి హుండీలో పడడంతో పొగలు వచ్చాయి. భక్తులకు హారతి ఇస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు వెంటనే ఆలయానికి చేరుకొని ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుండీలో ఇసుక పోశారు.  హుండీలోని కానుకలు కొంత మేరకు కాలిపోయి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.

ఇక ముందైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. ఈ విషయంపై ఆలయ సూపరింటెండెంట్‌ ఓ.వెంకటేశ్వరుడు మాట్లాడుతూ దీపం హుండీలో పడలేదని, హారతి పళ్లెంలో ఉన్న చిల్లరను అర్చకుడు హుండీలో వేస్తుండగా దీపానికి ఉన్న వత్తి కాయిన్లకు అతుక్కుని పొగవచ్చి ఉండవచ్చన్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ పెద్దయ్యనాయుడు ఆలయానికి చేరుకుని హుండీలను పరిశీలించడంతోపాటు సీసీ పుటేజీ దృశ్యాలు చూసి వివరాలు తెలుసుకున్నారు. 

మరిన్ని వార్తలు