రీషెడ్యూలుపై ఆర్‌బీఐ సందేహాలు

27 Jul, 2014 02:52 IST|Sakshi
రీషెడ్యూలుపై ఆర్‌బీఐ సందేహాలు

రుణాలు మాఫీ చేయకుండా రీ షెడ్యూల్
కోరుతోందని సర్కారుపై అనుమానం
రీషెడ్యూల్‌కు నిబంధనలు అనుమతించవంటూ
తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ
పంట దిగుబడి 50 శాతానికి తగ్గితేనే
రీషెడ్యూలుకు నిబంధనలు అనుమతిస్తాయని వెల్లడి

 
ముంబై: గత ఖరీఫ్‌లో తుపాను, కరువు ప్రభావిత మండలాల్లోని రైతుల పంట రుణాలను రీషెడ్యూల్ చేయడంపై రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) అనేక ధర్మసందేహాలు వ్యక్తంచేసింది. ఆర్‌బీఐ నిబంధనల మేరకు రుణాలను రీషెడ్యూల్ చేయడానికి వీలైన పరిస్థితులే రాష్ట్రంలో లేవని పేర్కొంది. రీషెడ్యూల్ చేయాలని కోరినప్పుడు తాము అడిగిన వివరాలను ఎందుకు ఇవ్వడంలేదని రాష్ట్ర ప్రభుత్వానికి పరోక్షంగా చురక అంటించింది. రుణ మాఫీ ముసుగులో రైతుల రుణాలను రీషెడ్యూలు చేయించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న అనుమానాన్ని ఆర్‌బీఐ వ్యక్తం చేసింది. అత్యంత విశ్వసనీయవర్గాల కథనం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ చేయకుండా గత ఖరీఫ్‌లో రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయించడం ద్వారా కొంత ఉపశమనం పొందాలని చూస్తోందని ఆర్‌బీఐ అధికారులు సందేహం వ్యక్తంచేస్తున్నారు. పంట దిగుబడి, మండలాలవారీగా ఖాతాదారుల వివరాలు ఇవ్వాలని కోరినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.

ఈ నేపథ్యంలోనే రుణాలను రీషెడ్యూల్  చేయాలంటే ఆర్‌బీఐకి కొన్ని పరిమితులున్నాయని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సుదీర్ఘమైన లేఖ రాసింది. రీషెడ్యూల్ చేయడంలో ఆర్‌బీఐ ముందున్న నిబంధనలు, పరిమితుల గురించి వివరించింది. ఈ లేఖలో కోరిన సమాచారం ప్రభుత్వం నుంచి అందలేదు. దీంతో హైదరాబాద్‌లోని ప్రాంతీయ ఆర్‌బీఐ శాఖ, రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అర్థ గణాంక శాఖ నుంచి ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయం స్వయంగా సమగ్రమైన సమాచారాన్ని సేకరించింది. తుపాను, కరువు ప్రభావిత జిల్లాల్లో గత ఖరీఫ్‌లో పంటల దిగుబడి వివరాలను తెప్పించుకుంది. ఆ సమాచారం ఆధారంగా రుణాలను రీషెడ్యూల్ చేయడానికి నిబంధనలు అంగీకరిస్తాయా లేదా అన్న అంశంపై అధికారులు అధ్యయనం చేశారు. రుణాల రీషెడ్యూల్‌కు ఆర్‌బీఐ నిబంధనలు అనుమతించవన్న నిర్ధారణకు వచ్చారు. దీంతో రీ షెడ్యూల్‌పై ఆర్‌బీఐ పలు సందేహాలను వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం మరో లేఖ రాసింది. నిబంధనల మేరకు గత ఖరీఫ్‌లో పంట రుణాల రీ షెడ్యూల్‌కు అర్హత లేదంటూ ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డాక్టర్ దీపాలీ పంత్ జోషి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన ఆ లేఖలో పేర్కొన్నారు.

కరువు, ప్రకృతి వైపరీత్యాలతో పంట దిగుబడి 50 శాతానికన్నా తక్కువగా ఉంటేనే  రుణాల రీ షెడ్యూల్‌కు అర్హత ఉంటుందని తెలిపారు. అయితే గత ఖరీఫ్‌లో కరువు, తుఫాను ప్రభావిత జిల్లాల్లో పంటల దిగుబడి బాగుందని వెల్లడైనట్టు తెలిపారు. 2013 ఖరీఫ్‌లో పంటల దిగుబడి వివరాలను ఏపీ అర్థగణాంక శాఖ నుంచి సేకరించినట్టు తెలిపారు. 2013 ఖరీఫ్‌లో దిగుబడిని అంతకు ముందు నాలుగేళ్ల సరాసరితో పోల్చి చూస్తే సాధారణ దిగుబడికన్నా తక్కువగా ఏమీ లేదని చెప్పారు. ఆయూ కాలాల్లో పంటల గణాంకాలను అందులో వివరించారు. రాష్ట్రంలోని ప్రధాన బ్యాంకుల నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు సేకరించిన సమాచారం మేరకు కిసాన్ క్రెడిట్ కార్డుల రెన్యువల్స్ కూడా గత సంవత్సరం తరహాలోనే ఉన్నాయని ఆ లేఖలో వెల్లడించారు. రుణాలు మాఫీ చేస్తారన్న ఉద్దేశంతో ఈ ఏడాది ఏప్రిల్ తరువాత కిసాన్ క్రెడిట్ కార్డుల రెన్యువల్స్‌లో కొంత తగ్గుదల ఉందని తెలిపారు. అయినప్పటికీ గ్రామీణ, సెమీ పట్టణ బ్యాంకు బ్రాంచిల్లో సేవింగ్స్‌అకౌంట్లలో నిల్వలు పెరిగాయని వివరించారు. దీన్నిబట్టి చూస్తే రైతులు రుణ మాఫీ అవుతుందనే విశ్వాసంతో రుణాలు తీర్చడానికి బదులు సేవింగ్స్ ఖాతాల్లో డిపాజిట్ చేశారన్న అనుమానాలను వ్యక్తంచేశారు. రుణాలు చెల్లించకపోవడానికి రైతులు ఆపదలో ఉండటం కారణం కాదని, ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీయే కారణమని పేర్కొన్నారు. ఆ సేవింగ్స్ ఖాతాల నుంచి రైతులు ఈ ఖరీఫ్‌లో వ్యవసాయం కోసం నిధులను డ్రా చేయడంతో జూన్ నుంచి వాటిలో నిల్వలు తగ్గుతున్నాయని కూడా ఆ లేఖలో స్పష్టంగా వివరించారు. ఈ నేపథ్యంలో రైతులు ఆపదలో ఉన్నారనే అభిప్రాయానికి రాలేమని పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో రీ షెడ్యూల్ చేసిన రుణాలను ఏ విధంగా తీరుస్తారో పక్కా ప్రణాళికతో పాటు వనరుల సమీకరణెలా చేస్తారో తెలపాలని కోరామని కూ డా లేఖలో గుర్తు చేశారు. ఆ వివరాలను పంపిస్తే తప్ప ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని ఏపీ ప్రభుత్వానికి స్పష్టంచేశారు.ఏపీ అర్థ గణాంక శాఖ సమాచారం మేరకు 2013 ఖరీఫ్‌లో పంటల దిగుబడిని గత నాలుగేళ్ల సగటు, గరిష్ట దిగుబడితో పోల్చుతూ ఆర్‌బీఐ లేఖలో పేర్కొన్న వివరాలు..
 
 
 
 

మరిన్ని వార్తలు