మింగుడు గుంతలు!

1 Jul, 2016 03:22 IST|Sakshi
మింగుడు గుంతలు!

 ఇంకుడుగుంత.. కొత్తూరు మండలం బలదలోని చీడిపురం కృష్ణారావు, రాణి దంపతుల కలల పంటను మింగేసింది. 20 నెలల ప్రాయంలోనే వారి బిడ్డ సాయి అందులో పడి ప్రాణాలు కోల్పోయాడు.
 
 బూర్జ మండలంలోని పి.ఎల్.దేవిపేట గ్రామంలో సీపేన లక్ష్మి అనే మహిళా రైతుకు చెందిన ఆవు గత ఏప్రిల్‌లో గుంతలో పడి మృతి చెందింది.

 
  బూర్జ మండలం నీలాదేవిపురంలో ఇంకుడుగుంత కోసం తవ్వి వదిలేసిన గొయ్యిలో నెల క్రితం కోడి లచ్చెమ్మ అనే వృద్ధురాలు పడిపోతే ఆమె కాలు విరిగిపోయింది. కొరగాం, నీలకంఠాపురం, జేవీ పురం గ్రామాల్లోనూ ఇలా తరహాలో ఇద్దరు వృద్ధులు, మరో ఇద్దరు పిల్లలు గాయపడ్డారు.
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. జిల్లాలో అనేక మందికి అసంపూర్తిగా నిలిచిపోయిన ఇంకుడుగుంతలు కష్టనష్టాలను తెచ్చిపెడుతున్నాయి. అడుగంటిపోతున్న భూగర్భజలాలను వృద్ధి చేయడం కోసం వీటి నిర్మాణాన్ని చేపట్టిన ప్రభుత్వం... తర్వాత బిల్లులు చెల్లించడంలో తాత్సారం చేయడంతో నోరుతెరచి ప్రమాదకరంగా మారాయి. జిల్లాలో నాలుగు లక్షల ఇంకుడుగుంతల నిర్మాణం లక్ష్యం కాగా 2.75 లక్షల గొయ్యిలను తవ్వించారు. కొన్నిచోట్ల అధికార పార్టీ నాయకులు రికార్డు కోసం ఇంటింటికీ ఇంకుడుగుంత పేరుతో అవసరం ఉన్నా లేకపోయినా తవ్వించేశారు.
 
   జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు ఇస్తుండటంతో కూలి డబ్బుల కోసం కూడా ఇంటికో గొయ్యి తవ్వేయమని ప్రోత్సహించారు. అయితే కేవలం జాబ్‌కార్డులు ఉన్నవారికే డబ్బులు ఇచ్చి, మిగతా వారికి నిలిపేయడంతో ఇంకుడుగుంతల నిర్మాణం చాలాచోట్ల పూర్తికాలేదు. కొన్నిచోట్ల జూన్ నెలలో వర్షాల వల్ల నీరు నిండిపోయి ఉపాధి సిబ్బంది కొలతలు తీయకపోవడం, తర్వాత అయినా చొరవ తీసుకోకపోవడం వల్ల కూడా ఈ పరిస్థితి తలెత్తింది.
 
 అయితే జిల్లాలో చాలాచోట్ల గొయ్యికి రూ.1,700 చొప్పున మెటీరియల్ సరఫరా కాంట్రాక్టు తీసుకున్న అధికార పార్టీ నాయకులు... తర్వాత సరిగా సామగ్రి ఇవ్వకపోవడం వల్ల కూడా నిర్మాణాలు నిలిచిపోయాయి. ఇక ఇళ్ల వద్దనే కాదు ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లోనూ గొయ్యిలు తీయించారు. చాలాచోట్ల నిధులు రాకపోవడంతో నిర్మాణాలు పూర్తి చేయలేదు. పాఠశాలలు పునఃప్రారంభించే సమయానికీ అలాగే వదిలేశారు. ఇంతలో వర్షాలు మొదలయ్యాయి. ఇప్పుడు వర్షపు నీటితో నిండిపోయి ప్రమాదభరితంగా మారాయి.
 
 పూడ్చని గోతులివిగో...
 - నరసన్నపేట నియోజకవర్గంలో 25,969 ఇంకుడు గుంతలు తవ్వించారు. వాటిలో 10,866 మాత్రమే నిర్మాణం పూర్తి చేశారు. అవి ప్రమాదకరంగా ఉన్నాయి. పోతయ్యవలస, లింగాలపాడు, చల్లపేటల్లో పశువులు మృతి చెందాయి. నరసన్నపేట, జలుమూరు మండలాల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉన్నాయి.
 
 - పాతపట్నం నియోజకవర్గంలోని ఎల్‌ఎన్ పేట మండలంలో 4,312 తవ్వితే 3,128 మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. కొత్తూరు మండలంలో ఏడు వేల గోతులు తవ్వితే వాటిలో 1,476 నిర్మాణం పూర్తికాలేదు.
 
 - టెక్కలి మండలంలో 10 వేల గుంతలు లక్ష్యం కాగా కేవలం 6 వేలు మాత్రమే పూర్తయ్యాయి. వాటిలో  500 వరకు బిల్లుల చెల్లింపులు చేశారు. సంతబొమ్మాళి మండలంలో 1,900 లక్ష్యం కాగా కేవలం 200 పూర్తి చేసి బిల్లులు చెల్లించారు. కోటబొమ్మాళి మండలంలో 8 వేలు లక్ష్యం కాగా 5,600 పూర్తి చేసి 1,600 ఇంకుడు గుంతలకు బిల్లులు చెల్లించారు. నందిగాం మండలంలో 8 వేలు లక్ష్యం కాగా 6 వేలు మాత్రమే పూర్తి చేశారు. ఇంకా బిల్లుల చెల్లింపులు చేయలేదు.
 
 - ఆమదాలవలస రూరల్ మండలంలోని 28 పంచాయతీల్లో 30 వేల గుంతల లక్ష్యం పెట్టుకోగా 26 వేలు పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో 10 వేలు ఇంకుడుగుంతలకు కేవలం మస్టర్ బిల్లులు రూ.400 చొప్పన మంజూరు చేశారు.
 
 - ఇచ్ఛాపురం నియోజకరవర్గంలో సుమారు పది వేల వరకు ఇంకుడు గుంతలు తవ్వారు. కొద్దిరోజుల క్రితం వర్షపునీరుతో నిండిపోయి కొలతలు తీయడానికి వీలుగాకపోవడం, నిర్మాణ సామగ్రి అందుబాటులో లేకపోవటం తదితర కారణాలతో సగానికి సగం పూడ్చలేదు. ఇచ్చాపురం మండలంలో 2,300 గోతులు తీయగా, వాటిలో 1,895 మాత్రమే నిర్మాణం పూర్తి చేశారు.
 
 - రాజాం నగర పంచాయతీతో పాటు రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద గోతులు తవ్వించినా నిర్మాణం పూర్తి చేయకుండా చాలాచోట్ల వదిలేశారు. రేగిడి మండలంలోని గ్రామాల్లో 2,500 గోతులు తవ్వితే కేవలం 50 చోట్ల మాత్రమే నిర్మాణం పూర్తి చేశారు.  
 

మరిన్ని వార్తలు