సచివాలయాలకు సొంత గూడు 

8 Nov, 2019 11:45 IST|Sakshi

తొలి విడతలో 150 భవనాల నిర్మాణం 

రూ. 52.50కోట్ల ఉపాధి నిధుల వినియోగం 

పరిపాలన అనుమతులు మంజూరు చేసిన కలెక్టర్‌ 

త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం 

సాక్షి, చీపురుపల్లి: గ్రామస్వరాజ్య స్థాపనలో సచివాలయాలే కీలకం. ప్రజలకు చేరువగా పాలకులుండాలనీ... వారి సమస్యలు నేరుగా పరిష్కరించే ఓ చక్కని వేదిక కావాలనీ... అర్జీలు అందజేసేందుకు సుదూరంలో ఉన్న మండల కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తకూడదనీ... రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం. అందుకు అనుగుణంగా సచివాలయాలను రూపకల్పన చేశారు. అక్కడ అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలనీ... అందుకు అవసరమైన నిర్దిష్ట ప్రణాళికతో భవనం ఉండాలని యోచించారు. దశలవారీగా ప్రతి సచివాలయానికీ సొంత భవనం సమకూర్చేందుకు నిధులు విడుదల చేస్తున్నారు. తొలివిడతలో జిల్లాలో 150 భవనాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు లభిం చాయి.

గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం... అక్కడితో తమ పని అయిపోయింద ని ముఖ్యమంత్రి వదిలేయలేదు. వాటికి సొంత భవనాలు సమకూరిస్తేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకోసం కార్యాచరణ రూపొందించారు. జిల్లాలో తొలి విడతలో 150 గ్రామ సచివాలయాలకు సొంత భవనాల నిర్మాణానికి జాతీయ ఉపాధిహామీ పథకం నిధులు రూ.52.50 కోట్లు కేటాయించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. కొద్ది రోజుల్లో గ్రామ సచివాలయాలకు సొంత భవనాల నిర్మాణ పనులు ప్రారంభంకానున్నాయని అధికార వర్గాలు నుంచి తెలుస్తోంది.

సొంత భవనాలు మంజూరు... 
గ్రామ సచివాలయాల నిర్మాణానికి మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నుంచి ఒక్కో భవనానికి రూ.35 లక్షలు కేటాయిస్తూ మంజూరు ఉత్తర్వులు వచ్చాయి. దీని ప్రకారం చీపురుపల్లి మం డలంలో 12 గ్రామ సచివాలయ భవన నిర్మాణాలు జరగనున్నాయి. స్థల పరిశీలన చేసి, తుప్పలు తొలగించి మార్కింగ్‌ ఇచ్చి నాలుగైదు రోజుల్లో పనులు ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నాం. 
– డి.రమేష్‌, పంచాయతీరాజ్‌ జేఈ, చీపురుపల్లి   

ఒక్కో సచివాలయానికి రూ.35 లక్షలు
తొలి విడతలో భాగంగా జిల్లాలోని 150 గ్రామ సచివాలయాలకు సొంత భవనాలు నిర్మించేందుకు జిల్లా కలెక్టర్‌ పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని చీపురుపల్లి, గజపతినగరం, నెలిమర్ల, ఎస్‌.కోట నియోజకవర్గాల్లో వీటిని నిర్మించాలని యోచిస్తున్నారు. ఇందుకోసం ఒక్కో భవనానికి రూ.35 లక్షలు వెచ్చించనున్నారు. ఈ మేరకు ఉపాధిహామీ పథకం నిధులను మంజూరు చేశారు. పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులు రంగంలోకి దిగారు. భవనాలు మంజూరైన పంచాయతీల్లో స్థల పరిశీలన చేసి జంగిల్‌ క్లియరెన్స్‌ చేపట్టి, మార్కింగ్‌ పనులు పూర్తి చేసి త్వరలో పనులు ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. వారం రోజుల్లో శంకుస్థాపనకు సన్నాహాలు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు