సాయం చేయండి

25 Mar, 2020 13:37 IST|Sakshi
కలెక్టర్‌కు చెక్కును అందజేస్తున్న దృశ్యం

సామాజిక బాధ్యతతో విరాళాలు అందించాలి

కలెక్టర్‌ నివాస్‌  

శ్రీకాకుళం పాతబస్టాండ్‌ : కరోనా వ్యాప్తి నివారణకు సామాజిక బాధ్యతతో దాతలు విరాళాలు అందించాలని కలెక్టర్‌ జె.నివాస్‌ పిలుపునిచ్చారు. ఆర్ట్స్‌ స్వచ్ఛంద సంస్థ, పీవీ రామ్మోహన్‌ ఫౌండేషన్, డాక్టర్‌ దానేటి శ్రీధర్, లయన్స్‌ శ్రీకాకుళం సెంట్రల్‌ శాఖవారు మంగళవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో సామాజిక బాధ్యత కింద విరాళాలు అందజేశారు. జిల్లాలో స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నవారికి 14 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేసేందుకు, కరోనా బాధితులకు ఇతర సహాయ చర్యలు చేపట్టేందుకు ఈ నిధులను ఉపయోగిస్తారు. ఇందులో భాగంగా ఇప్పటికే స్పందన కేబుల్‌ విజన్, శివాని, వెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాలలు చెక్కులను అందజేయగా, మంగళవారం డాక్టర్‌ దానేటి శ్రీధర్‌ లక్ష రూపాయల నగదును, ఆర్ట్స్‌ స్వచ్ఛంద సంస్థ తరఫున ఎన్‌. సన్యాసిరావు రూ. 20వేలు, పీవీ రామ్మోహన్‌ ఫౌండేషన్‌ తరఫున రామ్మోహనరావు లక్ష రూపాయలను, లయన్స్‌ శ్రీకాకుళం సెంట్రల్‌ శాఖ అధ్యక్షుడు నటుకుల మోహన్‌ రూ. 20వేల చెక్కులను కలెక్టర్‌కు అందజేశారు.  ఈ సందర్భంగా కలెక్టర్‌ నివాస్‌ మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. కరోనా జిల్లాకు చేరకుండా మట్టుబెట్టాలన్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావా లని కోరారు. సామాజిక బాధ్యతతో విరాళాలు అందించేవారు సీఎస్‌ఆర్‌ యాక్టివిటీస్, శ్రీకాకుళం పేరున శ్రీకాకుళం కలెక్టరేట్‌ ఆంధ్రా బ్యాంకు శాఖలో గల బ్యాంకు ఖాతా నంబరు 142710100068597, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఏఎన్‌డీబీ 0001427లో జమ చేయవచ్చని, చెక్కులను అందజేయవచ్చని ఆయన తెలిపారు.

క్వారంటైన్‌ గదులు సిద్ధం
కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా స్వీయ నిర్బంధ గదులు (క్వారంటైన్‌) సిద్ధం చేశామని కలెక్టర్‌ చెప్పారు. విదేశాల నుంచి 13 మంది సోమవారం జిల్లాకు విచ్చారని, వారందరినీ నిర్బంధ గదుల్లో పెట్టామని తెలిపారు. వారితోపాటు ఈ నెల 21 తర్వాత వచ్చిన మరో ఐదుగురిని వెరసి 18 మందిని నిర్బంధ గదుల్లో పెట్టామని తెలిపారు. క్వారంటైన్‌ గదుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కదలికలను గమనిస్తున్నామని ఆయన చెప్పారు.జిల్లా వ్యాప్తంగా రాకపోకలు నిషేధించామని, 144వ సెక్షన్‌ అమలులో ఉందని, జిల్లా యంత్రాంగం, పోలీసుల సూచనలు పాటించాలని ప్రజలను కోరారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన 52 మందిపై సోమవారం కేసులు నమోదు చేశారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్పందన కేబుల్‌ ఎండీ దుప్పల వెంకటరావు, లయన్స్‌ క్లబ్‌ సభ్యులు డాక్టర్‌ కృష్ణమోహన్, దేవభూషణరావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.  

విశాఖలో బృందం
జిల్లాకు విదేశాల నుంచి వచ్చేవారిని విశాఖపట్నంలోనే గుర్తించి నిర్బంధ గదుల్లోకి తీసుకువచ్చేందుకు విశాఖలో 12 మందితో కూడిన ఒక రెవెన్యూ బృందం, మరో 12 మందితో కూడిన ఒక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశామని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాకు 859 మంది విదేశాల నుంచి రాగా వారిలో ఇంకా 14 రోజుల గడువు పూర్తి కాని వారు 259 మంది వరకు మాత్రమే ఉన్నారని చెప్పారు.

మరిన్ని వార్తలు