కలువరాయి పోస్టాఫీస్‌లో నిధుల స్వాహా...?

22 Jul, 2020 11:28 IST|Sakshi
కలువరాయి పోస్టాఫీసు

బీపీఎంను సస్పెండ్‌ చేసిన అధికారులు

ఇప్పటివరకూ రూ. 54వేలు రికవరీ

కొనసాగుతున్న విచారణ

బొబ్బిలి రూరల్‌: మండలంలోని కలువరాయి పోస్టాఫీసు లో వివిధ ఖాతాల్లో జమచేసిన మొత్తం స్వాహా అయినట్టు తెలుస్తోంది. దీనికి బీపీఎం లక్ష్మణరావే బాధ్యుడని గుర్తించి ఈ నెల 8న సస్పెండ్‌ చేశారు. ఇప్పటికే రూ. 54వేలు రికవరీ చేయగా... ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కలువరాయి పోస్టాఫీసు పరిధిలో కలువరాయి, వాకాడవలస, ముత్తాయవలస, కుమందానపేటలున్నాయి. 256 ఎస్‌బీ ఖాతాలు, 88 సుకన్య సమృద్ధి యోజన, 408 రికరింగ్‌ డిపాజిట్లు, 30 వరకూ గ్రామీణ తపాలా ఇన్సూరెన్స్‌లు ఉన్నాయి. జూన్‌ ఒకటో తేదీన సుకన్య సమృద్ధి యోజ న లబ్ధిదారు ఒకరు బొబ్బిలిలో తన ఖాతా అప్‌డేట్‌ చేసినపుడు తేడా రావడంతో బీపీఎం అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పార్వతీపురం పోస్టల్‌ సూపరింటెండెంట్‌ ఆదేశాల మేర కు బొబ్బిలి మెయిన్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ టి.గౌతంకుమార్‌ విచారణ చేపట్టారు.

ఆయన పలు ఖాతాలు చెక్‌చేయగా, పాస్‌పుస్తకాల్లో కొట్టివేతలు, దిద్దుబాట్లు గుర్తించారు. మరోవైపు ఖాతాదారులు డిపాజిట్‌ చేయడానికి వేసిన సొమ్ము ఆలస్యంగా జమ అయినట్లు గుర్తించారు. ఇంకా కొన్ని ఖాతాలు చెక్‌ చేయాల్సి ఉంది. ముత్తాయవలసలో సుమా రు 30ఖాతాలు ఇంకా పరిశీలించలేదు. బీపీఎం లక్ష్మణరావు గతంలోనే కొన్ని ఆరోపణలపై సస్పెండ్‌ అయ్యారు. ప్రస్తు తం పోస్టాïఫీసులో ఇన్‌ఛార్జ్‌గా మరో బీపీఎంను పోస్టల్‌ అధికారులు నియమించారు. గ్రామస్తులు లక్ష్మణరావుకు అనుకూలంగా ఉండడంతో విషయం బయటకు పొక్కడంలేదు. దీనిపై లక్ష్మణరావు సాక్షితో మాట్లాడుతూ అక్రమాలు ఏవీ లేవని, రాజకీయ దురుద్దేశంతో తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. దర్యాప్తు అధికారి, బొబ్బిలి పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ టి.గౌతంకుమార్‌ సాక్షితో మాట్లాడుతూ బీపీఎంపై ఆరోపణలు రావడం వాస్తవమేనని, ఆతనిని ఈ నెల 8న సస్పెండ్‌ చేశామని, రూ. 54వేలు రికవరీ చేశామని, విచారణ కొనసాగుతోందని తెలిపారు. 

మరిన్ని వార్తలు