-

రుయాకు మహర్దశ !

11 May, 2018 08:37 IST|Sakshi
రుయా ఆస్పత్రి భవన, రోడ్ల మ్యాప్‌ను పరిశీలిస్తున్న ఈఈలు, అధికారులు

రూ.19.58 కోట్లు మంజూరు

వచ్చే నెలలో అభివృద్ధి పనుల ప్రారంభం

ఆపరేషన్‌ థియేటర్లకు     బ్యాక్టీరియా ఫ్రీ సిస్టం

కాన్పుల ఆస్పత్రికి రూ.3.2 కోట్లు

తిరుపతి (అలిపిరి) :  శ్రీ వేంకటేశ్వర రామ్‌నారాయణ రుయా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి మహర్దశ పట్టనుంది. ఆస్పత్రిలో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం 19.58 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో రోడ్లు, విద్యుత్‌ వసతులు, భవన నిర్మాణాల పనులు చేపట్టనున్నారు. ఫైర్‌ సేప్టీ వ్యస్థతో పాటు ఆపరేషన్‌ థియేటర్లలో అత్యాధునిక బ్యాక్టీరియా ఫ్రీ సిస్టం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే మొదటి దఫా రుయాకు రూ.1.5 కోట్లు మంజూరయ్యాయి. అదే విధంగా కాన్పుల ఆస్పత్రి అభివృద్ధికి రూ.3.2 కోట్లు మంజూరయ్యాయి.

ఎన్‌ఏబీహెచ్‌ అక్రిడిటేషన్‌ సాధన కోసం..
రుయా, మెటర్నటీ ఆస్పత్రులను ఆరు నెలల క్రితం నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ హాస్పిటల్స్‌(ఎన్‌ఏబీహెచ్‌)  కమిటీ పరిశీలించింది. పలు లోపాలను గుర్తించి వాటిని భర్తీ చేయాలని సూచించింది. ముఖ్యంగా ఆస్పత్రిలో ఫైర్‌ సేప్టీ వ్యవస్థ, భవన నిర్మాణాలు, ఆపరేషన్‌ థియేటర్‌లో వసతులను సమకూర్చుకోవాలని సూచించింది. దీంతో రుయా, మెటర్న టీ ఆస్పత్రులు ఎలాగైనా ఎన్‌ఏబీహెచ్‌ గుర్తింపు కోసం మౌలిక వసతులు సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరుచేసింది.

పనులకు త్వరలో శ్రీకారం   
రుయాలో వచ్చే నెల మొదటి వారంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అత్యాధునిక వసతులతో కూడిన ఆపరేషన్‌ థియేటర్‌ అందుబాటులోకి రానుంది. రుయాలో అభివృద్ధి పనుల అనంతరం మరోమారు ఎన్‌ఏబీహెచ్‌ సభ్యులు సందర్శించనున్నారు. అభివృద్ధి పనులపై సంతృప్తి చెందితే ఎన్‌ఏబీహెచ్‌ అక్రిడిటేషన్‌ వచ్చే అవకాశం ఉంది. అక్రిడిటేషన్‌ సాధిస్తే రుయాకు ఇన్‌పేషెంట్ల సంఖ్య బట్టి నిధులు మంజూరవుతాయి. 

ఆస్పత్రిలో పరిశీలన  
రుయా ఆస్పత్రిలో ఎన్‌ఏబీహెచ్‌ అక్రిడిటేషన్‌కు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన స్థల పరిశీలన, మౌలిక సదుపాయల కల్పన తదితర అంశాలపై ఏపీ మెడికల్‌ సర్వీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఎంఎస్‌ఐడీసీ) ఈఈలు గురువారం రుయా ఆస్పత్రిని పరిశీలించారు. నూతన ఆపరేషన్‌ థియేటర్‌ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. ఎలక్ట్రికల్, ఫైర్‌సేప్టీ వ్యవస్థ ఏర్పాటుకు మ్యాప్‌లను పరిశీలించారు. రుయా ఆస్పత్రిని పరిశీలించిన వారిలో ఏపీఎంఎస్‌ఐడీసీ డిజైన్‌ ఈఈ నెహ్రూ, ఈఈ నగేష్‌తో పాటు రుయా ఆర్‌ఏంఓ డాక్టర్‌ శ్రీహరి, రుయా అభివృద్ధి కమిటీ సభ్యులు చిన్నబాబు, అడ్మినిస్టేటర్‌ ఉమాశంకర్‌  ఉన్నారు.

మరిన్ని వార్తలు