సర్కారు బడులకు స్వర్ణయుగం

25 Aug, 2019 10:36 IST|Sakshi
నెల్లిమర్ల మండలం బొద్దపేట పాఠశాలలో పెచ్చులూడిన తగరతి గది స్లాబ్‌

తక్షణ అభివృద్ధి పనులకు రూ.2.5 కోట్లు మంజూరు

21 స్కూళ్లలో బాలురకు, 15 స్కూళ్లలో బాలికలకు మరుగుదొడ్లు

92 స్కూళ్లకు మేజర్‌ మరమ్మతులు

పాఠశాలలకు తీరనున్న అసౌకర్యాల సమస్యలు

సాక్షి, విజయనగరం అర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నూతన ప్రభుత్వం వచ్చాక  భవనాలు, సౌకర్యాల పరిస్థితులను పాఠశాలల నుంచి నేరుగా ఛాయాచిత్రాల ద్వారా తీసుకొనే ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేసింది. వాటిని సమకూర్చే ప్రణాళికలు ఒకవైపు జరుగుతుండగా మరో వైపు గత ప్రభుత్వం విస్మరించిన అభివృద్ధి పనులను పూర్తి చేసే బృహత్తర కార్యక్రమానికి ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగా గత ఏడాది యూ–డైస్‌ ద్వారా సేకరించిన మౌలిక సదుపాయాల ప్రణాళికను ముందుగా పరిశీలించింది. గత ప్రభుత్వం మూడేళ్లుగా పట్టించుకోని మరుగుదొడ్ల, మేజర్‌ మరమ్మతు పనులను ముందుగా పూర్తి చేయాలని సర్వశిక్షా అభియాన్‌ నిర్ణయింది. ఈ చర్యల్లో భాగంగా జిల్లాలోని 128 పాఠశాలలకు రూ.2.5 కోట్లు మంజూరు చేసింది. వీటిని అత్యవసర పనులుగా సర్వశిక్షా అభియాన్‌ చేపట్టడానికి సిద్ధమయింది. గత కొన్నేళ్లుగా కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న పాఠశాలలకు మోక్షం లభించినట్లయింది.

అవసరమైన చోట మరుగుదొడ్లు..    
జిల్లాలోని 128 స్కూళ్లకు సర్వశిక్షా అభియాన్‌ రూ.2.5 కోట్లు నిధులు కేటాయించింది. వీటిలో 21 స్కూళ్లకు రూ.54.60 లక్షలతో బాలురకోసం మరుగుదొడ్లు నిర్మించనున్నారు. జిల్లాలోని గుర్ల మండలంలో 4, పార్వతీపురం మండలలో 3 స్కూళ్లకు, జామి, వేపాడ, ఎస్‌కోట, భోగాపు రం, నెల్లిమర్ల, చీపురుపల్లి, మెరకముడిదాం,  సాలూరు, బొబ్బిలి, గరుగుబిల్లి, జియమ్మవల స, జీఎల్‌పురం, కొమరాడ మండలాల్లో ఒక్కో స్కూల్‌కి బాలుర మరుగుదొడ్డి నిర్మాణానికి ని ధులు మంజూరయ్యాయి. అదేవిధంగా 15 పా ఠశాలల్లో రూ.39 లక్షలతో బాలికలకోసం మరుగుదొడ్లు నిర్మించనున్నారు. వాటిలో అత్యధికంగా సాలూరు మండలంలో 4, పార్వతీపురం, పాచిపెంట మండలాల్లో రెండేసి స్కూళ్లు, మెరకముడిదాం, గరివిడి, గరుగుబిల్లి, కురుపాం, జీఎల్‌పురం, కొమరాడ మండలాల్లో ఒక్కొక్క స్కూల్‌ను గుర్తించారు. ఒక్కో మరుగుదొడ్డికి రూ.2.6లక్షల వంతున నిధులు కేటాయించారు.

92 స్కూళ్లకు మేజర్‌ మరమ్మత్తులు..
జిల్లాలోని 92 పాఠశాలల్లో మేజర్‌ మరమ్మతులు చేపట్టేందుకు రూ.1.53 కోట్లు మంజూరయ్యాయి. ప్రధానంగా బీటలు వారిన తరగతి గదుల గోడలు, స్లాబ్‌లకు ప్రాధాన్యమిచ్చారు. ఆ తరువాత ప్రహరీలు, ఫ్లోరింగ్‌ మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. గుర్తించిన 92 స్కూళ్లలో ఒక్కోదానికి కనీసం రూ.1.2 లక్షల నుంచి అధికంగా రూ.1.8 లక్షల వరకు నిధులు మంజూరు చేశారు. 

మౌలిక సదుపాయాలే తొలిప్రాధాన్యం..
జిల్లా వ్యాప్తంగా గతంలో పెండింగ్‌లో ఉన్న పాఠశాలల్లోని మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. వాటిని తక్షణమే నిర్మించాలని జిల్లాకు రూ.2.5 కోట్లు మంజూరు చేసింది. గతంలోని రెండు సంవత్సరాలలోని యూ–డైస్‌ ద్వారా గుర్తించిన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రస్తుతం తొలి ప్రాధాన్యమిస్తాం.
– ఎం.కృష్ణమూర్తినాయుడు, పీఓ, సర్వశిక్షా అభియాన్‌   

మరిన్ని వార్తలు