ఉడా రద్దంటారు.. పనులు ముద్దంటారు

8 Dec, 2014 01:32 IST|Sakshi

సాక్షి, విజయవాడ : వీజీటీఎం ఉడా అభివృద్ధి పనులు మళ్లీ మొదలు కానున్నాయి. కొద్ది రోజుల్లో ఉడా రద్దు కానున్న నేపథ్యంలో అభివృద్ధి పనులు ఖరారు చేస్తూ టెండర్ కమిటీ ఆమోదముద్ర వేసింది. ఈ పనులన్నీ గత ఏడాది జూన్‌లో ఖరారు చేసినవే. విజయవాడ, గుంటూరు నగరాల్లో కొన్ని ప్రధాన రోడ్లకు అనుసంధానంగా బీటీ రోడ్లు నిర్మించటానికి గతంలో ఉడా రూ.6.5 కోట్లతో కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

ఈ ప్రతిపాదనలను గత సెప్టెంబర్‌లో జరిగిన ఉడా పాలకవర్గ సమావేశం ఆమోదించింది. వెంటనే ఆ ప్రతిపాదనలను ఉడా చైర్మన్, వైస్‌చైర్మన్ పరిశీలించి ఖరారు చేశారు. మున్సిపల్ శాఖలోని టెండర్ కమిటీ కూడా ఆమోదముద్ర వేసింది. మున్సిపల్ శాఖ కూడా వారంరోజుల కిందట పచ్చజెండా ఊపింది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తవడానికి 13 నెలలకుపైగా పట్టడం గమనార్హం.
 
చర్చనీయాంశం : రాజధాని నిర్మాణం కోసం క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్(సీఆర్‌డీఏ) అథారిటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. దీన్ని ఉడా స్థానంలో ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో వీజీటీఎం ఉడా గతంలో సిద్ధం చేసిన ప్రతిపాదనలు కొన్ని ఖరారైనా నిలిచిపోయాయి. ఇలాంటి తరుణంలో పెండింగ్ పనులకు ఆమోదముద్ర వేయడం చర్చనీయాంశమైంది.
 
పనులివీ : విజయవాడ నగరంలో ఆటోనగర్ 100 అడుగుల రోడ్డు నుంచి నవతా ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయం మీదుగా కానూరు వరకు బీటీ రోడ్డును రూ.77.96 లక్షలతో నిర్మించనున్నారు. గుంటూరు నగరంలో ఏటి అగ్రహారం జీరో లైన్ సమీపంలోని ఆర్.యు.బి. నుంచి శ్యామల్‌నగర్ వరకు రోడ్డు, డ్రైయిన్ల నిర్మాణానికి రూ.1.77 కోట్లు, సుద్దపల్లి డొంక నుంచి ఎన్‌హెచ్ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.1.87 కోట్లు, అలాగే నగర శివారులోని ఇన్నర్ రింగ్ రోడ్డులో కనెక్టివిటి రోడ్డు నిర్మాణానికి రూ.1.13 కోట్లు, జేకేసీ కళాశాల నుంచి విద్యానగర్ వరకు ఉన్న డొంక రోడ్డును బీటీ రోడ్డుగా మార్చేందుకు రూ.99.70 లక్షలు కేటాయించారు. దీనిపై ఉడా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.ఎస్. శ్రీనివాస్ ‘సాక్షి’తో మాట్లాడుతూ పనులను టెండర్ కమిటీ ఖరారు చేసిన తర్వాత జీవో వచ్చిందని, వారం రోజుల్లో ఆ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు వర్క్ ఆర్డర్లు అందజేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు