వైఎస్ జగనే కాబోయే ముఖ్యమంత్రి

3 Oct, 2013 04:35 IST|Sakshi
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భావి ముఖ్యమంత్రి అని, ఆయన హయాంలో రానున్న 25 ఏళ్లకాలంలో రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలుస్తుందని జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. స్థానిక పోలీస్ ఐలండ్ కొనసాగుతున్న వైసీపీ దీక్షా శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించారు. తొలుత గాంధీ చిత్రపటానికి, వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 
 
 అనంతరం రిలే దీక్షలు చేస్తున్న పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త తోట గోపి, ఇతర నాయకులకు ఆయన సంఘీభావం తెలిపారు. రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ గాంధీ స్ఫూర్తితో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఒక రోడ్డు మ్యాప్ రూపొందించారన్నారు. మిగిలిన పార్టీ నాయకుల మాదిరి ఆయన వద్ద రెండుకళ్ల సిద్ధాంతాలు లేవన్నారు. మనసా, వాచా, కర్మణా సమైక్యరాష్ట్రం కోసం జగన్‌మోహన్‌రెడ్డి పరితపిస్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగానే ఈనెల 19న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ తలపెట్టారని, దీనికి జిల్లానుంచి పెద్దఎత్తున సమైక్యవాదులు తరలిరావాలని కోరారు.
 
 అక్కడ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంతో వినిపించే సమైక్య సింహనాదం ఢిల్లీ వరకు వినిపించాలన్నారు. ఈ నాదంతో విభజన కుట్ర వెనక్కిపోవాలన్నారు. అనంతరం దీక్షాపరులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. పార్టీ నాయకులు యెగ్గిన నాగబాబు, గుండుమోగుల బలుసులు, గంగుల వెంకటరత్నం, బాలం కృష్ణ, దింటకుర్తి లీలావతి, పైడి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు