భవిష్యత్ అవసరాలకు అణుశక్తి తప్పనిసరి

24 Jan, 2014 02:54 IST|Sakshi
 డెంకాడ, న్యూస్‌లైన్:  దేశంలో  విద్యుత్‌తో పాటు ఇతర రంగాల అవసరాలు తీరాలంటే అణుశక్తి తప్పనిసరి అని  అణుశక్తి కమిషన్ మాజీ  చైర్మన్ డాక్టర్ ఎస్.బెనర్జీ అన్నారు. గురువారం డెంకాడ మండలంలోని చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2030 నాటికి దేశంలో 60వేల బిలియన్ వాట్ల విద్యుత్ అవసరం ఉంటుందన్నారు.  అందువల్ల ఈ అవసరాలను  తీర్చాలంటే తప్పనిసరిగా అణు విద్యు త్‌ను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.  నీరు లేకపోతే జలవిద్యుత్ ఉత్పత్తి అయ్యే పరిస్థితి లేదన్నారు. అలాగే  బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్‌లకు కూడా రానురాను బొగ్గు నాణ్యత లేకపోవడం,  పర్యావరణ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్నారు. 
 
 సౌర విద్యుత్‌కు వచ్చేసరికి ఎండ ఉంటే తప్ప చార్జింగ్ అవదన్నారు. అందువల్ల అణువిద్యుత్  అవసరం  తప్పని సరి కానుందన్నారు. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో కొత్తప్లాంట్  ఏర్పాటు జరుగుతోందన్నారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్‌కు మెజార్టీ ప్రజలు ఆమోదిస్తున్నప్పటికీ  ఇంకా అక్కడ కొంత మందికి అనేక  అనుమానాలు ఉన్నాయన్నారు.  ఈ అనుమానాలపై వారికి  అవగాహన కల్పించి, వారిని కూడా ఒప్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. పరిశ్రమలకు, ఇతర అవసరాలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయాల్సిన అవసరం ఉందని, అలా చేయకపోవడం వల్ల  దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. సమావేశంలో కళాశాల ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ.ఎల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు