రాజూ.. ఒక్కసారి వచ్చి పోరాదా! 

8 Jul, 2019 11:37 IST|Sakshi
అయ్యపురెడ్డి కుమారుడి వివాహానికి కుటుంబ సభ్యులతో కలసి హాజరైన వైఎస్‌ రాజశేఖరరెడ్డి (ఫైల్‌)

మహానేత స్నేహితుడు గుమ్మళ్ల అయ్యపురెడ్డి మనోగతం

ఆయన పలకరింపు ఓ ధైర్యం. ఆయన మాట ఓ భరోసా..  ఆయన నవ్వు మరిచిపోలేనిది.. ఆయనతో స్నేహం ఎంతో అదృష్టం.. అంటున్నారు మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మిత్రుడు గుమ్మళ్ల అయ్యపురెడ్డి. సోమవారం వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. 44 ఏళ్ల అనుంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాలేజీ రోజుల్లో షికార్లు.. రాజకీయ జీవితంలో విశేషాలు.. ముఖ్యమంత్రి స్నేహితుడిగా గడిపిన క్షణాలు తన జీవితానికి మధురస్మృతులు అని.. మహానేత లేని లోటు ఎవరి భర్తీ చేయలేనిదని చెబుతున్నారు. మిగతా విషయాలు ఆయన మాటల్లో...  

వైఎస్‌తో నాకు 44 ఏళ్ల అనుబంధం 

నాకు వైఎస్‌ఆర్‌తో 44 సంవత్సరాల అనుబంధం ఉంది. చాలా డ్యాషింగ్‌గా ఉండేవాడు, ఒక్కోసారి ఆయనను కంట్రోల్‌ చేయడం చాలా కష్టంగా ఉండేది. ఎవరు ఏ సహాయం కోరినా, చేసేవాడు. హౌ ఈజ్‌ యువర్‌ ఫ్రెండ్‌ అని వైఎస్‌ఆర్‌ యోగక్షేమాలను ఆయన తండ్రి రాజారెడ్డి నన్ను అడిగేవారు. ఎన్‌సీసీ అండర్‌ ఆఫీసర్‌గా వైఎస్‌ఆర్‌ ఒకరోజు పరేడ్‌లో నేను సక్రమంగా డ్రిల్‌ చేయకుంటే నన్ను తుపాకీతో కొట్టాడు. నేను రూంమేట్‌ అయినా, నన్ను కొట్టావు కదా, అని ఒక రోజంతా మాట్లాడకపోతే, మరుసటి రోజు నాకు స్వీటు ఇచ్చి దగ్గరకు తీసుకున్నాడు. నన్ను కొట్టడంతో ఇంకా క్లోజ్‌ అయ్యాడు. రాజుకు కాఫీ అంటే చాలా ఇష్టం. 2004 ఎన్నికల్లో ఫలితాలు తారుమారైతే ఎక్కడికైనా పోయి బిజినెస్‌ చేసుకుందామా అన్నాడు. అనంతరం 30 నిమిషాల తరువాత తప్పక విజయం సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేశాడు. పాదయాత్రలో ఆయన పాదాలు పగిలి పుండ్లు అయింటే చూసి తట్టుకోలేక ఆయా ప్రాంతాల్లో ఉన్న మా స్నేహితులైన డాక్టర్లను పంపాము.  ఫైనాన్స్‌లో కూడా అప్పట్లో కొంత కష్టంగా ఉండేది. ఒకానొక సందర్భంలో మీ ఫ్రెండ్‌ను కొంత కంట్రోల్‌ చేసుకోమ్మని, టెలిఫోన్‌ బిల్లు రూ.లక్ష వచ్చింది అని ఆయన తండ్రి రాజారెడ్డి నాతో చెబుతుండేవారు.

  ‘ రాజుకు ర్యాగింగ్‌ అంటే భలే కోపం ... విద్యార్థినిలను ఎవరైనా కామెంట్‌ చేస్తే ఓర్చుకునే వారు కాదు. శారీరకంగా ఎంత బలవంతుడినైనా ఆయనే ముందుగా దెబ్బకొట్టి మాట్లాడేవారు. గుల్బార్గా హెచ్‌కేఈఎస్‌ మెడికల్‌ కళాశాలలో హోరాహోరీగా జరిగిన స్టూడెంట్స్‌ యూనియన్‌ ఎన్నికల్లో చైర్మన్‌గా ఎంఎన్‌ రాఘవేంద్ర గౌడపై గెలిచి లీడర్‌ అయ్యాడు. లీడర్‌షిప్‌ క్వాలిటీస్‌ వైఎస్‌ఆర్‌కు చాలా ఎక్కువ. చదువులో కూడా ఆయన ముందుండే వారు. మేమంతా పడుకున్న తరువాత ఆయన రాత్రంతా చదివేవారు. ఇంగ్లిషులో మంచి పట్టు ఉండేది. కమాండింగ్‌గా మాట్లాడే వాడు. ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం నుంచే ఆయన లీడర్‌ అయ్యాడు. కేవీపీ మాకు జూనియర్‌ 1966లో పరిచయమయ్యాడు. కళాశాలలో అప్పట్లోనే గుంటూరు, విజయవాడ వాళ్ల డామినేషన్‌ ఉండేది. రాజశేఖర్‌రెడ్డికి కన్నడ, ఇంగ్లిషు, తెలుగు భాషలు బాగా వస్తుండడంతో విద్యార్థుల్లో మంచి పట్టు పెరిగేది. కుల, మతాలను అస్సలు పట్టించుకునే వారు కాదు... కేవీపీ కులం ఇప్పటికీ కూడా నాకు తెలియదు.

ఆస్ట్రాలజిస్ట్‌ చెప్పిందే నిజమైంది.. 

ఎంబీబీఎస్‌ చదుతున్న సమయంలో మేము ఒకసారి (రాజు రాలేదు) బెంగళూరులో కృష్ణారావు అనే ఆస్ట్రాలజిస్టును కలిశాము. అప్పట్లో ఆయనకు వైఎస్‌ఆర్‌ వివరాలు చూపిస్తే ‘ హీ ఈజ్‌ బికంఏ చీఫ్‌ మినిష్టర్‌ ఎట్‌ ది ఏజ్‌ ఆఫ్‌ 45 ఆర్‌ 54 ’ అని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే రాజా ముఖ్యమంత్రి అయ్యారు.  వైఎస్‌ఆర్‌కు ఎన్‌టీఆర్‌ సినిమాలంటే చాలా ఇష్టం. గుల్బార్గాకు సమీపంలోని షాబాద్‌లో ప్రతి ఆదివారం తెలుగు సినిమాలు ప్రదర్శించే వారు. మేము అక్కడికి వెళ్లి సినిమాలు చూసే వాళ్లం. వైఎస్‌ఆర్‌ను ఒరే అనే వ్యక్తి పార్థ ఒక్కరే, ఒక ముఖ్యమైన విషయం ఏమంటే రాజు మృతి చెందిన మూడు నెలలకే దిగులుతో పార్థ కూడా మృతి చెందాడు. సంజయ్‌గాంధీ అంటే వైఎస్‌ఆర్‌కు అప్పట్లో చాలా ఇష్టం. యూత్‌ కాంగ్రెస్‌లో ఏపీ నుంచి రాజశేఖర్‌రెడ్డి పేరును ఖరారు చేసి కేంద్రానికి పంపారు.  

వెంటనే కలెక్టర్‌ను పిలిపించి.. 

ఒక ముఖ్యమంత్రి ఎదుట 15 నిమిషాలు కూర్చున్నావు కదా? ఏమీ అడగవా అన్నాడు. అయ్యాను కదా? ప్రస్తుతం నేనున్న ప్రభుత్వ క్వార్టర్‌లో మరికొంత కాలం ఉండేందుకు కలెక్టర్‌ ద్వారా అనుమతిని ఇప్పించాలని కోరాను. వెంటనే హ్హ హ్హ హ్హ... అని బిగ్గరగా నవ్వి ఒక ముఖ్యమంత్రిని కోరాల్సిన కోరికనా, ఇది అన్నాడు. నీవు కోరుకో అన్నావు, నేను కోరుకున్నాను అన్నాను. వెంటనే సూరిని పిలిచి కలెక్టర్‌ను రమ్మనమని చెప్పి, కలెక్టర్‌ అజయ్‌జైన్‌ రాగానే వెంటనే ప్రభుత్వ క్వార్టర్‌ సమస్యను పరిష్కరించమని ఆదేశించారు. మనిషికి చాలా ధైర్యాన్ని ఇచ్చేవాడు. ఇప్పటికీ ఆయన లేని లోటు ఎవరు భర్తీ చేయలేనిది. రాజు ... ఒక్కసారి వచ్చిపోరాదా? అని అనుకుంటూ ఉంటాను’.. అని మహానేత వైఎస్‌ఆర్‌తో ఉన్న జ్ఞాపకాలను అయ్యపురెడ్డి పంచుకున్నారు.       

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు