‘ఆర్టీసీ మూసివేతే చంద్రబాబు లక్ష్యం’

11 May, 2019 12:45 IST|Sakshi

సాక్షి, అమరావతి : ధర్మపోరాట దీక్ష పేరుతో ఆర్టీసీని ఇష్టానుసారంగా వాడుకున్న చంద్రబాబు.. ఆర్టీసిని మూసివేయాలనే లక్ష్యం పెట్టుకున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నాయకుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి  మండిపడ్డారు. పదిరోజుల్లో ఫలితాలు రాబోతుంటే.. క్యాబినేట్‌ మీటింగ్‌ ఎందుకని ప్రశ్నించారు. పెండింగ్‌ బిల్లులు, భూసేకరణ కోసమే క్యాబినేట్‌ మీటింగ్‌ పెడుతున్నారంటూ దుయ్యబట్టారు.

చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు. పెండింగ్‌ బిల్లుల కోసం సీఎస్‌ సమీక్ష చేపడితే.. చంద్రబాబుకు వచ్చిన నష్టమేంటని నిలదీశారు. కాంట్రాక్ట్‌ బిల్లులు చెల్లింపు కోసం ఏర్పాటు చేసిన సీఎమ్‌ఎఫ్‌ఎస్‌ను అవినీతిమయంగా మార్చారని ఆరోపించారు. దివంగత నేత వైఎస్సార్‌ ఎన్నికల తరువాత ఏరోజు కూడా మీటింగ్‌ పెట్టలేదని గుర్తుచేశారు. 

చంద్రబాబుకు చట్టంపై, రాజ్యాంగంపై నమ్మకం లేదని అన్నారు. డేటాను, ఈవీఎంలను దొంగిలించిన వ్యక్తులను ప్రభుత్వ పెద్దలు దాచటం ఎంతవరకు సమంజసమని అన్నారు. వీరి వీరి గుమ్మడి పండు ఆటలా ఉందని హర్షవర్దన్‌ చౌదరి హత్య కేసులో ఉన్నావు దాచుకో.. సుజనా చౌదరి సీబీఐ కేసులో ఉన్నావు దాచుకో.. డేటా దొంగలు దాచుకోండి అన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. అదే రవికుమార్‌ యాదవ్‌, పుల్లారెడ్డి అయితే మాత్రం అమ్మో అమ్మో అని టీవీల్లో కథనాలు ప్రచురించేవని చురకలంటించారు. వారిని ఎందుకు దాస్తున్నారో చెప్పాలని నిలదీశారు. కేసులు పెట్టిన వెంటనే ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి వైఎస్‌ జగన్‌ అని గుర్తు చేశారు. ఏపీలో వ్యవస్థలను ఎందుకిలా దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు