మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం

24 Sep, 2019 17:03 IST|Sakshi

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

సాక్షి, అమరావతి: మహిళల జీవితాల్లో వెలుగులు నింపడమే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం జరిగిన మెప్మా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్లలో మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించిన ఏకైక ప్రభుత్వం వైస్ జగన్‌ ప్రభుత్వమేనని తెలిపారు. ప్రతి మహిళా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని.. స్వయం సహాయక సంఘాలు బలోపేతం కావాలన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఓట్లు దండుకోనేందుకు పసుపు-కుంకుమ పేరుతో మోసం చేసిందన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నాలుగు దశల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేయబోతున్నారని వెల్లడించారు. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుందని పెద్దలు ఊరికే చెప్పలేదని.. అందుకు తాజా ఉదాహరణే ప్రస్తుత వర్షాలన్నారు. నాడు మహానేత వైఎస్సార్‌ హయాంలో.. నేడు ఆయన తనయుడు జగన్‌ పాలనలో కూడా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అక్టోబర్ 15న రైతు భరోసా, ఆటో డ్రైవర్లకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం, జనవరి 15న అమ్మఒడి, పేదలకు ఉగాది నాటికి ఇంటి స్థలాలు, పక్కా ఇల్లు అందుతాయన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జగన్ పాలన జరుగుతోందన్నారు.
 

మరిన్ని వార్తలు