రైతులు చస్తున్నా పట్టదా?

25 Aug, 2014 03:55 IST|Sakshi
రైతులు చస్తున్నా పట్టదా?

రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి

సంబేపల్లె : ఒకవైపు కరువు, మరోవైపు బ్యాంకర్ల వేధింపులు తట్టుకోలేక రైతులు బలవన్మరణానికి పాల్పడుతున్నా రుణమాఫీ అమలులో ఇంకా జాప్యం చేయటం ఏమిటని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. సంబేపల్లె ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు అధికారలు ఒత్తిళ్లతో ఈ నెల 15న ఎర్రమోరంపల్లెకు చెందిన కొత్తమేకల రామచంద్రారెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకోగా, ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే ఆదివారం పరామర్శించారు.

ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు రైతు భార్య యశోదమ్మ, కుమార్తెలు, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచే ఆయన తహశీల్దారు చంద్రమ్మతో ఫోన్‌లో మాట్లాడారు. రైతు కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని కోరారు.  ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించేంత వరకు రైతులను బ్యాంకర్లు అడగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై అసెంబ్లీనూ చర్చిస్తానని చెప్పారు.
 
గాలివీడులో...
టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలివీడు మండల నాయకుడు ఆవుల నాగభూషన్‌రెడ్డి కుమారుడు హరీష్‌రెడ్డి, సోదరుని కుమారుడు ప్రదీప్‌కుమార్‌రెడ్డి, అన్న పుల్లారెడ్డిలను ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. వారిపై దాడులు చేసిన దివాకర్‌రెడ్డి వర్గీయులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సంఘటన జరిగి వారం రోజులైనా ఇంతవరకు ఎవరినీ పోలీసులు అరెస్టు చేయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

ఈ విషయంపై ఎస్పీతో మాట్లాడినా ఇంతవరకు స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో ఇలాంటి దాడులు మంచివి కావని ఎమ్మెల్యే అభిప్రాయడ్డారు. ఎంపీపీ చిన్నారెడ్డి, నాయకులు యధుభూషణరెడ్డి, ఉమాపతిరెడ్డి, కో- ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ సాహెబ్ ఉన్నారు.

మరిన్ని వార్తలు