‘నగరం’ బాధితులకు వైఎస్సార్‌సీపీ చేయూత

30 Jun, 2014 00:30 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, కాకినాడ :నగరం పైపులైన్ పేలుడు సంఘటనలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించి నేరుగా ఇంటింటికీ వెళ్లి  మృతుల కుటుంబాలను ఓదార్చి, అమలాపురం, కాకినాడ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను శనివా రం పరామర్శించి పార్టీ అధినేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారిలో మనోస్థైర్యాన్ని నింపా రు. కుటుంబాలను పరామర్శించే సందర్భంలో రెక్కాడితే గాని డొక్కాడని వారి ఈతిబాధలను తెలుసుకుని చలించిపోయిన జగన్ పార్టీ తరఫున సాయం అందించాలని నిర్ణయాన్ని తీసుకున్నారు. జగన్ ఆదేశాల మేరకు మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.లక్ష, క్షతగాత్రులకు రూ.25వేలు వంతున పార్టీ తరఫున సాయం అందించాలని నిర్ణయించారు.
 
 ఈ విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, అసెంబ్లీలో పార్టీ ఉప నాయకుడు జ్యోతుల నెహ్రూ, పార్టీ సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆదివారం తెలియచేశారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు సేకరించి త్వరలో పార్టీ తరఫున  సాయం అందించనున్నామని వారు తెలిపారు. నగరం ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు పార్టీ అధినేత జగన్ డిమాండ్ చేసినట్టుగా కోటి రూపాయలు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం మానవతాదృక్పథంతో స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు. దేశంలో అతి పెద్ద సంఘటన అయిన నగరం గ్యాస్ విస్ఫోటంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలన్నారు. లేకుంటే పార్టీ తరఫున వారికి వెన్నంటి నిలుస్తామన్నారు. కేజీ బేసిన్‌లో లభ్యమయ్యే గ్యాస్‌లో రాష్ట్ర వాటా సాధించేందుకు ఇప్పటికైనా చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.
 

మరిన్ని వార్తలు